Shamshabad Airport : శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రెడ్ అలర్ట్.. జనవరి నెలాఖరు వరకు ఆంక్షలు!
Shamshabad Airport : గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశం సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో నిఘా వర్గాలు అప్రమత్తం అయ్యాయి. సున్నిత ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు రెడ్ అలర్ట్ జారీ చేశాయి. ప్రయాణికులు, సందర్శకులకు సూచనలు జారీ అయ్యాయి.
జనవరి 26న దేశ వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. హైదరాబాద్‌లోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో నిఘా విభాగం అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. జనవరి 30 వరకు రెడ్ అలర్ట్ కొనసాగుతుందని స్పష్టం చేశారు. జనవరి 30 వరకు విమానాశ్రయానికి సందర్శకులు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరగకుండా సీఐఎస్ఎఫ్ విమానాశ్రయంలో భద్రతను కట్టుదిట్టం చేసింది.
నో ఎంట్రీ..
ఎయిర్‌పోర్ట్ ప్రధాన రహదారి లో బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తనిఖీలు చేపడుతున్నారు. విమానాశ్రయానికి వచ్చే వాహనాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. అనుమానం వచ్చిన వాహనాలను ఆపి తనిఖీ చేస్తున్నారు. ఆ తర్వాతే లోపలికి అనుమతిస్తున్నారు. ఎయిర్ పోర్టుకు వచ్చే సందర్శకులకు అధికారులు అనుమతి నిరాకరించారు. జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలకు దేశ రాజధాని ముస్తాబవుతోంది. రిపబ్లిక్ డే సందర్భంగా ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.
ఫుల్ డ్రెస్ రిహార్సల్స్..
అటు కర్తవ్య పథ్‌లో ఫుల్ డ్రస్ రిహార్సల్‌ను నిర్వహించారు. ఉదయం 10:30 కి దీన్ని ప్రారంభించారు. ఫుల్ డ్రస్ రిహార్సల్స్ నేపథ్యంలో.. మధ్యాహ్నం 12 గంటల వరకు సెంట్రల్ ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. జనవరి 26న పరేడ్‌కు ముందు లోటుపాట్లను సరిచూసుకునేందుకు.. ఈ ఫుల్ డ్రస్ రిహార్సల్ నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు.
అందుబాటులో టికెట్లు..
రాష్ట్రపతి భవన్ నుంచి ఎర్రకోట వరకు కర్తవ్య పథ్ మీదుగా 9 కిలో మీటర్ల మేర రిపబ్లిక్ డే పరేడ్ సాగనుంది. రిపబ్లిక్ డే పరేడ్‌ను చూసేవారికి ఆన్ లైన్, ఆఫ్ లైన్‌లో రక్షణ శాఖ టికెట్లను విక్రయిస్తుంది. ఆమంత్రన్ వెబ్ సైట్ సహా.. ఢిల్లీలో కీలక మెట్రో స్టేషన్ల వద్ద టికెట్ కౌంటర్స్‌ను ఏర్పాటు చేశారు. రూ.500, రూ.100, రూ. 20 ధరల్లో రిపబ్లిక్ డే పరేడ్ టికెట్స్ అందుబాటులో ఉన్నాయి. రూ.100, రూ.20 బీటింగ్ రిట్రీట్ పరేడ్ టికెట్లను విక్రయిస్తున్నారు.
సచివాలయంలో ఆంక్షలు..
ఇటు తెలంగాణ సచివాలయం వద్ద కూడా ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది. ఇకపై సచివాలయం లోపలకు వెళ్లే వారికి ఇచ్చే పాసుతో.. ఒక్కరికి మాత్రమే అనుమతించనున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో.. సచివాలయానికి వివిధ పనుల నిమిత్తం వచ్చే సందర్శకుల పట్ల కఠిన నిబంధనలు అమలు చేయడం విమర్శలకు దారితీసింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆంక్షలను సడలించింది.
ఆరో అంతస్తుకు..
ఈ నేపథ్యంలో.. సందర్శకుల తాకిడి పెరిగింది. దీంతో భద్రత పటిష్టం చేసేందుకు ఎస్పీఎఫ్ చర్యలు చేపట్టింది. సందర్శకుల సంఖ్యను క్రమబద్ధీకరించే చర్యలను క్రమంగా అమల్లోకి తెస్తోంది. ప్రస్తుతం సచివాలయంలో సీఎం కార్యాలయం ఉండే ఆరో అంతస్తుకు సందర్శకులకు అనుమతి ఇవ్వడం లేదు. ఇటు ఇటీవల చీఫ్ సెక్రటరీ ఫ్లోర్‌లో సందర్శకులు ఎక్కువగా కనిపించడంతో.. ఉన్నతాధికారులు ఎస్పీఎఫ్ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సందర్శకులపై కొత్త ఆంక్షలు తీసుకొచ్చారు.