Nalgonda PDS Rice: వాడపల్లి చెక్‌పోస్ట్‌లో పట్టుబడిన ఆంధ్రా రేషన్ బియ్యం దొంగలు .. 504 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం-interstate rice thieves found in vadapally borders 504 quintals of rice seized ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nalgonda Pds Rice: వాడపల్లి చెక్‌పోస్ట్‌లో పట్టుబడిన ఆంధ్రా రేషన్ బియ్యం దొంగలు .. 504 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం

Nalgonda PDS Rice: వాడపల్లి చెక్‌పోస్ట్‌లో పట్టుబడిన ఆంధ్రా రేషన్ బియ్యం దొంగలు .. 504 క్వింటాళ్ల రేషన్ బియ్యం స్వాధీనం

HT Telugu Desk HT Telugu
Oct 17, 2024 12:42 PM IST

Nalgonda PDS Rice: ప్రభుత్వం పేదల ఆకలి తీర్చేందుకు ప్రజా పంపిణీ వ్యవస్థ (పీడీఎస్) ద్వారా అందిస్తున్న రేషన్ బియ్యాన్ని రాష్ట్ర సరిహద్దులు దాటించి సొమ్ము చేసుకుంటున్న బియ్యం దొంగలు పట్టుబడ్డారు.బియ్యాన్ని పాలిష్ చేసి ఏపీ నుంచి కర్ణాటక,మహారాష్ట్ర గుజరాత్,రాజస్తాన్ రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు.

వాడపల్లి చెక్‌పోస్టులో పట్టుబడిన రేషన్ బియ్యం వివరాలను వెల్లడిస్తున్న ఎస్పీ శరత్ చంద్ర
వాడపల్లి చెక్‌పోస్టులో పట్టుబడిన రేషన్ బియ్యం వివరాలను వెల్లడిస్తున్న ఎస్పీ శరత్ చంద్ర

Nalgonda PDS Rice: అక్రమ బియ్యం రవాణాకు ఆంధ్రప్రదేశ్‌ కేంద్రంగా మారింది. దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న ప్రజలకు సరఫరా చేసే పీడీఎస్‌ బియ్యాన్ని అక్రమంగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్న ముఠా నల్గొండలో పట్టుబడింది. వీరి నుంచి రెండు లారీలు, రూ.18 లక్షల విలువైన 504 క్వింటాళ్ల బియ్యాన్ని నల్గొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు పట్టబడిన రెండు లారీల బియ్యం ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల నుంచి ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నట్టు గుర్తించారు.

సరిహద్దు చెక్ పోస్టుల్లో దొరికిన దొంగలు

రాష్ట్ర ప్రభుత్వం పేదలకు అందిస్తున్న పి.డి.ఎస్ బియ్యం పక్కదారి పట్టకుండా అంతర్ రాష్ట్ర సరిహద్దుల వద్ద నిఘా పెట్టడంతో పిడిఎస్ బియ్యం ఇతర రాష్ట్రాలకు అక్రమ రవాణా చేస్తున్న రైస్ స్మగ్లర్లు దొరికిపోయారు. ఏపీకి సరిహద్దుగా ఉన్న దామచర్ల మండలం వాడపల్లి వద్ద పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి పోలీసులు తనిఖీలు చేపట్టారు.

వాడపల్లి గ్రామ శివారులోని రవాణా శాఖ బార్డర్ చెక్ పోస్ట్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా, ఆంద్రప్రదేశ్ వైపు నుంచి తెలంగాణ వైపు వస్తున్న కర్ణాటక రాష్ట్ర రిజిస్ట్రేషన్ (KA56 2700 ) తో ఉన్న లారీలో 245.40 క్వింటాల పీడీఎస్ రైస్ పట్టుబడింది. అదే మాదిరిగా రూ.8 లక్షల విలువ గల 250 క్వింటాళ్ల బియ్యం గుజరాత్ రాష్ట్ర రిజిస్ట్రేషన్ తో ఉన్న (GJ 25 U 2727) లారీలో ఏపీలోని బాపట్ల నుంచి గుజరాత్ కి తరలిస్తుండగా పౌరసరఫరాల అధికారులతో కలిసి రెయిడ్ చేసి పట్టుకున్నారు.

నిందితుల భారీ స్కెచ్

ఏపీలోని బాపట్ల టౌన్ కు చెందిన చీమకుర్తి సుధాకర్, కర్ణాటక రాష్ట్రం హుమ్నాబాద్ కు చెందిన సయ్యద్ సలావుద్దీన్ లను అరెస్టు చేశారు. మరో నిందితుడు గుంటూరుకు చెందిన అశోక్ పరారీలో ఉన్నాడని పోలీసు చెప్పారు. బాపట్లకు చెందిన నిందితులు చీమకుర్తి సుధాకర్ గత కొన్నేళ్లుగా బాపట్ల లోని తనకున్న శ్రీ లక్ష్మి వెంకటేశ్వర అయ్యప్ప ట్రేడర్స్ లో రైతుల నుండి సేకరించిన వడ్లతో పాటు పీడీఎస్ రైస్ ను గుంటూరు, బాపట్ల నరసరావు పేటలలో తక్కువ ధరకు కొనుగోలు చేసి తన మిల్లులో వాటిని సన్న బియ్యం మాదిరిగా పాలిష్ చేసి వీటికి నకిలీ బిల్లులు కూడా తయారు చేసి గుంటూరులో అశోక్ అనే తన ఏజెంట్ ద్వారా నెలకు కనీసం 10 నుండి 12 లారీల బియ్యాన్ని ఆంద్రప్రదేశ్ సరిహద్దు రాష్ట్రలైన తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ , రాజస్తాన్ లకు రవాణా చేస్తూ అక్రమ వ్యాపారం కొనసాగిస్తున్నాడు.

ఈ క్రమంలో గురువారం ఉదయం కర్ణాటక రాష్ట్రనికి చెందిన సయ్యద్ సలావుద్దీన్ తమ లారీలో లోడ్ చేసిన బియ్యాన్ని అశోక్, సుధాకర్ అనే నిందితులు తెలంగాణ మీదుగా ముంబాయికి తరలించే క్రమంలో వాడపల్లి వద్ద పట్టుబడ్డారు. ఈ కేసు వివరాలను జిల్లా పోలీసు కార్యాలయంలో గురువారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మీడియాకు వివరించారు.

ఏపీలో రేషన్‌ బియ్యం అక్రమ రవాణాను ఉక్కుపాదంతో అణిచి వేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా ఆచరణలో మాత్రం ఎలాంటి మార్పు లేదు. మొబైల్ డెలివరీ యూనిట్ల నుంచి నేరుగా రేషన్ బియ్యం తరలిపోతుందనే విమర్శలు ఉన్నాయి. రేషన్‌లో సరఫరా చేసే బియ్యాన్ని ఏపీలోని పోర్టుల నుంచి విదేశాలకు ఎగుమతి చేయడంతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేసే ముఠాలు భారీగా ఉన్నాయి.

( రిపోర్టింగ్ : క్రాంతిపద్మ, హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ కరస్పాండెంట్ )

Whats_app_banner