Jagtial Crime : మెట్ పల్లిలో మహిళ దారుణ హత్య, వివాహేతర సంబంధమే కారణమా?-jagtial crime news married woman brutally murdered extra marital relation cause ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Jagtial Crime : మెట్ పల్లిలో మహిళ దారుణ హత్య, వివాహేతర సంబంధమే కారణమా?

Jagtial Crime : మెట్ పల్లిలో మహిళ దారుణ హత్య, వివాహేతర సంబంధమే కారణమా?

Jagtial Crime : జగిత్యాల జిల్లాలో వివాహిత అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. ముందు ఆత్మహత్యగా చిత్రీకరించినా, మృతురాలి కడుపులో కత్తిపోట్లు ఉండడంతో హత్యగా పోలీసులు గుర్తించారు. వివాహేతర సంబంధమే హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఓ వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు.

మెట్ పల్లిలో మహిళ దారుణ హత్య, ప్రియుడే హత్య చేసినట్లు అనుమానం

Jagtial Crime : జగిత్యాల జిల్లాలో దారుణం జరిగింది. వివాహిత దారుణ హత్యకు గురయ్యింది. వివాహేతర సంబంధంతో ప్రియుడే హత్య చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మెట్ పల్లిలో మహిళ హత్య కలకలం సృష్టిస్తుంది. మెట్ పల్లి ప్రభుత్వ ఆసుపత్రి ఎదురు వీధిలో నివాసం ఉండే సింగం మమత(45) అనుమానస్పద స్థితిలో హత్యకు గురయ్యింది. ఉరివేసుకున్నట్లు కనిపించినా కడుపులో కత్తి పోట్లు ఉండడంతో హత్యకు గురైనట్లు పోలీసులు అనుమానిస్తూ ఆ దిశగా విచారణ చేపట్టారు. ఆరపల్లికి చెందిన మమతకు వివాహమై కొడుకు, కూతురు ఉన్నారు. భర్తతో గొడవపడి మూడేళ్ల క్రితం విడాకులు తీసుకుంది. కూతురుతో కలిసి మమత మెట్ పల్లి ఉండగా, కొడుకుతో కలిసి భర్త ఆరపల్లిలో ఉంటున్నారు. భర్త మరో పెళ్లి కూడా చేసుకున్నారు. అనూహ్యంగా మంగళవారం ఉదయం మమత ఇంట్లో అనుమానస్పదస్థితిలో విగతజీవిగా మారింది. బిడ్డ ముందుగా తల్లి ఆత్మహత్య చేసుకుందని తాడు కట్ చేసి కిందికి దింపే క్రమంలో కడుపులో కత్తి గుచ్చుకుపోయిందని పొంతన లేని సమాధానం చెప్పడంతో పోలీసులకు అనుమానం వచ్చి ఆమెను రహస్యంగా విచారించారు. దీంతో అసలు విషయం చెప్పడంతో హత్యకు పాల్పడిన వ్యక్తి పోలీసులకు లొంగిపోయాడు.

ప్రియుడే హత్యకు పాల్పడ్డాడా?

భర్తకు దూరంగా బిడ్డతో కలిసి ఉంటున్న మమతకు మరో వ్యక్తి అప్సర్ తో వివాహేతర సంబంధం ఉన్నట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ప్రియుడే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తూ అతని కోసం ఆరా తీయగా భయాందోళనకు గురైన ప్రియుడు అప్సర్ పోలీసులకు లొంగిపోయాడు. ప్రస్తుతం ప్రియుడు పోలీసులు అదుపులో ఉండగా పోలీసులు హత్యకు గల కారణాలను అన్వేషించే పనిలో నిమగ్నమయ్యారు. కట్టుకున్న భర్తను కాదని మరో వ్యక్తితో సహజీవనం సాగించడంతోనే మమత ప్రాణాలు కోల్పోయిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

తండ్రికి సమాచారం ఇచ్చిన కూతురు

తల్లి హత్యకు గురైన విషయాన్ని కూతురు తండ్రికి సమాచారం ఇచ్చింది. ముందుగా ఉరి వేసుకుందని చెప్పిన కూతురు ఆ తర్వాత కత్తితో ఎవరో దాడి చేసి చంపేశారని తెలిపింది. నాలుగేళ్లుగా దూరంగా ఉంటూ దారుణంగా హత్యకు గురైన భార్యను చూసి భర్త బోరున విలపిస్తూ హంతకున్ని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరాడు. తన కుటుంబంలో చిచ్చుపెట్టింది అతడేనని ఆరోపించాడు. మృతురాలి కుమారుడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మమత హత్యను ఒకరే చేశారా? ఇంకా ఎవరి ప్రమేయం ఉందా? అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు.

HT తెలుగు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ కె.వి.రెడ్డి