Telangana ACB : ఏసీబీ చరిత్రలోనే రెండో అతిపెద్ద ఆపరేషన్.. నిఖేష్ ఆస్తుల విలువ రూ.600 కోట్లు!
Telangana ACB : తెలంగాణలో ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్.. ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ ఆస్తులు ఎంత.. అవును ఎవరి నోట విన్నా ఇదే మాట వినిపిస్తోంది. అటు మరో విషయం వైరల్ అవుతోంది. ఏసీబీ చరిత్రలోనే రెండో అతిపెద్ద ఆపరేషన్ అని అధికారులు చెబుతున్నారు. ఇటు ఏసీబీ దాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.
ఇరిగేషన్ ఏఈఈ నిఖేష్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇది ఏసీబీ చరిత్రలోనే రెండో అతిపెద్ద ఆపరేషన్ అని అధికారులు చెబుతున్నారు. బఫర్ జోన్‌లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చి.. కోట్లాది రూపాయలు కూడబెట్టాడు ఏఈఈ నిఖేష్‌కుమార్. అతని ఆస్తుల మార్కెట్ విలువ రూ.600 కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
నానక్‌రాంగూడ, శంషాబాద్, గచ్చిబౌలిలో విల్లాలు, నార్సింగిలో నాలుగు అంతస్తుల హాస్టల్ భవనం, మొయినాబాద్‌లో మూడు ఫామ్‌హౌస్‌లు, తాండూరులో మూడు ఎకరాలు ఉన్నట్టు ఏసీబీ తేల్చింది. ఇవే కాకుండా ఇంకా నిఖేష్ బంధువుల పేర్లపైనా ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. అతి త్వరలో వారి లాకర్లను ఏసీబీ తెరవనుంది. ఇప్పటికే నిఖేష్ బంధువుల ఇళ్లలో కిలో బంగారంస్వాధీనం చేసుకున్నారు. నిఖేష్‌కుమార్ బినామీ ఆస్తులు గుర్తించే పనిలో పడ్డారు.
నిఖేష్ కుమార్ ఇంట్లో ఏసీబీ సోదాలు ముగిశాయి. ఆయన్ను అధికారులు అదుపులోకి తీసుకుని నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. ఉదయం 6 గంటలకు న్యాయమూర్తి నివాసంలో హాజరుపర్చారు. జడ్జి 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. ఏసీబీ అధికారులు ఆయన్ను చంచల్‌గూడ జైలుకు తరలించారు.
శనివారం ఉదయమే ఏసీబీ అధికారులు నికేష్ కుమార్ ఇంటికి వెళ్లారు. ఆయన సమక్షంలోనే సోదాలు ప్రారంభించారు. మరికొన్ని బృందాలు మొయినాబాద్ మండలం తోల్కట్ట, సజ్జన్‌పల్లి, నక్కలపల్లి ఫాంహౌస్‌లలో, అతని బంధువులు, సన్నిహితులకు సంబంధించిన 19 ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించింది. ఈ సోదాల్లో అక్రమాస్తుల దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిఖేష్‌ను అరెస్టు చేసినట్లు శనివారం రాత్రి ఏసీబీ వెల్లడించింది.
గండిపేట ఏఈఈగా పనిచేస్తున్న నిఖేష్ అనూహ్య పరిస్థితుల్లో మే 30న ఏసీబీకి చిక్కి కటకటాల పాలయ్యాడు. నిఖేష్ కుమార్ ఉద్యోగంలో చేరి పదేళ్లు కూడా కాలేదు. కానీ.. అతని అవినీతి సంపాదన రోజుకు లక్షల్లోనే ఉంటుందట. నిఖేష్ గతంలో.. వరంగల్, తాండూరులలో పనిచేశాడు. గండిపేటలో ఎక్కువ కాలం విధులు నిర్వర్తించాడు. గండిపేటలో పనిచేయడంతో నిఖేష్‌కు బాగా లంచాలు వచ్చాయి.
నిఖేష్ దగ్గరకు ఏ ఫైల్ వచ్చినా.. అది అక్రమమైనా సక్రమం అవుతుందనే టాక్ ఉంది. బఫర్ జోన్ అయినా.. ఎఫ్‌టీఎల్ అయినా సరే ఎన్‌వోసీ తీసుకొస్తాడని ప్రచారం జరుగుతోంది. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇళ్లకు, గేటెడ్ కమ్యూనిటీలకు, భవనాల నిర్మాణాలకు అనుమతులిచ్చేది హెచ్‌ఎండీఏ. కానీ.. నీటిపారుదల శాఖ ఇచ్చే ఎన్‌వోసీనే కీలకం. సరిగ్గా ఇదే పాయింట్‌ను నిఖేష్ క్యాష్ చేసుకున్నాడు. కోట్లు కూడబెట్టాడు.