తెలంగాణ : రికార్డు స్థాయి వరదను తట్టుకొని.. సురక్షితంగా నిలబడి..! 103 ఏళ్ల నాటి 'పోచారం ప్రాజెక్ట్' గురించి తెలుసా..?-irrigation department declares pocharam project safe key details here ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  తెలంగాణ : రికార్డు స్థాయి వరదను తట్టుకొని.. సురక్షితంగా నిలబడి..! 103 ఏళ్ల నాటి 'పోచారం ప్రాజెక్ట్' గురించి తెలుసా..?

తెలంగాణ : రికార్డు స్థాయి వరదను తట్టుకొని.. సురక్షితంగా నిలబడి..! 103 ఏళ్ల నాటి 'పోచారం ప్రాజెక్ట్' గురించి తెలుసా..?

కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరద భారీగా పారుతోంది. అయితే పోచారం ప్రాజెక్ట్ కు వరద ఉధృతి భారీగా పెరగడంతో కట్ట తెగిపోయే అవకాశాలు ఉన్నాయనే వార్తలు వచ్చాయి. అయితే అతి భారీ వరదను తట్టుకొని ఈ 103 ఏళ్ల పురాతన ప్రాజెక్ట్ నిలబడింది. ప్రాజెక్ట్ సేఫ్ అని అధికారులు ప్రకటించారు.

పోచారం ప్రాజెక్టు

కామారెడ్డి జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భారీ వరదలతో వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ఈ క్రమంలోనే బుధవారం పోచారం ప్రాజెక్టు అతి భారీస్థాయిలో వరద తరలివచ్చింది. ఊహించని దానికంటే ప్రాజెక్ట్ పైనుంచి నీరు దాటిగా ప్రవహిస్తూ వెళ్లింది.

ఈ క్రమంలోనే ప్రాజెక్ట్ పక్కన గుంత పడటంతో…. ప్రాజెక్ట్ తెగిపోయే అవకాశం ఉందన్న వార్తలు జోరుగా వినిపించాయి. స్థానికంగా ఉన్న గ్రామాల ప్రజలు కూడా భయాందోళనను వ్యక్తం చేశారు. అయితే అతి భారీ వరదను కూడా తట్టుకొని ఈ ప్రాజెక్ట్ నిలబడింది. ఎలాంటి ప్రమాదానికి గురికాకుండా ఉందని, ఎలాంటి ఇబ్బంది లేదని ఇరిగేషన్ శాఖ ప్రకటించింది.

ఇరిగేషన్ మంత్రి కీలక ప్రకటన..

103 సంవత్సరాల పురాతన పోచారం ప్రాజెక్ట్ 1,82,000 క్యూసెక్కుల భారీ వరద ప్రవాహాన్ని తట్టుకుంది సురక్షితంగా నిలబడిందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ ప్రకటించారు. ఈ ప్రాజెక్టు MFD 70,000 (గరిష్ట వరద) క్యూసెక్కుల కంటే ఈ వరద చాలా ఎక్కువని తెలిపారు. బుధవారం నాటి భారీ వరదను తట్టుకొని నిలబడటం… గొప్ప ఉపశమనం కలిగించిందన్నారు. నిజంగా ఇది గర్వించదగ్గ, భావోద్వేగ సమయమని తెలిపారు.

పోచారం ప్రాజెక్ట్ వివరాలు

  • వందేళ్ల క్రితం నిజాం ప్రభుత్వం నిర్మించిన తెలంగాణ తొలి ప్రాజెక్టు పోచారం ప్రాజెక్టు.
  • ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, ప్రస్తుతం కామారెడ్డి జిల్లాగా ఉన్న మంచిప్ప చెరువుపై నాగిరెడ్డిపేట మండలం పోచారం గ్రామంలో 1917లో పోచారం ప్రాజెక్టుకు నిజాం శంకుస్థాపన చేశారు.
  • కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాలు, మెదక్ జిల్లాలోని మెదక్ మండలాల నీటి అవసరాలను తీర్చేందుకు రూ.27.11 లక్షల వ్యయంతో 2.423 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు నిర్మాణం 1922లో పూర్తయింది.
  • గత 103 ఏళ్లుగా నిజామాబాద్, మెదక్ జిల్లాల ప్రజల సాగు, తాగునీటి అవసరాలను ఈ పోచారం ప్రాజెక్ట్ తీరుస్తోంది.
  • నిజాం ప్రభుత్వం సున్నపురాయితో నిర్మించిన ఈ ప్రాజెక్టు పొడవు 1.7 కిలోమీటర్లు, మంచిప్ప వాగుపై 21 అడుగుల ఎత్తైన కట్ట ఉంటుంది. దాని చుట్టూ 58 కిలోమీటర్ల పొడవైన కాలువలు తవ్వారు, ఈ ప్రాజెక్టు కు 73 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయి.
  • ఈ ప్రాజెక్టు కింద రైతులు 10,500 ఎకరాలు సాగు చేసుకుంటున్నారు, గతంలో 2.423 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టును నిర్మించగా, పూడిక కారణంగా ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 1.82 టీఎంసీలకు పడిపోయింది.
  • ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీలను ఏ, బీ జోన్లుగా, 1 నుంచి 48 డిస్ట్రిబ్యూటరీలతో కూడిన ఏ జోన్, 49 నుంచి 73 డిస్ట్రిబ్యూటరీలతో కూడిన బీ జోన్లుగా విభజించారు.
  • ప్రాజెక్ట్ కు ముప్పు తప్పటంతో ఇరిగేషన్ శాఖ అధికారులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం