IT Raids On Mallareddy : సోదాల్లో ఐటీ అధికారులకు ఏం దొరికాయి? మల్లారెడ్డి ఏం అన్నారు?-it raids on minister mallareddy properties and collected key documents
Telugu News  /  Telangana  /  It Raids On Minister Mallareddy Properties And Collected Key Documents
మంత్రి మల్లారెడ్డి
మంత్రి మల్లారెడ్డి

IT Raids On Mallareddy : సోదాల్లో ఐటీ అధికారులకు ఏం దొరికాయి? మల్లారెడ్డి ఏం అన్నారు?

23 November 2022, 23:22 ISTHT Telugu Desk
23 November 2022, 23:22 IST

IT Searches In Telangana : మంత్రి మల్లారెడ్డి లక్ష్యంగా రెండోరోజు ఐటీ సోదాలు జరిగాయి. పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.

రాష్ట్రమంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy)కి సంబంధించి.. రెండు రోజులుగా ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దీంతో ఈ విషయం చర్చనీయాంశమైంది. కొన్ని రోజులుగా రాష్ట్రంలో ఈడీ, ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. కేంద్రం కావాలనే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై ఐటీ, ఈడీని ఉసిగొల్పుతుందని గులాబీ నేతలు ఆరోపిస్తున్నారు. మంత్రి మల్లారెడ్డితోపాటుగా ఆయన కుమారులు, బంధువులు ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు ఏకధాటిగా తనిఖీలు చేస్తున్నారు. మల్లారెడ్డి సోదరుడు గోపాల్‌రెడ్డి, అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డి, వియ్యంకుడు మర్రి లక్ష్మారెడ్డి ఇళ్లలోనూ సోదాలు జరిగాయి.

అయితే మెుదటిరోజు 50 బృందాలు సోదాల్లో పాల్గొనగా.. రెండోరోజు 65 బృందాలు సోదాలు చేశాయి. దీనికోసం కర్ణాటక(Karnataka), ఒడిశా నుంచి ఐటీ అధికారులను రప్పించారు. మెుత్తం 200 మంది అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు. మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించి.. ఆదాయానికి మించిన ఆస్తులు, ఐటీ రిటర్ట్స్ పై ఆరా తీస్తున్నారు. కీలకమైన పత్రాలతోపాటుగా బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. అల్లుడు రాజశేఖ్ రెడ్డి ఇంట్లో 4 కోట్ల క్యాష్ తోపాటుగా.. మరికొన్ని ప్రాంతాల్లోనూ నగదు స్వాధీనం చేసుకున్నట్టుగా సమాచారం.

మల్లారెడ్డి విద్యాసంస్థల్లో ఫీజు అధికంగా వసూలు చేస్తున్నట్టుగా అధికారులు గుర్తించారు. అయితే ఈ మెుత్తం.. కూడా నగదుగానే తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ డబ్బులు స్థిరాస్తి వ్యాపారంలో పెట్టుబడులు(Investments) పెట్టారని సమాచారం. రెండు రోజు సుమారుగా రూ.6 కోట్ల వరకూ నగదును స్వాధీనం చేసుకున్నారు. స్థిరాస్తులు తక్కువ విలువకు చూపినట్టుగా అధికారులు ఆధారాలు సేకరించారు.

మంగళవారం సోదాల్లో రూ.4 కోట్ల 80 లక్షల వరకు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. త్రిశూల్ రెడ్డి నివాసంలో రూ.2 కోట్ల 80 లక్షలు, మర్రి రాజశేఖర్‌ రెడ్డి ఇంటిలో రూ.2 కోట్లు, మల్లారెడ్డి బామ్మర్ది కొడుకు సంతోష్ రెడ్డి నివాసంలో రూ.2 కోట్లు స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తోంది. గురువారం కూడా ఈ సోదాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది.

మల్లారెడ్డికి సంబంధించిన యూనివర్సీటీ, మెడికల్‌ కాలేజీలు, ఇంజినీరింగ్‌ కాలేజీ(Engineering Colleges)ల్లోనూ సోదాలు జరిగాయి. క్రాంతి బ్యాంకు ఛైర్మన్ ను అధికారులు ఆరా తీశారు. మల్లారెడ్డి కొడుకు, అల్లుడు పలు రియల్‌ఎస్టేట్‌(Real Estate) సంస్థల్లో పెట్టుబడులు పెట్టారు. వీరిపైనా నిఘా పెట్టారు అధికారులు. బుధవారం తనిఖీలు కొనసాగుతున్న క్రమంలో మంత్రి మల్లారెడ్డి కుమారుడు మహేందర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ఛాతిలో నొప్పి రావటంతో ఆస్పత్రికి తరలించారు. మంత్రి ఇంట్లో తనిఖీలు చేస్తున్న సమయంలో పని మనిషికి ఫీట్స్ వచ్చింది. మరోవైపు మల్లారెడ్డి కోడలిపైనా ప్రశ్నల వర్షం కురిపించారు అధికారులు. మల్లారెడ్డి వైద్య కళాశాలలకు ఇన్‌ఛార్జ్‌గా ఉన్నారు ప్రీతిరెడ్డి.

మల్లారెడ్డి ఏం చెప్పారంటే

ఐటీ దాడులపై మంత్రి మల్లారెడ్డి(Minister Mallareddy) స్పందించారు. తమ వ్యాపారాలు, ఆస్తులకు సంబంధించి.. అన్ని లెక్కలు సరిగానే ఉన్నాయని చెప్పారు. కళాశాలలు(Colleges), ఆసుపత్రులు(Hospitals), ఆస్తుల వివరాలను ఐటీ అధికారులకు తెలిపానని చెప్పారు. అనుమతులతోనే కాలేజీలు, ఆసుపత్రులు నిర్వహిస్తున్నట్టుగా స్పష్టం చేశారు. ఈ సోదాలతో తనకు, కుటుంబ సభ్యులకు ఇబ్బంది లేదన్నారు.