IT Raids : ఫీనిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థపై ఐటీ దాడులు
హైదరాబాద్ నగరంలోని ఫీనిక్స్ గ్రూపు కంపెనీపై ఐటీ అధికారులు దాడులు చేశారు. నగరంలో 20 చోట్లకు పైగా సోదాలు నిర్వహించారు.
ఫీనిక్స్ కంపెనీపై ఐటీ అధికారులు దాడులు చేశారు. సంస్థకు చెందిన డైరెక్టర్ల ఇళ్లలో కూడా ఐటీ అధికారులు ఉదయం నుంచి తనిఖీలు నిర్వహించారు. ఫీనిక్స్ సంస్థ హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న విషయం తెలిసిందే. నగరంలో 20 చోట్లకు పైగా ఐటీ అధికారులు దాడులు చేసినట్టుగా తెలుస్తోంది. నానక్‌రాంగూడ, గోల్ఫ్‌ఎడ్జ్ ఆఫీసుల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
ఇటీవల ఫీనిక్స్ సంస్థ ఛైర్మన్ చుక్కపల్లి సురేష్ జన్మదిన వేడుకలు నగరంలోని హెచ్‌ఐసీసీలో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. బర్త్ డే వేడుకలకు రాజకీయ ప్రముఖులు, వీఐపీలు, కలెక్టర్లు, బాలీవుడ్, టాలీవుడ్ స్టార్లు కూడా వచ్చారు. వేడుకలకు భారీ మొత్తంలో డబ్బులు ఖర్చు చేశారు. ఫీనిక్స్ సంస్థలో పలువురు రాజకీయ ప్రముఖులు పెట్టుబడులు కూడా పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సంస్థపై ఐటీ అధికారులు దృష్టి పెట్టినట్టుగా సమాచారం.
నగరంలోని డైరెక్టర్ల నివాసాలతో పాటు హైదరాబాద్‌లో వ్యవస్థాపకుడు సురేష్ చుక్కపల్లి ఇంట్లో కూడా ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఈ కంపెనీని సురేష్ చుక్కపల్లి (ఆయన అంతకుముందు ల్యాంకో గ్రూపులో భాగం) సుమారు 20 సంవత్సరాల క్రితం ప్రారంభించారు. అయితే కూకట్‌పల్లిలో ల్యాండ్ డీల్ విషయంలో ఫీనిక్స్, మరో రెండు కంపెనీల మధ్య జరిగిన లావాదేవీకి సంబంధించి దాడులు జరుగుతున్నట్టుగా కూడా ప్రచారం జరుగుతోంది. పలువురు రాజకీయ నాయకులు, అధికారులు, సెలబ్రిటీలు కంపెనీలో పెట్టుబడులు పెట్టినట్లు సమాచారం. ఈ దాడులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఇటీవలే.. వాసవీ గ్రూప్ పై ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. మళ్లీ.. మరో రియల్ ఎస్టేట్ కంపెనీ ఫీనిక్స్ గ్రూప్‌పై ఏకకాలంలో దాడులు జరిగాయి. బంజారాహిల్స్‌లోని రోడ్ నంబర్ 45లో ఉన్న కార్పొరేట్ కార్యాలయంతోపాటు 20 వేర్వేరు ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి.