HYD IT Raids: హైదరాబాాద్‌లో సినీ ప్రముఖులపై ఐటీ దాడులు, 8 ప్రాంతాల్లో సోదాలు, సంక్రాంతి సినిమాలపై ఫోకస్…
HYD IT Raids: హైదరాబాద్‌లో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. జనవరి 21వ తేదీ మంగళవారం తెల్ల వారుజామున హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో సినీ ప్రముఖులపై ఐటీ బృందాలు దాడులు జరిపాయి. సంక్రాంతికి విడుదలైన సినిమాలే లక్ష్యంగా ఈ సోదాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది.
HYD IT Raids: హైదరాబాద్‌లో సినీ ప్రముఖులు, నిర్మాతల ఇళ్లపై ఐటీ శాఖ దాడులు జరుపుతోంది. నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. బంజారా హిల్స్, జూబ్లిహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి తదితర ప్రాంతాల్లో ఐటీ బృందాలు సోదాలు నిర్వహిస్తున్నారు. ప్రధానంగా సంక్రాంతికి విడుదలైన భారీ బడ్జెట్ సినిమాలు లక్ష్యంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నారు.

వందల కోట్ల రుపాయల వ్యయంతో నిర్మించిన చిత్రాల్లో భారీగా పన్ను ఎగవేతలు ఉన్నాయని ఐటీ శాఖ అనుమానిస్తోంది. ఒక్కో చిత్రాన్ని వందల కోట్లతో నిర్మంచినట్టు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఐటీ శాఖ ఏకకాలంలో తనిఖీలు చేపట్టింది. తెలంగాణకు చెందిన ప్రముఖ సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ లక్ష్యంగా ఈ సోదాలు జరుగుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. సంక్రాంతికి విడుదలైన చిత్రాల్లో భారీ బడ్జెట్ చిత్రాలపై ప్రధానంగా ఐటీ శాఖ దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. సినీ నిర్మాతలు, వారి సమీప బంధువుల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు
ఐటీ సోదాలు తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్‌కార్పొరేషన్ ఛైర్మన్ , సినీ నిర్మాత దిల్ రాజు ఇల్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దిల్ రాజు , శిరీష్ , దిల్ రాజు కూతురు హన్సిత రెడ్డి నివాసాలలో ఐటి సోదాలు జరుగుతున్నాయి. సంక్రాంతికి విడుదలైన గేమ్ చెంజర్, సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు దిల్ రాజు ప్రొడక్షన్స్‌లో విడుదలయ్యాయి.
హైదరాబాద్‌లో ఐటీ అధికారులు సోదాలు జరుపుతున్న సంస్థల్లో మైత్రి మూవీ మేకర్స్ కూడా ఉంది. మైత్రి నవీన్, సీఈవో చెర్రీ ఇళ్లు,ఆఫీసుల్లో తనిఖీలు చేస్తున్నారు. మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లలోనూ సోదాలు నిర్వహిస్తున్నారు. పుష్ప-2 సినిమా నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ నివాసాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
ఇటీవల విడుదలైన సినిమాల్లో పుష్ప-2 సినిమా భారీ కలెక్షన్లు సాధించింది. దీంతో పాటు మ్యాంగో మీడియా సంస్థపైనా ఐటీ దాడులు జరుగుతున్నాయి. మ్యాంగో మీడియా సంస్థ భాగస్వాముల ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు.