ఓ అప్పీల్ పరిష్కారానికి లంచంగా రూ.2.5 కోట్ల ప్లాట్ -వెలుగులోకి ఐటీ కమిషనర్ జీవన్ లాల్ అక్రమాలు-it commissioner jeevan lal faces corruption allegations 2 crore 50 lakh plot offered as bribe ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  ఓ అప్పీల్ పరిష్కారానికి లంచంగా రూ.2.5 కోట్ల ప్లాట్ -వెలుగులోకి ఐటీ కమిషనర్ జీవన్ లాల్ అక్రమాలు

ఓ అప్పీల్ పరిష్కారానికి లంచంగా రూ.2.5 కోట్ల ప్లాట్ -వెలుగులోకి ఐటీ కమిషనర్ జీవన్ లాల్ అక్రమాలు

ముంబయిలో రూ.70 లక్షల లంచం తీసుకుంటూ హైదరాబాద్ ఆదాయపు పన్ను కమిషనర్ జీవన్ లాల్ సీబీఐకి పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. విచారణలో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. జీవన్ లాల్ గతంలో రూ.2.5 కోట్ల విలువైన ప్లాట్ లంచంగా తీసుకున్నట్లు గుర్తించారు.

ఓ అప్పీల్ పరిష్కారానికి లంచంగా రూ.2.5 కోట్ల ప్లాట్ -వెలుగులోకి ఐటీ కమిషనర్ జీవన్ లాల్ అక్రమాలు

హైదరాబాద్ ఆదాయపు పన్ను కమిషనర్ జీవన్ లాల్ అవినీతి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇటీవల ముంబయిలో రూ.70 లక్షలు లంచం తీసుకుంటూ సీబీఐకి జీవన్‌లాల్ చిక్కారు. ఈ కేసు దర్యాప్తులో సీబీఐకి కీలక అంశాలు తెలిశాయి.

జీవన్ లాల్ ముంబయికి చెందిన ఎన్‌డీడబ్ల్యూ డెవలప్మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి రూ.2.5 కోట్ల విలువైన ప్లాట్‌ను లంచంగా తీసుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఈ ప్లాట్ ను ఖమ్మం జిల్లాకు చెందిన బినామీ దండెల్‌ వెంకటేశ్వరుల పేరిటరిజిస్ట్రేషన్‌ చేయించినట్లు సీబీఐ అధికారులు గుర్తించారు.

మాజీ ఎమ్మెల్యే కుమారుడు

ఖమ్మం జిల్లా వైరా మాజీ ఎమ్మెల్యే రాములు నాయక్ కుమారుడు, 2004 బ్యాచ్ ఐఆర్ఎస్ అధికారి అయిన జీవన్ లాల్ రూ.70 లక్షల లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కారు. ఆదాయపు పన్ను శాఖ కమిషనర్‌గా పనిచేస్తోన్న జీవన్ లాల్ ఓ ప్రైవేట్ సంస్థకు అనుకూలంగా, మధ్యవర్తుల ద్వారా లంచం తీసుకుంటున్న సమయంలో సీబీఐ రైడ్ చేసి అరెస్టు చేసింది.

నలుగురి అరెస్ట్

ఈ కేసులో జీవన్ లాల్‌తో పాటు మరో నలుగురిని సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ముంబయిలో లంచం తీసుకుంటుండగా ఒక మధ్యవర్తిని పట్టుకున్న సీబీఐ... కేసు దర్యాప్తులో హైదరాబాద్‌లో జీవన్ లాల్‌తో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేసింది. సీబీఐ సోదాల్లో రూ.69 లక్షల నగదు, కీలక పత్రాలు దొరికాయి.

సీబీఐ దర్యాప్తులో విస్తుపోయే అంశాలు వెలుగులోకి వచ్చాయి. జీవన్ లాల్ ముంబయిలోని మరో రెండు సంస్థల నుంచి రూ.35 లక్షలు లంచం తీసుకున్నట్లు దర్యాప్తులో సీబీఐ గుర్తించింది. ఈ సొమ్మును హవాలా ద్వారా స్వీకరించినట్లు బయటపడింది.

పెండింగ్ ఫైల్ క్లియర్ కు రూ.1.20 కోట్ల లంచం

షాపూర్జీ పల్లోంజీ నిర్మాణ సంస్థ ట్యాక్సేషన్‌ ఫైల్ పెండింగ్‌ను క్లియర్‌ చేసేందుకు రూ.1.20 కోట్లు లంచం డిమాండ్‌ చేసినట్లు సీబీఐకి పక్కా సమాచారం అందింది. ఇద్దరు మధ్యవర్తుల ద్వారా రూ.15 లక్షలు లంచం తీసుకున్న జీవన్‌ లాల్‌, మరో రూ.70 లక్షలు తీసుకుంటుండగా సీబీఐ అధికారులు రెడ్ హ్యాండడ్ పట్టుకున్నారు.

15 మందిపై కేసు

ఈ మొత్తం వ్యవహారంలో 15 మందిపై సీబీఐ కేసులు నమోదు చేసింది. లంచం ఇచ్చిన వారిపై కూడా కేసులు పెట్టింది. జీవన్ లాల్ అవినీతిపై దృష్టి పెట్టిన సీబీఐ ఈ కేసులో లోతుగా దర్యాప్తు చేస్తుంది. ఈ కేసులో ఎవరెవరి పాత్ర ఉందో ఆరా తీస్తుంది.

ముగ్గురు ప్రైవేట్ వ్యక్తులతో దందా

ఆదాయపు పన్ను కమిషనర్ జీవన్ లాల్...ముగ్గురు ప్రైవేటు వ్యక్తులతో లంచాల దందాను కొనసాగిస్తున్నారు. తన పరిధిలోని అప్పీళ్లకు భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. గోపాల్, సాయిరామ్, నరేంద్ర అనే ముగ్గురు మధ్యవర్తులు లంచాలు వసూలు చేసి జీవన్ లాల్ కు అందిస్తారు.

ముంబయిలోని ఎన్డీడబ్ల్యూ డెవలప్మెంట్ కార్పొరేషన్ కు సంబంధించిన ఒక అప్పీల్‌ను పరిష్కరించడానికి జీవన్ లాల్ ఏకంగా రూ. 2.5 కోట్ల విలువైన ఒక ఫ్లాట్‌ను లంచంగా తీసుకున్నట్లు సీబీఐ విచారణలో తేలింది.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం