Janagama Police: గుప్త నిధుల పేరిట అమాయకులకు టోకరా వేస్తున్న ముఠా ఆట కట్టించిన జనగామ పోలీసులు-innocents are cheated in the name of hidden treasures in janagama ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Janagama Police: గుప్త నిధుల పేరిట అమాయకులకు టోకరా వేస్తున్న ముఠా ఆట కట్టించిన జనగామ పోలీసులు

Janagama Police: గుప్త నిధుల పేరిట అమాయకులకు టోకరా వేస్తున్న ముఠా ఆట కట్టించిన జనగామ పోలీసులు

HT Telugu Desk HT Telugu
Jun 26, 2024 05:49 AM IST

Janagama Police: గుప్త నిధుల పేరిట మోసాలకు పాల్పడుతున్న ఓ ముఠాను జనగామ జిల్లా కొడకండ్ల పోలీసులు పట్టుకున్నారు. లక్షల్లో మోసం చేసిన నిందితులను పక్కా ప్లాన్‌తో అరెస్ట్ చేశారు.

జనగామలో గుప్త నిధుల పేరుతో అమయాకులకు వల
జనగామలో గుప్త నిధుల పేరుతో అమయాకులకు వల

Janagama Police: గ్రామాల్లో జోతిష్యం పేరున మాటలు కలిపి గుప్త నిధులు, మంత్రాలు, పూజలు అంటూ మోసం చేస్తుండటంతో బాధితుల ఫిర్యాదు మేరకు వారి ఆటకట్టించారు. ఈ ముఠా సభ్యులు ఉమ్మడి వరంగల్, ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో మోసాలకు పాల్పడుతూ అమాయకుల నుంచి లక్షలు దోచుకుంటున్నట్లు గుర్తించారు.

మాయమాటలు చెప్పి అమాయకులను నిండా ముంచుతుండటంతో ఎట్టకేలకు వారిని అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు. కాగా గుప్త నిధుల పేరున మోసాలకు పాల్పడుతున్న గ్యాంగ్ అరెస్టుకు సంబంధించిన వివరాలను జనగామ జిల్లా పాలకుర్తి పీఎస్ లో మంగళవారం సాయంత్రం నిర్వహించిన మీడియా సమావేశంలో వరంగల్ వెస్ట్ జోన్ డీసీపీ రాజమహేంద్ర నాయక్ వెల్లడించారు.

మాయమాటలతో నమ్మించి గుప్త నిధులంటూ ఎర

కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన ఓ యువతి తన అత్తతో కలిసి మూడు నెలల కిందట రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా, రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ మండలం చీర్లవంచకు చెందిన కడమంచి రజనీకాంత్ అనే వ్యక్తి వారి వద్దకు వచ్చాడు. తాను కొన్ని సమస్యలతో బాధ పడుతున్నానని, ఇప్పటివరకు తన ఇంట్లో నలుగురు వ్యక్తులు చనిపోయారంటూ వారి ముందు ఆవేదన చెందాడు.

దీంతో వారి ఇంట్లో కూడా మంచి కావడం లేదని, వారిద్దరూ రజనీకాంత్ ను తమ ఇంటికి తీసుకెళ్లారు. ఆ ఇంటిని పరిశీలించిన రజనీకాంత్ అక్కడ గుప్త నిధులు ఉన్నాయని, వాటిని బయటకు తీయకపోతే ఇంట్లో వారంతా చనిపోయే ప్రమాదం ఉందని భయభ్రాంతులకు గురి చేశాడు. వారిలో ఆశలు రేకెత్తించి, గుప్త నిధులు బయటకు తీయడానికి పూజలు చేయాల్సి ఉంటుందని, అందుకు యాదగిరి గుట్టలోని షాప్ నుంచి ఒక పౌడర్ తీసుకు రావాలని చెప్పాడు.

దీంతో వారిద్దరూ అక్కడికి వెళ్లి రూ.1,75,00 చెల్లించి ఆ పౌడర్ తీసుకువచ్చి రజనీకాంత్ కు అప్పగించారు. అనంతరం రజనీకాంత్ తో పాటు మోటం సురేశ్ అనే యువకుడు కలిసి వారి ఇంట్లో పూజలు చేస్తున్నట్లు నటించి, ఇంట్లో నిజంగానే గుప్త నిధులు ఉన్నాయని నమ్మబలికారు.

పూజల పేరున లక్షల దోపిడీ

గుప్త నిధులను బయటకు తీసే పేరున రజనీకాంత్, సురేశ్ ఇద్దరూ కలిసి భారీ ప్లాన్ వేశారు. ఆ గుప్త నిధులను బయటకు తీయడానికి పూజలు చేయాల్సి ఉంటుందని, ఆ పూజ సామగ్రికి దాదాపు 9 లక్షల 20 వేల వరకు ఖర్చవుతుందని చెప్పారు. ఆ మొత్తం డబ్బును వేములవాడలోని ఓ పూజా స్టోర్ లో అప్పగించాలని చెప్పారు.

