Analysis On Telangana Elections : మరో కోణం...! అధికార వ్యతిరేకత కంటే కుల ప్రయోజనాలే ఎక్కువా..?
Telangana Election 2023 : తెలంగాణ ఎన్నికలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఓవైపు ప్రభుత్వ వ్యతిరేకత ఉందన్న చర్చ గట్టిగా వినిపిస్తున్న క్రమంలో… మరోవైపు కుల సమీకరణాలు కీలకంగా మారాయి. దీంతో వచ్చే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేకత కంటే… కుల సమీకరణాల ప్రభావమే ఎక్కువ ఉంటుందా అన్న డిస్కషన్ మొదలైంది.

Telangana Elections 2023: తెలంగాణలో ఎన్నికల యుద్ధం మొదలైంది. ప్రధాన పార్టీలు వ్యూహలకు ప్రతివ్యూహాలను రచిస్తూ... ప్రత్యర్థులను బోల్తా కొట్టించేలా అడుగులు వేస్తున్నాయి. మరోసారి గెలిచి హ్యాట్రిక్ అందుకోవాలని అధికార బీఆర్ఎస్ చూస్తుంటే.... ఈసారి పవర్ లోకి రావటమే టార్గెట్ గా కాంగ్రెస్ కసిగా పని చేస్తోంది. ఇక బీజేపీ కూడా ధీమాను వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో... కేవలం అధికార వ్యతిరేకతనే కాదు... కుల సమీకరణాలు కూడా ఈ ఎన్నికల్లో కీలకంగా మారాయి. ఈ విషయంలో ప్రతి పార్టీకంటూ ఓ లెక్క ఉన్నట్లు కనిపిస్తోంది. అయితే డిసెంబర్ 3న వచ్చే ఫలితాల్లో ఈ అంశాలు ప్రతిబింబిస్తాయా..? లేదా...? అనేది ఆసక్తికరంగా మారింది.
ఎన్నికల రాజకీయంలో ఒక్కోసారి కుల సమీకరణాలకు కూడా ప్రాధాన్యత ఉంటుంది. అధికారం దక్కే విషయంలో ఆయా వర్గాలకు ఇచ్చే రాజకీయ సాధికారికత హామీ ప్రభావం చూపుతుంది. తెలంగాణ ఏర్పాటు తర్వాత అంటే… 2014 నుంచి ఇవాళ్టి వరకు కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వచ్చింది. కానీ ఈసారి ఎన్నికలను గమనిస్తే.... ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు గట్టి పోటీ పరిస్థితి నెలకొనటంతో పాటు....మరోవైపు కాంగ్రెస్ కు కూడా చావోరేవో అన్న సిచ్యూయేషన్ నెలకొందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.
మరో మాటలో చెప్పాలంటే.... ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ ఎన్నికలు అన్ని ప్రధాన పార్టీలకు సవాల్ గానే మారాయని అనొచ్చు. మూడోసారి అధికారంలోకి రావాలని అనుకుంటున్న కేసీఆర్... ప్రతిపక్షానికి ఛాన్స్ ఇస్తే రాష్ట్రం మళ్లీ 50 ఏళ్లు వెనక్కి వెళ్తోందని చెబుతున్నారు. ఓ రకంగా కాంగ్రెస్ ను ప్రధానంగా టార్గెట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ ఎన్నికల్లో ఓటరు ఎలా టర్న్ అవుతాడనేది చెప్పటం కష్టంగానే ఉంది. రెండుసార్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్... స్వరాష్ట్ర ఆకాంక్షలను నెరవేర్చటంలో విఫలమైందన్న చర్చ వినిపిస్తుండగా.... కేసీఆర్ మాత్రం సంక్షేమ మంత్రంతో తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నారు.
