భారత్‌లో మొట్టమొదటి సీతాకోకచిలుకల అభయారణ్యం.. అక్కడకు హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?-indias first butterfly sanctuary aralam know how to go there from hyderabad and ticket price and other details ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  భారత్‌లో మొట్టమొదటి సీతాకోకచిలుకల అభయారణ్యం.. అక్కడకు హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?

భారత్‌లో మొట్టమొదటి సీతాకోకచిలుకల అభయారణ్యం.. అక్కడకు హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి?

Anand Sai HT Telugu

కేరళలోని అరళం వన్యప్రాణుల అభయారణ్యం సీతాకోక చిలుకలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ రకరకాల సీతాకోక చిలుకలను చూడవచ్చు. ఇటీవలే దీని పేరును అరళం సీతాకోక చిలుకల అభయారణ్యంగా మార్చారు.

ప్రతీకాత్మక చిత్రం

ేరళ వన్యప్రాణి బోర్డు, ఆరాలం వన్యప్రాణుల అభయారణ్యం పేరును ఆరాలం సీతాకోకచిలుక అభయారణ్యంగా మార్చడానికి ఆమోదం తెలిపింది. కేరళలోని మొట్టమొదటి సీతాకోకచిలుక అభయారణ్యం ఇది. ఆరాలంలో 25 సంవత్సరాలకు పైగా సీతాకోకచిలుకల సర్వేను నిర్వహిస్తున్న మలబార్ నేచురల్ హిస్టరీ సొసైటీ సమర్పించిన వివరణాత్మక అధ్యయనం ఇందులో కీలక పాత్ర పోషించింది.

కేరళలోని కన్నూర్ జిల్లాలోని పశ్చిమ కనుమల పాదాల వద్ద ఇది ఉంది. అరళం సీతాకోకచిలుక అభయారణ్యం భారతదేశంలో మొట్టమొదటి సీతాకోకచిలుక అభయారణ్యం. అరళం 250కి పైగా సీతాకోకచిలుక జాతులకు ఆశ్రయం కల్పిస్తుంది. వీటిలో అంతరించిపోతున్న జాతులు కూడా ఉన్నాయి.

అక్టోబర్, ఫిబ్రవరి మధ్య కాలంలో ఈ అభయారణ్యం చూసేందుకు చాలా బాగుంటుంది. ఆ సమయంలో సీతాకోకచిలుకలు పశ్చిమ కనుమల దిగువ నుండి ఇక్కడికి వలస వస్తాయి. గత మూడు సంవత్సరాలలో అరుదైన జాతులు ఇక్కడకు వస్తున్నాయి. ఇక్కడి దృశ్యాలు చూసేందుకు చాలా బాగుంటాయి.

సీతాకోకచిలుకలతో పాటు అరళం ఏనుగులు, చిరుతలు, అనేక రకాల పక్షులకు కూడా నిలయం. బటర్‌ఫ్లై సఫారీ ట్రైల్ గైడెడ్ వాక్‌లను ఇక్కడ అందిస్తున్నారు. ఇక్కడ సందర్శకులు సీతాకోకచిలుక గురించి చాలా విషయాలు తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు కేరళలో 327 రకాల సీతాకోకచిలుకలను గుర్తించారు. ఇందులో 266 అరళంలో కనుగొన్నారు. ప్రతి ఏటా ఈ సంఖ్య పెరుగుతుంది.

హైదరాబాద్ నుండి అరళం దాదాపు 950 కి.మీకంటే ఎక్కువ దూరంలో ఉంది. కన్నూర్ అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానంలో సుమారు 1.5 గంటల్లో వెళ్లవచ్చు. ఆ తర్వాత టాక్సీ లేదా బస్సులో 40 కి.మీ ప్రయాణించి అభయారణ్యం చేరుకోవాలి. హైదరాబాద్ నుండి కన్నూర్‌కు రైళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి. సుమారు 20 గంటల ప్రయాణం ఉంటుంది.

ఈ అభయారణ్యంలో పెద్దలకు దాదాపు రూ.50, పిల్లలకు రూ.20 ప్రవేశ రుసుం ఉంటుంది. కెమెరాలు, గైడెడ్ టూర్‌లకు అదనపు ఛార్జీలు ఉంటాయి. కన్నూర్ నగరం, సమీపంలోని ఎకో-రిసార్ట్‌లలో సౌకర్యవంతమైన బసలు అందుబాటులో ఉన్నాయి. మీరు కావాలనుకుంటే కేరళలో ఇతర ప్రదేశాలు కూడా చూసి రావొచ్చు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.