Charlapalli Railway Station : చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభం.. కేంద్రానికి సీఎం రేవంత్ కృతజ్ఞతలు-interesting remarks by pm modi and cm revanth reddy at the inauguration of cherlapalli railway terminal ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Charlapalli Railway Station : చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభం.. కేంద్రానికి సీఎం రేవంత్ కృతజ్ఞతలు

Charlapalli Railway Station : చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభం.. కేంద్రానికి సీఎం రేవంత్ కృతజ్ఞతలు

Charlapalli Railway Station : ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న చర్లపల్లి రైల్వే టెర్మినల్ ప్రారంభమైంది. ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డి దీన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా కేంద్ర ప్రభుత్వానికి సీఎం రేవంత్ కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి మరింత సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

కేంద్రానికి సీఎం రేవంత్ కృతజ్ఞతలు

భారతదేశ అభివృద్ధికి రైల్వేల పాత్ర కీలకం.. అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. తెలంగాణ లాంటి రాష్ట్రాల అభివృద్ధి కూడా రైల్వేలపైనే ఆధారపడి ఉందన్నారు. హైదరాబాద్‌లోని చర్లపల్లిలో కొత్త టెర్మినల్, స్టేషన్‌ను పూర్తి చేసినందుకు కేంద్రానికి కృతజ్ఞతలు చెప్పారు. ఒక ట్రిలియన్ డాలర్ జీడీపీ ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దాలని సంకల్పించినట్టు వెల్లడించారు.

కేంద్రం సహకరించాలి..

'భారతదేశాన్ని 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యానికి.. మేము మా వంతు ప్రయత్నం చేస్తున్నాం. హైదరాబాద్ నుంచి బందర్ పోర్ట్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవే, డైరెక్ట్ రైల్వే నిర్మాణానికి కేంద్రం సహకరించాలని కోరుతున్నాం. తెలంగాణలో 370 కిలోమీటర్ల మేర రీజనల్ రింగ్ రోడ్డును నిర్మించబోతున్నాం. రీజనల్ రింగ్ రోడ్డు, రీజనల్ రింగ్ రైల్ నిర్మాణంలో కేంద్రం పూర్తిగా సహకరించాలని కోరుతున్నాం' అని రేవంత్ వ్యాఖ్యానించారు.

ప్రతిపాదనలు పంపాం..

'హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2కు ప్రతిపాదనలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. హైదరాబాద్ మెట్రో రైల్ ఫెజ్-2 కు పూర్తి సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. వికారాబాద్ నుంచి కృష్ణా రైలు మార్గాన్ని, కల్వకుర్తి నుంచి మాచర్ల మధ్య కొత్త రైల్వే లైన్లు, డోర్నకల్ నుంచి రెండు లైన్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నాం' అని రేవంత్ రెడ్డి వివరించారు.

కనెక్టివిటీ పెంచేలా..

'రైల్వే రంగంలో మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రయాణికుల కోసం సౌకర్యాలు మెరుగుపరుస్తున్నాం. అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచేలా కృషి చేస్తున్నాం. వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ వంటి హైస్పీడ్‌ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. వీటిలో స్లీపర్‌ వంటి సౌకర్యాలను కల్పించనున్నాం. కొత్త రైల్వే ట్రాక్‌లతో పాటు అండర్‌ బ్రిడ్జి నిర్మాణాలు వేగవంతం చేస్తున్నాం' అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

మారుతోన్న ముఖచిత్రం..

'చర్లపల్లి టెర్మినల్‌ ద్వారా సికింద్రాబాద్‌, కాచిగూడ స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుంది. దేశవ్యాప్తంగా హైస్పీడ్‌ రైళ్ల కోసం డిమాండ్‌ ఉంది. దేశంలో 35 శాతం విద్యుదీకరణ పూర్తయింది. వందేభారత్‌, అమృత్‌ భారత్‌, నమో భారత్‌ రైళ్లు తెచ్చాం. దశాబ్ద కాలంలో రైల్వే కొత్త రూపు సంతరించుకుంది. రైల్వేల ఆధునికీకరణ దేశం ముఖచిత్రాన్నే మారుస్తోంది. తెలంగాణ, జమ్ము కశ్మీర్‌, ఒడిశాలో కొత్త కనెక్టివిటీకి ఏర్పాట్లు జరిగాయి' అని ప్రధాని వివరించారు.

రూ.413 కోట్లతో..

చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. అత్యాధునిక సౌకర్యాలతో రూ.413 కోట్లతో దీన్ని తీర్చిదిద్దారు.. సీఎం రేవంత్‌ రెడ్డి కూడా వర్చువల్‌గా పాల్గొన్నారు. కేంద్ర మంత్రులు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌ కార్యక్రమానికి హాజరయ్యారు. వాస్తవానికి గతేడాది డిసెంబరు 28న దీన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరిగాయి. కానీ.. మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ మరణంతో వాయిదా పడింది.