రాష్ట్రంలో ఈ నెల 21 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు జరగనున్నాయి. పరీక్ష కేంద్రాల ఏర్పాటు, కేంద్రాల్లో వసతుల కల్పన తదితర అంశాలపై జిల్లాల విద్యాశాఖాధికారులు దృష్టిపెట్టారు. ఇప్పటికే జిల్లాల్లో డీఈవోలు పరీక్షా కేంద్రాలను గుర్తించారు. కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు చేశారు. పరీక్షల ఏర్పాట్లపై ఫిబ్రవరిలో విద్యాశాఖ అధికారులతో కలెక్టర్‌లు సమీక్షించారు.
పరీక్షల నిర్వహణకు చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులను, కస్టోడియన్లు, ఇన్విజిలేటర్లను నియమించారు. కేంద్రానికో ఇద్దరు ఏఎన్‌ఎంలు, ఒక పోలీసు అధికారి, ఇద్దరు అటెండర్లను నియమించారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు ఉంటాయి. ఇందులో విద్యా, రెవెన్యూ, పోలీసు శాఖల నుంచి ఒక్కొక్కరు ఉంటారు. సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు ఉంటాయి. కలెక్టర్, అదనపు కలెక్టర్లు పరీక్ష సరళిని తనిఖీ చేస్తారు.
ప్రతి కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్ ఉండే గదిలో నిఘానేత్రాలను పెట్టించారు. పరీక్ష సమయానికంటే 15 నిమిషాల ముందు నిఘానేత్రం పర్యవేక్షణలోనే ప్రశ్నపత్రాల కట్టలను తెరవాల్సి ఉంటుంది. సీసీ కెమెరాలు లేని కేంద్రాల్లో అమర్చుకోవాలని కేంద్రాల నిర్వాహకులకు ఉన్నతాధికారులకు చెప్పారు. పరీక్షలకు సంబంధించిన ఏమైనా ఇబ్బందులున్నా, ఫిర్యాదు చేయాలన్నా కంట్రోల్‌రూమ్ నెంబర్లకు ఫోన్ చేయాలి.
కొన్నిచోట్ల ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు చెల్లిస్తేనే హాల్‌టికెట్లు ఇస్తామని విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారు. దీనిపైనా విద్యాశాఖ అధికారులు స్పందించారు. డీఈవో కార్యాలయాలకు విద్యార్థులందరి హాల్‌టికెట్లు వచ్చాయని చెబుతున్నారు. వాటిని ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు పంపించారు. ఏ పాఠశాలలోనైనా విద్యార్థులను ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. లేదంటే bse.telangana.gov.in వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్‌ను డౌన్‌లోడ్ చేసుకొని తీసుకొచ్చినా అనుమతిస్తామని స్పష్టం చేస్తున్నారు. డౌన్‌లోడ్ చేసుకున్న హాల్‌టికెట్లపై ప్రిన్సిపాళ్ల సంతకం అవసరం ఉండదని అంటున్నారు.
పదో తరగతి పరీక్షల్లో నిమిషం నిబంధన ఏమీ లేదని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. అలా అని ఆలస్యంగా రావొద్దని స్పష్టం చేస్తున్నారు. విద్యార్థులు అరగంట ముందే కేంద్రాలకు చేరుకుంటే మంచిదని సూచిస్తున్నారు. కేంద్రాలను ఒకరోజు ముందే చూసుకుంటే మేలు అని చెబుతున్నారు. ఉదయం 8.30 గంటల నుంచే లోపలికి అనుమతిస్తామని అధికారులు స్పష్టం చేశారు.