Adilabad Airport : త్వరలో ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ - వాయుసేన నుంచి గ్రీన్ సిగ్నల్...!-indian air force approved the establishment of a civil airport in adilabad district ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Adilabad Airport : త్వరలో ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ - వాయుసేన నుంచి గ్రీన్ సిగ్నల్...!

Adilabad Airport : త్వరలో ఆదిలాబాద్లో ఎయిర్పోర్ట్ - వాయుసేన నుంచి గ్రీన్ సిగ్నల్...!

HT Telugu Desk HT Telugu

ఆదిలాబాద్ లో ఏర్పాటు చేయనున్న ఎయిర్ పోర్ట్ కు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. ఈ మేరకు ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ కు ఐఏఎఫ్ డైరెక్టర్ బాజిరావ్ రామ్ నాథ్​ లేఖ రాశారు. ఆదిలాబాద్ లో సివిల్ ఆపరేషన్స్ ను కూడా ప్రారంభించేందుకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది.

విమానాశ్రయం (representative image ) (ilage source istockphoto.com)

ఆదిలాబాద్ జిల్లాలో ఎన్నో ఏండ్లుగా ఎయిర్ ఫోర్ట్ కళ నిర్మిస్తారనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో వారి కలలను నిజం చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆదిలాబాద్ లో ఎయిర్ ఫోర్ట్ ను అభివృద్ధి చేసేందుకు వాయుసేన సూచనప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.

పౌరవిమానయాన అవసరాలకు తగినట్లుగా రన్ వే పునర్నిర్మాణం, టర్మినల్, మౌలిక వసతుల ఏర్పాట్ల అభివృద్ధికి ఆమోదం తెలిపింది. ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి సంయుక్త ప్రయోజనాలకు వాడేందుకు సమ్మతి తెలిపింది.

ఎయిర్ ఫోర్స్ గ్రీన్​సిగ్నల్​

ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని పౌర కార్యకలాపాల కోసం అభివృద్ధి చేయాలన్న తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదనకు రక్షణ మంత్రిత్వ శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ అభ్యర్ధను పరిశీలించిన తర్వాత భారత వైమానిక దళం (IAF) పౌర విమాన కార్యకలాపాలను అనుమతించడానికి అంగీకరించింది. అంతేకాకుండా.. ఆ ప్రదేశంలోనే శిక్షణ సంస్థ ఏర్పాటు చేయడానికి కూడా ప్రణాళికలను పరిశీలిస్తోంది.

ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎయిర్ పోర్ట్ నిర్మించాలనే డిమాండ్ ఎన్నో ఏండ్లుగా ఉంది. పలుమార్లు సర్వేలు కూడా చేశారు. కానీ అడుగు ముందుకు పడలేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయ లోపంతోనే ఆదిలాబాద్ కు విమానాశ్రయం రావడం లేదని స్థానికులు ఆవేదన సైతం వ్యక్తం చేశారు.

2014లో వైమానిక శిక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం స్థల సేకరణ చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకు దాదాపు 2 వేల ఎకరాలను అధికారులు గుర్తించారు. కేంద్రానికి నివేదిక పంపారు. కానీ గత ప్రభుత్వం ఎన్వోసీ ఇవ్వకపోవడంతో ప్రక్రియ నిలిచిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎయిర్ పోర్టు అంశం నానుతూనే ఉంది. ఆదిలాబాద్ ఎంపీ నగేశ్ ఇటీవల కేంద్రమంత్రి పౌర విమానయాన శాఖమంత్రి రామ్మోహన్ నాయుడిని కూడా కలిసి వినతి పత్రం అందించారు.

హైదరాబాద్ కు సుమారు 300 కిలోమీటర్లు, మహారాష్ట్రలోని ప్రధాన నగరం నాగ్ పూర్ కు సుమారు 200 కిలోమీటర్ల దూరంలో ఆదిలాబాద్ ఉంది. ఈ జిల్లా కేంద్రంలో ఎయిర్ పోర్టు నిర్మిస్తే అన్ని విధాలుగా అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. ఈ జిల్లాలో భారీ పరిశ్రమలు, కంపెనీలు లేవు. విమానాశ్రయం నిర్మిస్తే రవాణా సౌకర్యం మెరుగుపడి, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు.  

ఆదిలాబాద్ జిల్లాలో కొత్త విమానాశ్రయం ఏర్పాటుకు భారత వాయుసేన అనుమతులు ఇచ్చిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రకటించారు. ఈ విమానాశ్రయం వాణిజ్య, మరియు పారిశ్రామిక ప్రగతికి ఎంతో దోహదపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

రిపోర్టింగ్ : వేణుగోపాల్ కామాజీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి. హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.

హెచ్ టీ తెలుగు డెస్క్ టీమ్ సుశిక్షితులైన, సుదీర్ఘ అనుభవం ఉన్న జర్నలిస్టులతో కూడిన బృందం. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు సహా అన్ని విభాగాలకు ఆయా రంగాల వార్తలు అందించడంలో నైపుణ్యం కలిగిన సబ్ ఎడిటర్లతో కూడిన బృందం. జర్నలిజం విలువలను, ప్రమాణాలను కాపాడుతూ జర్నలిజంపై అత్యంత మక్కువతో పనిచేస్తున్న బృందం. సంపూర్ణ వార్తావిలువలతో కూడిన కథనాలను పాఠకుల ముందుకు తెస్తున్న బృందం.

సంబంధిత కథనం