Ramanujacharya Statue | శ్రీ రామానుజాచార్యుల విగ్రహం ప్రత్యేకతలు ఏంటో తెలుసా? ఇక్కడ ప్రతీది విశేషమే..
ఇప్పుడు చాలామంది నోట.. ముచ్చింతల్ రామానుజార్యుల విగ్రహం గురించే చర్చ. దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ సమతామూర్తి విగ్రహం విశిష్ఠతలు మాట్లాడుకుంటున్నారు. ముచ్చింతల్ ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. రామానుజాచార్యుల విగ్రహం దగ్గర ఎటు చూసినా ప్రత్యేకతలే. మరి అక్కడి విశేషాలేమిటో తెలుసుకుందామా?

రంగారెడ్డి శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్‌లో శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయి. మరోవైపు ప్రధాని చేతుల మీదుగా విగ్రహావిష్కరణ జరగనుంది. దీంతో ఇక్కడి విశేషాలు తెలుసుకోవాలని.. చాలామందికి ఆసక్తి నెలకొంది. నిజానికి.. ఈ విగ్రహ ఏర్పాటుకు 2014లోనే శంకుస్థాపన జరిగింది. కానీ కొన్ని కారణాలతో ఈ ఏడాదికి పూర్తయింది. 45 ఎకరాల విస్తీర్ణంలో సమతామూర్తి విగ్రహం రూపుదిద్దుకుంది. 216 అడుగుల ఎత్తుతో విగ్రహాన్ని రూపొందించారు.
ఇక్కడ ప్రవేశద్వారం వద్ద.. 18 అడుగుల ఎత్తైన హనుమాన్ ,గరుడ విగ్రహాలను పెట్టారు. గర్భగుడిలో 120 కిలోల బంగారు విగ్రహన్ని సైతం ఏర్పాటు చేశారు. రామానుజాచార్య 120 ఏళ్లు జీవించారని, అందుకే 120 కేజీల బంగారాన్ని పెడుతున్నట్టు ప్రకటించారు. విగ్రహంలో రామానుజాచార్యులు ధ్యాన ముద్రలో కనిపిస్తారు. ఈ విగ్రహానికి రోజూ పూజలు నిర్వహిస్తారు.
రామానుజాచార్యుల విగ్రహంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 42 అడుగుల ఎత్తులో రాగి ఫౌంటెయిన్ కూడా ఏర్పాటు చేశారు. లోపల 54 అంగుళాల ఎత్తులో 120 కిలోల బంగారంతో చేసిన మరో శ్రీరామానుజాచార్యుల విగ్రహం కనిపిస్తుంది. మరో ప్రత్యేకత ఏంటంటే.. రామానుచార్య విగ్రహం చుట్టురా.. నల్లరాతితో చెక్కిన 108 చిన్న ఆలయాలు ఉంటాయి. వాటిని దివ్య దేశంగా పిలుస్తుంటారు.
మహా విగ్రహం చుట్టూ 8 పుణ్య క్షేత్రాలు ఉంటాయి. గర్భాలయాల ఆకృతిలో ఏకంగా 108 ఆలయాలను సైతం నిర్మించారు. ఈ ఆలయాలను అనుసంధానిస్తూ మధ్యలో 468 స్తంభాలతో భారీ దివ్యదేశ మండపాన్ని కూడా నిర్మింపజేశారు. అష్టదళ పద్మాకృతిలో 45 అడుగుల ఎత్తుతో ఫౌంటెయిన్ నిర్మించారు. దీనికోసం రూ.25 కోట్ల వెచ్చించారు. మరో విశేషం ఏంటంటే.. ఫౌంటెయిన్ పద్మ పత్రాలు విచ్చుకొనేలా రూపొందించారు.
రామానుజులు ప్రభోధించిన సమానత్వ ఘట్టాలను సూర్యాస్తమయం తర్వాత.. మ్యూజిక్‌తో త్రీడీ షో ద్వారా ప్రదర్శించేలా ఏర్పాట్లు చేశారు. రామానుజుల జీవిత విశేషాలు తెలిపేలా మ్యూజియం కూడా ఉంది. రెండు లక్షల మొక్కలు ఆధ్యాత్మిక శోభను మరింత పెంచేలా కనిపిస్తాయి.