Warangal Ghost attack: ట్రాక్టర్ డ్రైవర్‌పై దెయ్యం దాడి..! సోషల్ మీడియాలో ఫొటోలు వైరల్.. అసలు నిజమేంటి?
Fact Check: రోజురోజుకూ శాస్త్ర సాంకేతిక రంగం అభివృద్ధి చెందుతోంది. అదే సమయంలో చాలామందిపై మూఢ నమ్మకాల ప్రభావం పెరుగుతోంది. మంత్రాలు, దెయ్యాలు అంటూ గ్రామాల్లో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా వరంగల్ జిల్లాలో ఓ ట్రాక్టర్ డ్రైవర్‌పై దెయ్యం దాడి చేసిందని ప్రచారం జరుగుతోంది.

ఇటీవల సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు వైరల్ అవుతున్నాయి. వాటిల్లో ఓ వ్యక్తి వీపుపై గాయాలు ఉన్నాయి. అతనిపై దెయ్యం దాడి చేసిందని నాలుగు రోజులుగా ప్రచారం జరుగుతోంది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేట గ్రామం సమీపంలో ఈ ఘటన జరిగిందని పోస్టులు దర్శనమిచ్చాయి. ఈ నేపథ్యంలో 'హిందుస్తాన్ టైమ్స్ తెలుగు' ప్రతినిధి ముత్తోజిపేట గ్రామానికి వెళ్లి నిజాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ప్రచారం ఏంటీ..
ముత్తోజిపేట గ్రామం నుంచి ముత్యాలమ్మ తండాకు వెళ్లే రోడ్డులో ఓ చోట మర్రిచెట్టు ఉంది. ఓ వ్యక్తి అర్ధరాత్రి ట్రాక్టర్ నడుపుకుంటూ ఆ మార్గంలో వెళ్తున్నారు. మర్రిచెట్టు వద్దకు రాగానే ఒక్కసారిగా దెయ్యం వచ్చి అతనిపై దాడి చేసింది. ఈ దాడిలో ఆ వ్యక్తి వీపుపై గాయాలు అయ్యాయి. ఈ ప్రాంతంలో దెయ్యం ఉందని కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.
నిజం ఏంటీ..
దెయ్యం దాడి చేసిందనే ప్రచారం జోరుగా సాగుతుండగా.. 'హిందుస్తాన్ టైమ్స్ తెలుగు' ప్రతినిధి దీనిపై ముత్తోజిపేట, ముత్యాలమ్మ తండా, పరిసర గ్రామాల్లో ఆరాతీశారు. అయితే.. ఇటీవల ఏ ట్రాక్టర్ డ్రైవర్ కూడా గాయపడిన దాఖలాలు లేవని స్పష్టమైంది. కొందరు మాట్లాడుతూ.. అది నిర్మల్ జిల్లాలో జరిగిన ఘటన అని చెప్పారు. కానీ.. అందుకు కూడా స్పష్టమైన ఆధారాలు లేవు. ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ముత్తోజిపేట సమీప గ్రామాల ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
దెయ్యాలు ఉంటాయా..
చనిపోయిన వ్యక్తుల ఆత్మలు దెయ్యాల రూపంలో తిరుగుతాయని కొందరు నమ్ముతారు. కొన్ని ప్రదేశాల్లో అసాధారణ శబ్దాలు, కదలికలు, దృశ్యాలు కనిపిస్తే దెయ్యాల వల్లనే అని నమ్ముతారు. దెయ్యాలు మనుషులను భయపెడతాయని, హాని కలిగిస్తాయని భయపడతారు. వారు భయపడుతూ.. పక్కవారిని కూడా భయపెడతారు.
శాస్త్రీయ ఆధారాలు లేవు..
దెయ్యాలు మానసిక భ్రమ అని నిపుణలు చెబుతున్నారు. భయానక కథలు, సినిమాలు ప్రజలలో భయాన్ని కలిగిస్తాయని.. దానివల్ల దెయ్యాలు ఉన్నాయనే నమ్మకం కలుగుతుందని అంటున్నారు. దెయ్యాల గురించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని చెబుతున్నారు. మూఢ నమ్మకాలు ప్రజల్లో భయం, ఆందోళన, అభద్రతా భావాన్ని కలిగిస్తాయని, వీటిని నమ్మవద్దని స్పష్టం చేస్తున్నారు.
ఆర్థికంగా నష్టం..
మూఢ నమ్మకాలు ఆర్థికంగా కూడా నష్టాన్ని కలిగిస్తాయి. ప్రజలు మూఢ నమ్మకాలపై డబ్బు ఖర్చు చేయడం వలన.. ఇతర ముఖ్యమైన విషయాలపై పెట్టుబడి పెట్టలేకపోతారు. ఇది దేశ ఆర్థికాభివృద్ధిని కూడా తగ్గిస్తుంది. మూఢ నమ్మకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం చాలా ముఖ్యం. మూఢ నమ్మకాల ప్రభావాల గురించి ప్రజలకు తెలియజేయడం ద్వారా.. వాటిని తగ్గించవచ్చు.