రెండు పర్యాయాల కేసీఆర్ పాలనపై వ్యతిరేకత ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. కానీ ఫలితాలపై పలు అంశాలు ప్రభావం చూపిస్తాయని చెప్పటంలో సందేహాం లేదు. అయితే పూర్తి ఫలితాలు ఎలా ఉండబోతుందనేది చెప్పటం కష్టమే. డిసెంబర్ 3వ తేదీన వచ్చే ఫలితాల సందర్భంగా టపాసులు పేలే ప్లేస్... తెలంగాణ భవన్ అవుతుందా...? లేక గాంధీ భవన్ అవుతుందా...? వీటికి భిన్నంగా కేసీఆర్ వ్యతిరేక ఓట్లను విజయవంతంగా పోలరైజ్ చేసి... మూడోసారి ఆయనకు పరోక్షంగా సాయం చేశామని బీజేపీ నవ్వుకుంటుందా...?అనేది కూడా చూడాలి.
కేవలం కేసీఆర్ రెండు పర్యాయాల పాలనపై ఉన్న వ్యతిరేకతే ఈ ఎన్నికల్లో ఆధిపత్యం చెలాయించే అంశం మాత్రం కాదని చెప్పొచ్చు. బీసీ సామాజికవర్గ ఓట్లు ఈసారి కీలకంగా మారుతాయని భావించవచ్చు. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలు... ఈ విషయంలో భారీగానే ఆశలు పెట్టుకున్నాయి. ఇంకాస్త లోతుగా చూస్తే... ఈ అంశంలో బీజేపీ ముందంజలో ఉంది. బీసీ కులాలైన... మున్నూరు కాపు మరియు ముదిరాజ్ నాయకత్వాలకు రాజకీయంగా ప్రాబల్యం ఉండగా... వీరిని తమవైపు తిప్పుకునే పనిలో ఉంది కమలదళం. వీటికి తోడు కేసీఆర్ వ్యతిరేకతను ఓట్ల రూపంలో పోలరైజ్ చేయటంతో పాటు.... అదనంగా వారి సంక్షేమం కోసం కీలక హామీలను ఇవ్వటం కూడా ఎన్నికల్లో గణనీయమైన పాత్ర పోషించే అవకాశం బీజేపీకి ఉండొచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మరోవైపు బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల నుంచి నేతలను భారీగా ఆకర్షిస్తోంది కాంగ్రెస్. చేరికల విషయంలో ముందంజలో ఉన్నట్లు కనిపిస్తోంది. అంతేకాకుండా...కర్ణాటక ఫార్ములా మాదిరిగా 'ఉచితాల' వ్యూహంతో అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో పార్టీలో అంతర్గత కలహాలు ఉండటం కూడా ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా రెడ్డి నాయకత్వం... ఆధిపత్య వైఖరిపై అట్టడుగు వర్గాలకు చెందిన బీసీ నేతలు పోరాడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా... కాంగ్రెస్ ప్రకటించిన 55 మందితో కూడిన తొలి జాబితా మంటలను రేపింది. టికెట్ల కేటాయింపులో తమకు ప్రాధాన్యత ఇవ్వాలని బీసీ నేతలు... గొంతెత్తున్నారు. జనాభా ధామాషా ప్రకారం సీట్లు ఇవ్వాలని కోరటం కాంగ్రెస్ కు తలనొప్పిగా మారింది. తొలి జాబితాను లోతుగా పరిశీలిస్తే.... రెడ్డి సామాజికవర్గానికి ఎక్కువ సీట్లు ఇవ్వటంతో పాటు... ఆ సామాజికవర్గ వారే ఓట్లను పట్టుకుంటారనే విశ్వాసాన్ని కాంగ్రెస్ హైకమాండ్ వారిపై ఉంచినట్లు కనిపించింది. అయితే దీని ప్రకారం చూస్తే... ఉదయపూర్ డికర్లేషన్ తో పాటు.... బీసీలకు పెద్దపీట వేస్తామని చెప్పిన హామీ నుంచి కాంగ్రెస్ దాదాపు వైదొలిగినట్లే కనిపిస్తోంది. రెడ్డి సామాజికవర్గం ఆధిపత్యం ఎక్కువగా కనిపించటంతో పాటు... బీసీలకు పెద్దగా దక్కేదేమి లేదనిపిస్తోంది. అంతేకాకుండా... వారి ప్రభావం లేకుండా, మైనార్టీలు ఎక్కువగా ఉన్న హైదరాబాద్ లో వారికి ఎక్కువ సీట్లు ఇవ్వటం చూస్తే... బీసీల విషయంలో కాంగ్రెస్ వైఖరెంటో క్లియర్ కట్ గా అర్థమవుతోంది.
