IT Raids Malla Reddy : రెండో రోజు సోదాలు... మల్లారెడ్డి కుమారుడికి అస్వస్థత
IT Raids On Minister Malla Reddy : మంత్రి మల్లారెడ్డి ఇంట్లో రెండో రోజు కూడా ఐటీ అధికారుల సోదాలు జరుగుతున్నాయి. కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
IT Raids On Minister Malla Reddy Updates: మంత్రి మల్లారెడ్డి(Minister Malla Reddy), ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ అధికారులు(IT Officials) ఏకకాలంలో దాడులు చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే అధికారుల సోదాలు మెుదలయ్యాయి. సుమారు 50 బృందాలుగా ఏర్పడి.. ఆయనకు సంబంధించిన సంస్థలు, కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో సోదాలు చేపట్టగా.. బుధవారం కూడా కొనసాగుతున్నాయి. షిఫ్ట్ వైజ్ గా అధికారులు పని చేస్తున్నారు.
మంత్రి కుమారుడికి అస్వస్థత...
మరోవైపు బుధవారం తనిఖీలు కొనసాగుతున్న క్రమంలో...మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావటంతో ఆస్పత్రికి తరలించారు. మరోవైపు మంగళవారం డబ్బుతోపాటు కీలక డాక్యుమెంట్స్ స్వాధీనం చేసుకున్నారు ఐటీ అధికారులు. నిన్న సంతోష్ రెడ్డి తలుపులు తెరవకపోవడంతో… డోర్స్ బద్దలు కొట్టి లోపలికి వెళ్లారు. ఇప్పటివరకు 4.5 కోట్ల నగదును సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ముందుగా కొంపల్లిలోని గెటెడ్ కమ్యూనిటీల ఉన్న మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డితో పాటు అల్లుడు రాజశేఖర్ రెడ్డి ఇళ్లలో రైడ్ చేశారు. ఆ తరువాత విద్యాసంస్థల్లో తనిఖీలు నిర్వహించారు. మల్లారెడ్డికి సంబంధించిన యూనివర్సీటీ, మెడికల్ కాలేజీలు, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. మల్లారెడ్డి కొడుకు, అల్లుడు పలు రియల్‌ఎస్టేట్ పలు సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. జీడిమెట్ల పైప్‌లైన్ రోడ్‌లోని రఘునాథ్ రెడ్డి ఇంట్లోనూ దాడులు జరిగాయి. మల్లారెడ్డికి వరుసకు అల్లుడైన సంతోష్ రెడ్డి ఇంటికి వెళ్లి ఐటీ అధికారులు ఆయన డోర్ ఓపెన్ చేయకపోవడంతో డోర్‌ను పగలగొట్టి లోపలివెళ్లిన అధికారులు.. డాక్యుమెంట్లను పరిశీలించారు.
మల్లారెడ్డి కుటుంబం నిర్వహిస్తున్న ఇంజినీరింగ్, వైద్య, డెంటల్, ఇతర రియల్ ఎస్టేట్(Real Estate) వ్యాపారాలకు సంబంధించిన లావాదేవీలపై అధికారులు ప్రధానంగా దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. మల్లారెడ్డికి చెందిన సంస్థల డైరెక్టర్లు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల ఇళ్లలోనూ అధికారులు తనిఖీలు చేశారు. సోదాల్లో దొరికిన కీలక పత్రాలను అధికారులు విశ్లేషిస్తున్నారు. ఆస్తులు, ఆదాయ వనరులు, పన్ను చెల్లింపుల వివరాలపై ఆరా తీస్తున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు, పన్ను చెల్లింపుల్లో తేడాలు ఉన్నట్టుగా దృష్టికి రావడంతో తనిఖీలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
దొంగ వ్యాపారాలు చేస్తున్నామా -? మంత్రి మల్లారెడ్డి
ఈ సోదాలపై మంత్రి మల్లారెడ్డి స్పందించారు. ఐటీ రైడ్స్ రాజకీయ కక్షతో చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము ఏమైనా దొంగ వ్యాపారాలు చేస్తున్నామా..? అని ప్రశ్నించారు. తన కుమారుడిపై సీఆర్పీఎఫ్ వాళ్లు దాడి చేశారని ఆరోపించారు. తాము స్మగ్లింగ్ లు చేయటం లేదన్నారు.