MIdManer Housing: నెరవేరిన మిడ్ మానేర్ నిర్వాసితుల కళ, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన ప్రభుత్వం-indiramma houses granted by govt to mid maner submerge victims ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Midmaner Housing: నెరవేరిన మిడ్ మానేర్ నిర్వాసితుల కళ, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన ప్రభుత్వం

MIdManer Housing: నెరవేరిన మిడ్ మానేర్ నిర్వాసితుల కళ, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిన ప్రభుత్వం

HT Telugu Desk HT Telugu
Nov 18, 2024 05:55 AM IST

MIdManer Housing: మిడ్ మానేర్ నిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. దశాబ్ద కాలంగా నిర్వాసితులు ఎదురు చూస్తున్న కళను నెరవేర్చింది. మిడ్ మానేర్ నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ ఉత్తర్వుల జారీ చేసింది.

మిడ్‌ మానేరు నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు
మిడ్‌ మానేరు నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు

MIdManer Housing: మిడ్‌ మానేరు నిర్వాసితుల కష్టాలను తీర్చేలా రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేసింది. నాడు వారి సమస్యలపై నాడు పోరాటం చేసిన నేతలే నేడు హామీని అమలు పర్చడం సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

రాజన్న సిరిసిల్ల జిల్లా, బోయినపల్లి మండలం మన్వాడ గ్రామంలో మానేరు నదిపై 2 లక్షల హెక్టార్లకు సాగు నీటిని అందించడానికి మిడ్ మానేర్ ప్రాజెక్టుకు 2005 లో కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపన చేసింది. నాటి ప్రభుత్వ సహాయంతో ప్రాజెక్టు పూర్తయినప్పటికీ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నివాసాలు కోల్పోయిన 10683 కుటుంబాలకు గతంలో 5987 ఇండ్లు మంజూరు అయ్యాయి.

మిగతా నిర్వాసితుల పక్షాన రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి కరీంనగర్ మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గత దశాబ్ద కాలంగా రాజీలేని పోరాటం చేశారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ ఇంచార్జ్ వెలిచాల రాజేందర్ రావు ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ని ప్రత్యేకంగా కలిసి నిర్వాసితుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. వెంటనే స్పందించిన సీఎం నిర్వాసితులకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశారు.

మాట తప్పిన కేసిఆర్..

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి ముఖ్యమంత్రి కెసిఆర్ వేములవాడ పర్యటనలో భాగంగా వేములవాడ రాజన్న సాక్షిగా మిడ్ మానేర్ భూ నిర్వాసితులకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేస్తామని హామి ఇచ్చారు. ఐదు లక్షల రూపాయలు ప్రతి నిర్వాసితుల కుటుంబాలకు అందజేస్తామని చెప్పి పదేళ్ళ పాలనలో అమలు చేయలేక పోయారు.

నిర్వాసితుల సమస్యలపై నేటి సిఎం అప్పటి కాంగ్రెస్ నేతలు అనేక పోరాటాలు చేశారు.‌ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పాలనలో నిర్వాసితులకు న్యాయం చేయాలని ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కోరడంతో సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం నేడు మిడ్ మానేర్ నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

సర్వత్రా హర్షం…

నిర్వాసితులకు న్యాయం చేయాలని అనేక పోరాటాలు చేసిన గతంలో స్పందన కానరాలేదు. చివరకు పోరాటం చేసిన వారే అధికారంలోకి రావడంతో నాడు నిర్వాసితులకు ఇచ్చిన హామీని నెరవేర్చారు.‌ దీంతో నిర్వాసితులతో పాటు కాంగ్రెస్ నేతలు హర్షం వ్యక్తం చేశారు. నిర్వాసితులకు ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయడం పట్ల మంత్రి పొన్నం ప్రభాకర్, కరీంనగర్ రాజన్నసిరిసిల్ల జిల్లా ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner