కలెక్టర్.. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధి. పాలనాధికారిగా వ్యవహరించాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్‌పై ఉంటుంది. దానిని నిర్వర్తిస్తూనే వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్. విద్య, వైద్యం, వ్యవసాయం, రవాణా వంటి రంగాల్లో తనదైన మార్క్ చూపిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో నో హెల్మెట్- నో ఎంట్రీ, లెస్ పేపర్- లెస్ ప్లాస్టిక్ విధానాన్ని అమలు చేస్తున్నారు. అంతేనా విద్యార్థులకు పాఠాలు బోధిస్తూనే.. ప్రజలకు పలు అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యటనలు, తనిఖీలు నిర్వహిస్తూ.. మెదక్‌లో అనేక మార్పులకు నాంది పలికారు.
ఇటీవల, రాహుల్ రాజ్ ఒక ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఒక రైతులాగా ధాన్యాన్ని శుభ్రం చేయడంలో సహాయం చేశారు. అంతేకాకుండా, ధాన్యంలో తేమ శాతం 17 శాతం ఉండేలా, చూసుకోవాలని దళారులను ఆశ్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రాల్లో విక్రయించాలని రైతులకు సూచించారు. అంతకుముందు తన సతీమణితో కలిసి పొలంలో నాట్లు వేశారు. ప్రతీ ఆదివారం ఏదో ఒక రకంగా ఆయన ప్రజలతో మమేకం అవుతున్నారు.
సమాజంలోని అన్ని వర్గాల ప్రజలతో మమేకం కావాలనే ఉద్దేశ్యంతో, రాహుల్ రాజ్ ఒక పారిశుద్ధ్య కార్మికుడి ఇంటికి వెళ్లి వారితో కలిసి భోజనం చేశారు. వారి జీవన విధానం, సమస్యల గురించి తెలుసుకున్నారు. రాహుల్ రాజ్ విద్యార్థులకు పాఠాలు బోధిస్తూ.. వివిధ అంశాలపై వారికి అవగాహన కల్పిస్తున్నారు. ఆయన నిత్యం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. ప్రజల సమస్యలను తెలుసుకుంటున్నారు. వాటిని పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నారు.
ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి, ప్రభుత్వ రవాణా వ్యవస్థను పరిశీలించడానికి, రాహుల్ రాజ్ స్వయంగా 20 కిలోమీటర్లు సైకిల్ తొక్కి, తరువాత ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ప్రయాణికులతో మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మెదక్ జిల్లాలో మహిళల కోసం ఒక ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇది వారికి అకౌంటింగ్, ఫైనాన్స్, మేనేజ్‌మెంట్ నైపుణ్యాలను అందిస్తుంది.
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన రాహుల్ రాజ్.. చదువు తర్వాత తన తండ్రి కోరిక మేరకు మూడేళ్లు సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేశారు. ఆ తర్వాత ప్రజాసేవ చేయాలనే లక్ష్యంతో ఉద్యోగం వదిలేసి.. సివిల్స్ ట్రై చేశారు. రెండో ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యారు. మొదట ఆసిఫాబాద్, తర్వాత ఆదిలాబాద్ జిల్లాల్లో కలెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం మెదక్ పాలనాధికారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లా ప్రజలకు సుపరిపాలన అందించడమే లక్ష్యంగా వినూత్న కార్యక్రమాలకు శ్రీకారంచుట్టారు.
సంబంధిత కథనం