Vande Bharat Express Charges : సికింద్రాబాద్ - విశాఖపట్నం వందే భారత్ రైలు.. ఛార్జీలివే ..
Vande Bharat Express Charges : జనవరి 15న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానున్న సికింద్రాబాద్ - విశాఖపట్నం వందే భారత్ రైలు రెగ్యులర్ సర్వీసులు జనవరి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే టికెట్ బుకింగ్ ప్రారంభమైన రైలు ఛార్జీలు ఈ విధంగా ఉన్నాయి...
Vande Bharat Express Charges : దేశంలో 8వ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు.. సంక్రాంతి కానుకగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు జనవరి 15 నుంచి అందుబాటులోకి రానుంది. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడవనున్న ఈ రైలును ఆదివారం ఉదయం 10:30 గంటలకు వర్చువల్ గా ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ స్టేషన్ లో ఏర్పాటు చేసే ప్రారంభోత్సవ కార్యక్రమంలో రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమం కోసం దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు.
జనవరి 16 నుంచి వందే భారత్ రైలు రెగ్యులర్ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో.. టికెట్ బుకింగ్ సేవలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య ప్రతి రోజు నడవనున్న ఈ రైలు... వరంగల్, ఖమ్మం, విజయవాడ, రాజమహేంద్రవరం స్టేషన్లలో ఆగుతుంది. కాగా... వందే భారత్ రైలులో ఛైర్ కార్ ఛార్జీలు ఈ విధంగా ఉన్నాయి..
సికింద్రాబాద్ నుంచి వరంగల్ కు ఛార్జి రూ. 520
సికింద్రాబాద్ నుంచి ఖమ్మం రూ. 750
సికింద్రాబాద్ నుంచి విజయవాడకు రూ. 905
సికింద్రాబాద్ నుంచి రాజమహేంద్రవరానికి ఛార్జి రూ. 1,365
సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు రూ. 1,665
ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ చార్జీలు... సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నంకు రూ. 3120 గా ఉంది.
14 ఏసీ ఛైర్ కార్ కోచ్ లు, రెండు ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ కోచ్ లు కలిపి మొత్తం 16 కోచ్ లతో కూడిన రైలులో 1,128 మంది ప్రయాణికులు కూర్చునే విధంగా ఏర్పాట్లు ఉన్నాయి. ఆదివారం మినహా వారంలో ఆరు రోజుల పాటు వందేభారత్ రైలు సేవలందిస్తుంది. విశాఖ నుంచి బయలుదేరే వందే భారత్ రైలు ( ట్రైన్ నెం. 20833) ప్రతి రోజూ ఉదయం 5.45 గంటలకు ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం 2.15 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇక సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే వందే భారత్ రైలు.. రాత్రి 11.30 గంటలకు... అంటే కేవలం ఎనిమిదిన్నర గంటల్లో విశాఖ చేరుకుంటుంది.
ప్రస్తుతం సికింద్రాబాద్-విశాఖ మధ్య నడుస్తున్న దురంతో ఎక్స్‌ప్రెస్ గరిష్టంగా 10 గంటల్లో గమ్యస్థానాన్ని చేరుతోంది. వందే భారత్ రైలు 8 గంటల 30 నిమిషాల వ్యవధిలోనే గమ్య స్థానానికి చేరుతుందని రైల్వే అధికారులు చెబుతున్నారు. దురంతో ఎక్స్‌ప్రెస్‌తో పోలిస్తే గంటన్నర ముందే ప్రయాణికులు గమ్య స్థానాలకు చేరుకునేందుకు వీలవుతుంది.
సికింద్రాబాద్-విశాఖపట్నం మార్గంలో ప్రయాణించే ఇతర రైళ్లతో పోలిస్తే మూడున్నర గంటల సమయం ఆదా అవుతుంది. సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం ప్రయాణానికి గరీబ్‌రథ్ రైలులో 11గంటల 10 నిమిషాలు, ఫలక్‌నామా ఎక్స్‌ప్రెస్‌లో 11.25 గంటలు, గోదావరిలో 12.05 గంటలు, ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్‌లో 12.40గంటలు, జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో 12.45 గంటల సమయం పడుతోంది.