Warangal Crime: ఈజీ మనీ కోసం అడ్డదారులు తొక్కిన యువకులు కటకటాల పాలయ్యారు. జైల్లో ఏర్పడిన పరిచయాలతో గంజాయి స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కారు. పోలీసుల తనిఖీల్లో పదిమంది సభ్యుల ముఠాను గుర్తించి ముగ్గురిని అరెస్ట్ చేశారు. మరో ఏడుగురు పరారీలో ఉన్నారు.
వరంగల్ నగరం హనుమకొండ రెడ్డి కాలనీకి చెందిన కోటగిరి సాయి వినయ్ ఈజీ మనీ కోసం గంజాయి స్మగ్లింగ్ చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో 2023లో తన స్నేహితుడు వరుణ్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ లోని మారేడుమిల్లి నుంచి గంజాయి తీసుకొస్తుండగా, అప్పుడు డొంకరాయి పోలీసులు పట్టుకున్నారు. అనంతరం అతడిని రాజమండ్రి జైలుకు పంపించారు.
అక్కడ సాయి వినయ్‌కు ములుగు జిల్లా జగ్గన్నపేట మండలం అన్నంపల్లికి చెందిన లావుడ్యా రవీందర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తాను గంజాయి అమ్ముతుంటానని చెప్పి, అతడి ఫోన్ నెంబర్ సాయి వినయ్ కి ఇచ్చాడు. ఇదిలాఉంటే లావుడ్యా రవీందర్ గతంలో ఆటో డ్రైవర్ గా పని చేసేవాడు.
హనుమకొండలో గణేశ్ నిమజ్జనం సందర్భంగా జరిగిన గొడవలో ఓ వ్యక్తిపై హత్యాయత్నం చేశాడు. దీంతో ఆ కేసులో ఖమ్మం సెంట్రల్ జైలుకు వెళ్లగా.. అక్కడ హరి, కబీర్ సింగ్ అనే వ్యక్తులతో రవీందర్ కు పరిచయం ఏర్పడింది.
గంజాయి స్మగ్లింగ్ కేసుల్లో జైలుకు వెళ్లిన నిందితులు బయటకు వచ్చిన తరువాత మళ్లీ అదే దందా మొదలు పెట్టారు. జైలులో పరిచయం అయిన మేరకు హరి, కబీర్ సింగ్ లావుడ్యా రవీందర్ స్నేహితుడైన సాయి వినయ్ ఫోన్ నంబర్ తీసుకున్నారు. అనంతరం హరి దాదాపు మూడు వారాల కిందట సాయి వినయ్ కి ఫోన్ చేశాడు. తన వద్ద గంజాయి నుంచి తీసిన హాష్ ఆయిల్ ఉందని, దానిని సిగరేట్స్ కు పూసి, తాగితే కిక్కు ఎక్కుతుందని చెప్పాడు.
అది ఒక్కో కేజీ రూ.12.5 లక్షల వరకు ఉంటుందని చెప్పి హరి తన అన్న అయిన రామ్మూర్తి ద్వారా హాష్ ఆయిల్ వరంగల్ రైల్వే స్టేషన్ వరకు పంపించాడు. దీంతో దానిని తీసుకున్న సాయి వినయ్ తన ఇంట్లో దాచి పెట్టాడు. ఆ తరువాత 10 రోజుల క్రితం హరి, రవీందర్ ఇద్దరూ ఆటోలో 12 కిలోల ఎండు గంజాయిని తీసుకొచ్చి సాయి వినయ్‌కు ఇచ్చారు. దీంతో దానిని దాచి పెట్టిన సాయి వినయ్.. రెండు కిలోల గంజాయిని తనకు పరిచయస్తులైన హరీశ్, జైసింహ, కుషాల్ కు అమ్మాడు.
గంజాయి, హాష్ ఆయిల్ స్మగ్లింగ్ చేస్తున్న ఈ గ్యాంగ్ హాష్ ఆయిల్ ను స్టీల్ డబ్బాలో నింపి హైదరాబాద్ తీసుకెళ్లేందుకు ప్లాన్ చేశారు. ఈ మేరకు వాటిని ఆటోలో పెట్టుకుని వస్తుండగా, రెడ్డికాలనీలో హనుమకొండ ఎస్సై పరుశరాములు వెహికిల్ చెక్ చేస్తుండగా నిందితులు సాయి వినయ్, లావుడ్యా రవీందర్, హరి పారిపోయేందుకు ప్రయత్నం చేశారు.
దీంతో వారిని పట్టుకుని విచారించగా.. గంజాయి దందా బయటపడింది. దీంతో సాయి వినయ్, రవీందర్, హరిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా మిగతా ముఠా సభ్యులైన కబీర్ సింగ్, హరి, రామ్మూర్తి, భూక్యా వినోద్, కుశాల్, హరీశ్, జైసింహ పరారీలో ఉన్నట్లు డీసీపీ షేక్ సలీమా తెలిపారు.
నిందితుల నుంచి రూ.25 లక్షల విలువైన 2 కిలోల హాష్ ఆయిల్, రూ.5 లక్షల విలువైన 2 కిలోల ఎండు గంజాయి, 3 సెల్ ఫోన్లు, ఒక రాయల్ ఎన్ ఫీల్డ్ బైక్, బజాజ్ ఆటో స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన హనుమకొండ పోలీసులతో పాటు వరంగల్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఆఫీసర్లను డీసీపీ సలీమా అభినందించారు.
(రిపోర్టింగ్: హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)
సంబంధిత కథనం