Vaccine Reaction: టీకా వికటించి పసిపాప మృతి, బంధువుల ఆందోళన, పరిస్థితి ఉద్రిక్తం.. పలువురి అరెస్టు-infant dies after being vaccinated relatives worried situation tense several arrested ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Vaccine Reaction: టీకా వికటించి పసిపాప మృతి, బంధువుల ఆందోళన, పరిస్థితి ఉద్రిక్తం.. పలువురి అరెస్టు

Vaccine Reaction: టీకా వికటించి పసిపాప మృతి, బంధువుల ఆందోళన, పరిస్థితి ఉద్రిక్తం.. పలువురి అరెస్టు

HT Telugu Desk HT Telugu
Published Feb 06, 2025 06:26 AM IST

Vaccine Reaction: రాజన్న సిరిసిల్ల జిల్లాలో టికా వికటించి 45 రోజుల పసిపాప మృతి చెందారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణం అంటు బంధువులు ఆందోళనకు దిగారు. వైద్యులతో వాగ్వాదానికి దిగగా అడ్డుకునే ప్రయత్నం చేసిన పోలీసులపై తిరగబడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పలువురిని పోలీసులు అరెస్టు చేశారు.

సిరిసిల్ల జిల్లాలో టీకా వికటించి పసిపాప మృతి చెందడంతో బంధువుల ఆందోళన
సిరిసిల్ల జిల్లాలో టీకా వికటించి పసిపాప మృతి చెందడంతో బంధువుల ఆందోళన

Vaccine Reaction: టీకా వికటించి పసి పాప మృతి చెందడంపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తరపున రెండు లక్షల రూపాయల చెక్కును ఆర్డీవో ద్వారా అందజేశారు.

తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో దాసరి లత రమేశ్ దంపతుల 45 రోజుల పసిపాప మృతి చెందారు. టికా కోసం ఆసుపత్రికి తీసుకురాగ డాక్టర్ చూసి టికా వేయించారు. కాసేపటికి నిద్రలోకి జారుకున్న పాప ఇంటికి ళ్ళేసరికి కదలలేని స్థితికి చేరింది.

కంగారు పడ్డ పేరెంట్స్ పాపను ప్రైవేట్ పిల్లల డాక్టర్ వద్దకు తుసుకెళ్ళారు. పిల్లల డాక్టర్ చూసి పాప మృతి చెందిందని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టికా వేసిన తర్వాతే పాప అస్వస్థతతో ప్రాణాలు కోల్పోయిందని భావిస్తు పాప శవంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి చేరుకుని ఆందోళనకు దిగారు.

పాప మృతికి డాక్టర్ల నిర్లక్ష్యమే కారమంటు ఆసుపత్రి ముందు బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. టికా ఇవ్వడంతోనే పాప మృతి చెందిందని కలెక్టర్ రావాలని డిమాండ్ చేశారు.‌ వైద్యులపై చర్యలు తీసుకుని న్యాయం చేసే వరకు కదలమని భీష్మించారు.

వైద్యులతో వాగ్వాదం...పోలీసులపై తిరుగుబాటు.

పసిపాప మృతితో కుటుంబ సభ్యులు పుట్టెడు దుఃఖంతో ఆవేదన వ్యక్తం చేయగా వారికి మద్దతుగా బంధువులు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రి వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు.‌ వైద్యులతో వాగ్వివాదానికి దిగారు. ఆసుపత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించి ఆందోళనకారులను సముదాయించే ప్రయత్నం చేయగా పోలీసులపై ఆందోళనకారులు తిరగబడ్డారు. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య తోపులాట జరిగి ఘర్షణ వాతావరణం ఏర్పడి ఉద్రిక్తతకు దారి తీసింది.

దీంతో పోలీసులు ఆందోళనకు దిగిన వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. మృతి చెందిన పాప కుటుంబ సభ్యులను సముదాయించి న్యాయం చేస్తామని అధికారులు హామీ ఇచ్చిన ససేమిరా అంటు కలెక్టర్ రావాలని ఆసుపత్రి వద్ద నుంచి కదలకపోవడంతో ఎమ్మార్వో ఆర్డీవో తో పాటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆసుపత్రికి చేరుకొని జరిగిన ఘటనపై ఆరా తీసి విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

విచారణకు కలెక్టర్ ఆదేశం... రెండు లక్షల పరిహారం..

టీకా వికటించడంతో పాప మృతిపై ఆందోళన ఉద్రిక్తతకు దారి తీయడంతో కలెక్టర్ సందీప్ కుమార్ ఝా విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశంతో ఆర్డీఓ రాధాబాయి ఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది నిర్లక్ష్యం ఉందని వెల్లడించారు. నివేదిక కలెక్టర్ కు పంపించి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కలెక్టర్ ఆదేశం మేరకు బాధిత కుటుంబానికి పరిహారం క్రింద ప్రభుత్వం తరపున రెండు లక్షల రూపాయల చెక్కును ఆర్డీఓ అందజేశారు. విధినిర్వహణలో నిర్లక్ష్యం వహించిన వైద్యులతోపాటు సిబ్బంది పై చర్యలు తీసుకునే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.

(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner