MIM Strategy in Telangana : టార్గెట్ 50..! అటు నుంచే వ్యూహం సిద్ధమవుతోందా..?-interesting discussion on akbaruddin comments over aimim will win 15 mla seats in telangana ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Interesting Discussion On Akbaruddin Comments Over Aimim Will Win 15 Mla Seats In Telangana.

MIM Strategy in Telangana : టార్గెట్ 50..! అటు నుంచే వ్యూహం సిద్ధమవుతోందా..?

Mahendra Maheshwaram HT Telugu
Feb 08, 2023 02:26 PM IST

Telangana Assembly Elections 2023: ఎన్నికల ఏడాదిలోకి వచ్చేసింది తెలంగాణ. ప్రధాన పార్టీలు వ్యూహాలు.. ప్రతివ్యూహాలు సిద్ధం చేసే పనిలో పడ్డాయి. అయితే అసెంబ్లీ వేదికగా ఎంఐఎం, బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ సరికొత్త చర్చకు దారి తీస్తోంది. ఇదంతా వ్యూహంలో భాగంగా జరుగుతుందా..? అనే వాదన స్టార్ట్ అయింది. ఇదీ కాస్త రాజకీయవర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఎంఐఎం ఫోకస్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై ఎంఐఎం ఫోకస్

TS Assembly Elections 2023 Updates: ఎన్నికల సమరానికి టైం దగ్గరపడుతోంది. ఇక నెలల సమయం మాత్రం ఉంది..! ఇంకేముంది ప్రధాన పార్టీలన్నీ కూడా యుద్ధానికి సన్నద్ధమయ్యే పనిలో పడ్డాయి. మూడోసారి గెలిచి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయాలని భారత రాష్ట్ర సమితి భావిస్తుండగా... ఈసారి ఎలాగైనా తెలంగాణను కొట్టాలని కాంగ్రెస్ గట్టిగా చూస్తోంది. ఇక కమలనాథులు మాత్రం భారీగానే ఆశలు పెట్టుకున్నారు. ఇవేకాకుండా.. ఇతర పార్టీలు కూడా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఇవన్నీ ఇలా ఉంటే... తాజాగా జరిగిన అసెంబ్లీ సమావేశాల వేదికగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్... ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. వచ్చే అసెంబ్లీ 15 సభ్యులతో వస్తామంటూ మాట్లాడారు. ఈ వ్యాఖ్యలే ప్రస్తుతం టీ పాలిటిక్స్ లో ఆసక్తికరంగా మారాయి.

ట్రెండింగ్ వార్తలు

డైలాగ్ వార్.. కట్ చేస్తే..

నిజానికి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా రెండో రోజు సభ… ఎంఐఎం వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లు నడిచింది. ప్రభుత్వంపై అక్బరుద్దీన్.. తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రభుత్వం సభలో చెబుతున్నది ఒకటి.. బయట చేస్తున్నది ఒకటి అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. కనీసం మంత్రులు అందుబాటులో ఉండటం లేదంటూ మాట్లాడారు. అయితే వెంటనే కలగజేసుకున్న మంత్రి కేటీఆర్... అక్బరుద్దీన్ వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఏడుగురు సభ్యులు ఉన్న పార్టీకి ఎక్కువ సమయం సబబు కాదన్నారు. గొంతు చించుకున్నంత మాత్రాన ఉపయోగం ఉండదంటూ గట్టిగా బదులిచ్చారు. ఇదంతా ముగియగా... మరోసారి అక్బరుద్దీన్ మాట్లాడుతూ.. పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చారు. అయితే కేటీఆర్ చెప్పిన 7 సీట్ల విషయాన్ని అక్బరుద్దీన్ ప్రస్తావించారు. తమకు సభలో ఏడు సీట్లే ఉండొచ్చు... కానీ వచ్చే ఎన్నికల్లో కనీసం 15 సీట్లకు తగ్గకుండా సభకు వస్తామంటూ కామెంట్స్ చేశారు. అయితే తమకు ఎన్ని సీట్లు వచ్చినా... భారత రాష్ట్ర సమితితోనే కలిసి పని చేస్తామని చెప్పుకొచ్చారు. సీన్ కట్ చేస్తే... ఇక్కడే ప్రతిపక్ష పార్టీలు పలు అనుమానాలను వ్యక్తం చేస్తున్నాయి. అక్బరుద్దీన్ చేసిన కామెంట్స్ వెనక ఏదో వ్యూహం సిద్ధమవుతుందన్న అభిప్రాయాలను చెబుతున్నాయి. రాజకీయవర్గాల్లో కూడా అక్బరుద్దీన్ కూడా కామెంట్స్ ఆసక్తికరంగా మారాయి.

50 స్థానాల్లో పోటీ...?

