South Central Railway : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఐకానిక్ భవనం నేలమట్టం.. చరిత్ర, ప్రత్యేకతలు తెలుసా?
South Central Railway : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్.. ఈ పేరు వినగానే ఫస్ట్ గుర్తొచ్చేది ఐకానిక్ బిల్డింగ్. నిజాం నిర్మాణ శైలికి అద్దం ఈ భవనం. కానీ ఇప్పుడు అది కాల గర్భంలో కలిసిపోయింది. అవును.. అభివృద్ధి పనుల్లో భాగంగా.. ఐకానిక్ బిల్డింగ్‌ను నేలమట్టం చేస్తున్నారు. ఈ సమయంలో దీని చరిత్ర తెలుసుకుందాం.
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు గొప్ప చరిత్ర ఉంది. 1874లో అప్పటి నిజాం పాలకుడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను నిర్మించారని చెబుతారు. ఇది 1916 వరకు నిజాం గ్యారెంటెడ్ స్టేట్ రైల్వే (ఎన్‌జీఎస్ఆర్)కు ప్రధాన కేంద్రంగా ఉండేది. స్వాతంత్ర్యం తర్వాత 1951లో ఎన్జీఎస్ఆర్‌ను జాతీయం చేశారు. దీంతో భారతీయ రైల్వేలో సికింద్రాబాద్ స్టేషన్ భాగమైంది.
ప్రధాన కార్యాలయంగా..
1966లో దక్షిణ మధ్య రైల్వే జోన్ ఏర్పడింది. అప్పుడు సికింద్రాబాద్ ప్రధాన కార్యాలయంగా మారింది. 1951లో నిజాం శైలి ఉట్టిపడేలా దీన్ని నిర్మించారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను 1874లో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ నిర్మించారు. ఈ స్టేషన్ మొదట మూడు ప్లాట్‌ఫారమ్‌లతో ఒక సాధారణ భవనంగా ఉండేది. రానురాను అవసరాలకు అనుగుణంగా నిర్మాణాలు చేపట్టారు.
ఐకానిక్ భవనం నేలమట్టం..
అయితే.. ఈ స్టేషన్‌ను ఆధునీకరించాలని కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ పథకంలో చేర్చింది. ఆధునికీకరణ కోసం పనులు చేస్తున్న నేపథ్యంలో.. పురాతన కట్టడాలను అధికారులు కూల్చి వేస్తున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు ప్రధాన ఆకర్షణగా నిలిచే భవన నిర్మాణాన్ని కూల్చివేసి.. నూతన భవనాన్ని ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా నిర్మించనున్నారు.
ప్రపంచ స్థాయిలో సౌకర్యాలతో..
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను రూ.720 కోట్లతో రైల్వే శాఖ ఆధునీకరిస్తున్నది. రైల్వే స్టేషన్‌లో ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. స్టేషన్‌లో షాపులు, ఫుడ్ కోర్టులు, విశ్రాంతి కేంద్రాలు, వెయిటింగ్ హాల్స్, ఆధునిక టికెట్ కౌంటర్లు నిర్మిస్తున్నారు. స్టేషన్‌ను జీ+3 అంతస్తులుగా నిర్మించనున్నారు.
ఎయిర్‌పోర్ట్ తరహాలో..
ఒక ఐకానిక్ స్ట్రక్చర్‌గా దీనిని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. స్టేషన్‌కు రెండు వైపులా రెండు ట్రావెలర్లతో పాటు.. రెండు నడక మార్గాలను నిర్మిస్తున్నారు. రాబోయే 40 ఏళ్ల వరకు ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. విమానాశ్రయం తరహాలో రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తున్నారు.
ప్రధాన నగరాలకు రైళ్లు..
సికింద్రాబాద్ నుంచి నిత్యం ఎక్స్ ప్రెస్, సూపర్ ఫాస్ట్, ప్యాసింజర్ రైళ్లు నడుస్తాయి. న్యూఢిల్లీ, ముంబయి, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, విశాఖపట్నం వంటి ప్రధాన నగరాలకు ఇక్కడి నుంచి రైళ్లు అందుబాటులో ఉన్నాయి. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. వందలాది రైళ్లు సికింద్రాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తుంటాయి. ఇక్కడ 10 ఫ్లాట్‌ఫాంలు, 11 ట్రాక్‌లు ఉన్నాయి.