దీంతో బాధితులు ఆ డబ్బును కట్టి పూజ సామగ్రి తెచ్చుకోవడంతో సురేశ్ తో పాటు నరసింహ అనే వ్యక్తులు వారి ఇంటికి వచ్చి పూజలు చేశారు. ఆ తరువాత 15 రోజుల పాటు ఇంట్లో వాళ్లే పూజలు చేయాలని, ఆ తరువాత తామంతా వచ్చి మరో పూజ చేస్తామని చెప్పారు. ఆ పూజ చేస్తేనే గుప్త నిధులు బయటకు తీసే అవకాశం ఉంటుందని, అందుకు రూ.14 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు.

దీంతో వారు చెప్పిన ప్రకారం బాధిత కుటుంబ సభ్యులంతా కలిసి కరీంనగర్ లోని శ్రీరాజరాజేశ్వర పూజా సామగ్రి దుకాణం వద్ద రూ.7 లక్షలు అప్పగించారు. అనంతరం మిగిలిన రూ.7 లక్షలు చెల్లిస్తే పూజా సామగ్రి తీసుకుని వచ్చి పూజలు చేస్తామని చెప్పారు. దీంతో వారికి అనుమానం కలగగా, ఇందులో ఏదో మోసం జరుగుతోందని వారు గ్రహించారు.

పక్కా ప్లాన్ తో ఖేల్ ఖతం

మొదట రూ.7 లక్షలు కట్టిన బాధితులు పూజలు కంప్లీట్ అయిన తరువాత మిగతా రూ.7 లక్షలు చెల్లిస్తామని చెప్పారు. అప్పటికే మోసాన్ని పసిగట్టిన బాధితులు పోలీసులకు సమాచారం ఇచ్చి పెట్టారు. దీంతో మంగళవారం పూజ చేయడానికి నరసింహ కొడకండ్లకు రాగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో నరసింహ అసలు నిజాలను పోలీసులకు వెల్లడించాడు.

అనంతరం నరసింహ నుంచి బాధితులకు సంబంధించిన 12 లక్షల 97 వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు రూ.40 వేల విలువైన 540 వెండి నాగ పడిగ, లక్ష్మీ దేవి కాయిన్స్, రూ.1.5 లక్షల విలువైన 76 బంగారు రేకు నాగ పడిగ, లక్ష్మీ దేవి కాయిన్స్, పూజ కోసం ఉపయోగించే చెక్క పెట్టెలు, ఒక మనీ కౌంటింగ్ మెషీన్, 2 కార్లు స్వాధీనం చేసుకున్నారు.

కాగా నరసింహ ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఆయన తెలిపిన ప్రకారం కరీంనగర్ లోని రాజరాజేశ్వర పూజ సామగ్రి దుకాణం వద్దకు వెళ్లి వినుకొండ సంపత్ కుమార్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతని నుంచి బాధితురాలికి సంబంధించిన 2 లక్షల 50 వేల నగదు, అప్పుడప్పుడు పూజలకు తిరగటం కోసం ఉపయోగించే కార్ ని స్వాధీనం చేసుకున్నారు.

గతంలో కూడా నరసింహ ఇదే విధమైన మోసాలకు పాల్పడగా, రాచకొండ కమిషనరేట్ పరిధి ఆత్మకూరు పీఎస్ లో కూడా కేసు నమోదైంది. కాగా మిగతా నిందితులైన కడమంచి రజనీకాంత్, మోటం సురేష్ లు, సిరిసిల్ల జిల్లా పెద్దూరు గ్రామానికి చెందిన మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

కేసు ఛేదించడంలో ప్రతిభ చూపిన వర్ధన్నపేట ఏసీపీ అంబటి నరసయ్య, పాలకుర్తి సీఐ గట్ల మహేందర్ రెడ్డి, కొడకండ్ల ఎస్సై బండి శ్రావణ్ కుమార్, ఇతర సిబ్బంది శ్రీనివాస్, సోమిరెడ్డి, సంపత్ రాజు, రాజ్ కుమార్, అశోక్, సోమేశ్వర్, శ్రావణ్, శ్రీనివాస్, అరుణ్ తదితరులను అభినందించి, వారికి డీసీపీ రాజమహేంద్ర నాయక్ చేతుల మీదుగా క్యాష్ రివార్డ్ కూడా అందజేశారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

Whats_app_banner

సంబంధిత కథనం