నిజానికి పాతబస్తీకే పరిమితనుకున్న ఎంఐఎం... గత కొన్ని ఏళ్లుగా రూట్ మారుస్తూ వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్లపై కన్నేసిన ఆ పార్టీ... కేడర్ తో పాటు నాయకత్వాన్ని బలోపేతం చేసే పనిలో పడింది. ఈ క్రమంలో వచ్చే ఎన్నికలను సీరియగా తీసుకునే పనిలో పడింది. దారుస‌లేం వేదికగా మ‌జ్లిస్ విస్త‌ర‌ణ‌కు చాలా రోజులుగా ప్ర‌ణాళిక‌లు జ‌రుగుతూనే ఉన్నాయి. ప‌ట్టున్న ప్రాంతాలేవీ? ఏయే స్థానాల్లో పోటీ చేయ‌వ‌చ్చు... అక్క‌డ సామాజిక స‌మీక‌ర‌ణాలు ఎలా ఉన్నాయ‌న్న అంశాలపై గట్టిగానే కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి మ‌జ్లిస్ ఎక్క‌డ పోటీ చేసినా ముస్లీం సామాజికవ‌ర్గ ఓట్లు ప్ర‌ధానంగా చూసుకుంటుంది. అయితే ఆ వర్గానికి చెందిన నేతలకే టికెట్లు ఇవ్వకుండా... ఇతర మతాలకు చెందిన లీడర్లకు టికెట్లు ఇవ్వాలని చూస్తోంది. ఫలితంగా కొన్నిచోట్ల గెలిచే అవకాశాలపై లెక్కలు వేసుకుంటోంది. గ‌తంలో నిజామాబాద్ అర్బ‌న్ స్థానంలో ఎంఐఎం 23.5శాతం ఓట్లు తెచ్చుకుంది. అక్క‌డ గెలిచిన బీఆర్ఎస్ అభ్య‌ర్థికి 31శాతం ఓట్లే వ‌చ్చాయి. ఇదే కాదు 2014 ఎన్నికల్లో బంజారాహిల్స్ లో రెండోస్థానంలో నిలిచింది ఎంఐఎం. ఇక గత ఎన్నికల్లో రాజేంద‌ర్ న‌గ‌ర్ సీటును కొట్టాలని గట్టిగా పని చేసింది. అంబ‌ర్ పేట వంటి స్థానాల్లోనూ ఎంఐఎం బ‌లంగానే ఉంది. వీటికి తోడు వచ్చే ఎన్నికల్లో కరీంన‌గ‌ర్, ఖ‌మ్మం, సంగారెడ్డి, నిర్మ‌ల్, ముథోల్, బైంసా, అదిలాబాద్, బోధ‌న్, కామారెడ్డి, మ‌హ‌బూబ్ న‌గ‌ర్, జ‌హీరాబాద్, షాద్ న‌గ‌ర్, వికారాబాద్, సిర్పూర్, కోరుట్ల‌, భువ‌న‌గిరి, వ‌రంగ‌ల్ తూర్పు నియోజకవర్గాలపై కన్నేసినట్లు తెలుస్తోంది. ఆయా స్థానాల్లో గట్టిగా ట్రై చేస్తే... పాతబస్తీనే కాదు బయట కూడా సీట్లు గెలిచే అవకాశం ఉంటుందని.. ఫలితంగా సీట్ల సంఖ్యను పెంచుకోవాలని చూస్తోంది. అయితే ఇతర పార్టీలకు చెందిన బలమైన నేతలను కూడా ఆకర్షించే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.

వ్యూహంలో భాగమేనా..?

ఇక అక్బరుద్దీన్ చేసిన కామెంట్స్ వ్యూహంలో భాగంగానే జరుగుతుందని ప్రతిపక్షపార్టీలు అంచనా వేస్తున్నాయి. దీని వెనక బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ - అసదుద్దీన్ ఓవైసీ..ఉన్నారనే చర్చ తెరపైకి వస్తోంది. పాత‌బ‌స్తీ మిన‌హా ఇత‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో పోటీ చేయ‌టం ద్వారా ఎంఐఎం గెలుపు అవ‌కాశాలు ఎలా ఉన్నా, పోటీ చేసిన స్థానాల్లో ఓట్ల చీలిక ఎక్కువ‌గా ఉంటుంద‌ని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఫలితంగా కాంగ్రెస్, బీజేపీ అవకాశాలు సన్నిగిల్లే అవకాశం ఉంటుందని అంటున్నారు. తద్వారా బీఆర్ఎస్ గెలుపునకు అవ‌కాశం ఏర్ప‌డుతుంద‌ని చెబుతున్నారు. గెలిచినా... ఓడినా ప‌రోక్షంగా బీఆర్ఎస్ గెలుపుకు పాటుప‌డాల‌న్న ఎత్తుగ‌డ‌తోనే ఎంఐఎం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తుందన్న వాదన గట్టిగా వినిపిస్తోంది.

మొత్తంగా ఎన్నికల టైం దగ్గర పడుతున్న వేళ... తెలంగాణ రాజకీయాలు క్రమంగా రసవత్తరంగా మారుతున్నాయి. అయితే తాజాగా ఎంఐఎం వేస్తున్న అడుగులు మాత్రం... టీ పాలిటిక్స్ అత్యంత ఆసక్తికరంగా మారాయి. అయితే ఎంఐఎంను కూడా కర్నర్ చేస్తున్నాయి ఇతర పార్టీలు. బీఆర్ఎస్ బీ టీం అంటూ ఎదురుదాడి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎంఐఎం నిజంగానే 50 సీట్లలో పోటీ చేస్తుందా..? లేక పాతబస్తీకే పరిమితం అవుతుందా..? అనేది చూడాలి.

IPL_Entry_Point

సంబంధిత కథనం