నిజానికి బీసీల మద్దతు లేకుండా కాంగ్రెస్ అధికారంలోకి రాలేదు. ఇలాంటి నేపథ్యంలో.... బీసీ జనాభా లేని నియోజకవర్గాల్లో, గతంలో ఎన్నడూ కాంగ్రెస్ గెలవని నియోజకవర్గాల్లోనూ బీసీ నేతలకు సీట్లు కేటాయించడం ఏ మూలకు ఉపయోగపడుతుందో తెలియడం లేదు. టిక్కెట్ల పంపిణీ తీరుపై బీసీ నాయకత్వంలో అసంతృప్తి నెలకొనడం, ఎక్కువ సీట్లు కావాలంటూ బీసీ నాయకత్వ విజ్ఞప్తులను పట్టించుకోకపోవడంతో కాంగ్రెస్ అధిష్టానం... బీసీలను గాలికి వదిలిసేందన్న భావన ఆ వర్గ నేతల్లో కలుగుతోందనే చెప్పొచ్చు. అయితే మరో విషయాన్ని కూడా ఇక్కడ కాంగ్రెస్ విస్మరించిందనే అర్థం చేసుకోవచ్చు. తాము వదిలేస్తున్న అంశాన్ని.... మున్నూరుకాపు, ముదిరాజ్ ల రూపంలో తమవైపునకు తిప్పుకునేందుకు బీజేపీ వేస్తున్నవ్యూహాలను పసిగట్టలేకపోవటం కొసమెరుపు.
బీసీ నాయకత్వాన్ని తమవైపు తిప్పుకొనేందుకు బీజేపీ గట్టి వ్యూహలతో ముందుకెళ్తోంది. ఆ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వటం ద్వారా.... నియోజకవర్గాల్లో 15 నుంచి 20 వేల ఓట్లు సాధించించే అవకాశం కనిపిస్తోంది. ఫలితంగా కేసీఆర్ వ్యతిరేక ఓట్లను చీల్చడంలోనూ కీలక ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది ఓ రకంగా కేసీఆర్ కు పరోక్షంగా లాభించే విషయమనే చెప్పొచ్చు. బీసీల మద్దతుతో మంచి సంఖ్యలో సీట్లు గెలుచుకోవాలనే ద్వంద్వ వ్యూహాన్ని కూడా అమలు చేసే పనిలో ఉంది బీజేపీ. ఈ కులాల ఓట్ల మద్దతుతో హోరాహోరీ పోరు జరుగుతోందని..... అదే సమయంలో అది సాధ్యమైనా, సాధ్యంకాకపోయినా కనీసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన సీట్లను కాంగ్రెస్‌కు దక్కకుండా ఆపే ప్రయత్నం కూడా జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు సరికొత్త కోణాన్ని తెరపైకి తీసుకువస్తున్నారు.
పాత మరియు కొత్త తరం రాజకీయాలను చూస్తున్న సగటు తెలంగాణ ఓటరు.... తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షలు, సామాజిక న్యాయం అమలు విషయంలో ఆగ్రహంతో ఉండే అవకాశం కూడా ఉండొచ్చు. ఈ క్రమంలో తన వ్యక్తిగత లేదా సామాజిక ప్రయోజనాల పంచన చేరే అవకాశం లేకపోలేదు. మరో మాటలో చెప్పాలంటే అధికార వ్యతిరేకత అనే అంశంతో సంబంధం లేకుండా... కుల సమీకరణాలవైపు మళ్లే అవకాశం కూడా ఇక్కడ ఉంటుంది.