Inavolu Mallanna Jatara : జనవరి 13 నుంచి ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు, ఏర్పాట్లపై మంత్రి కొండా సురేఖ సమీక్ష
Inavolu Mallanna Jatara : ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయాలని మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. జనవరి 13 నుంచి మల్లన్న బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.

Inavolu Mallanna Jatara : ప్రముఖ శైవక్షేత్రం ఐనవోలు మల్లికార్జునస్వామి బ్రహ్మోత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే సీరియస్ యాక్షన్ తప్పదని మంత్రి కొండా సురేఖ అన్నారు. గత జాతర కంటే ఏర్పాట్లు బాగుండాలని, ముఖ్యంగా శానిటేషన్ పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయన్నారు. జనవరి 13 నుంచి ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు జరుగనుండగా.. ఆలయ ఆవరణలో ఆదివారం జాతర ఏర్పాట్లపై రివ్యూ చేశారు. మంత్రి హోదాలో మొట్టమొదటిసారి ఆలయానికి వచ్చిన కొండా సురేఖకు అర్చకులు, అధికారులు ఘన స్వాగతం పలికారు. దీంతో మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే కేఆర్నాగరాజు, ఇతర నాయకులు, అధికారులు ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆధ్వర్యంలో జాతర ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. దేవాదాయ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రెవెన్యూ, వైద్యారోగ్య, పోలీస్, ఎక్సైజ్, నీటిపారుదల, మిషన్ భగీరథ, ఆర్టీసీ, రోడ్లు భవనాలు, మున్సిపల్, కుడా, పర్యాటక, అగ్నిమాపక శాఖల అధికారులతో ఆయా శాఖల నుంచి జాతర ఏర్పాట్లకు చేపట్టాల్సిన చర్యలు, వివిధ అంశాలపై మంత్రి సురేఖ సమీక్షించారు. ఈ సందర్భంగా వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు చేపట్టే పనుల గురించి వివరించారు.
కాకతీయుల కాలం నాటి ఐనవోలు మల్లికార్జున స్వామి ఆలయం ఎంతో ప్రాశస్త్యం కలిగి ఉందని మంత్రి కొండా సురేఖ అన్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పేర్కొన్నారు. జాతరకు వచ్చే భక్తులకు క్యూలైన్లు ఏర్పాటు చేయాలని, వృద్ధులు, మహిళలు, గర్భిణులు, దివ్యాంగులకు ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గతంలో కంటే దర్శనం కోసం వచ్చే భక్తులకు మెరుగైన సేవలను అందించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్లాస్టిక్ ఫ్రీ జాతరగా చేయాలనే ఉద్దేశంతో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పర్యావరణహితంగా ఉండే విధంగా జాతర ఏర్పాట్లు చేయాలన్నారు. అదనంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని పర్యవేక్షించాలన్నారు. సమీపంలోని కుంట వద్ద ప్రమాదాల నివారణకు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆఫీసర్లు అందుబాటులో ఉండాలి
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ ఐనవోలు మల్లికార్జున స్వామి దేవాలయం ఎంతో చారిత్రాత్మకమైనదని, జాతరకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. దర్శనం కోసం వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండి ఏర్పాట్లను పర్యవేక్షించాలని ఆదేశించారు. అంతకుముందు వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు మాట్లాడుతూ వారు చేపట్టే చర్యలను వివరించారు. ముందుగా దేవాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్, ఆలయ ఈవో నాగేశ్వర్ రావు మాట్లాడుతూ జాతర ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లను చేస్తున్నట్లు తెలిపారు. దైవ దర్శనానికి వచ్చే భక్తులకు సౌకర్యాలను కల్పించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు.
జాతర ప్రత్యేక అధికారి, హనుమకొండ ఆర్డీవో ఎల్.రమేష్ మాట్లాడుతూ గత జాతరలో జరిగిన ఇబ్బందులు ఈసారి జరగకుండా ఏర్పాట్లు పూర్తి చేస్తామన్నారు. అందుకు అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే జాతర ఏర్పాట్లలో తాగునీరు, పారిశుద్ధ్యం, ఆర్టీసీ, వైద్యం, పోలీస్ బందోబస్తు, తదితర అంశాలపై సమీక్షలు నిర్వహించినట్లు వివరించారు.
ఏసీపీ సతీష్ బాబు మాట్లాడుతూ జాతర ఏర్పాట్లలో పోలీస్ బందోబస్త్ పటిష్టంగా ఉండే విధంగా చర్యలు చేపడతామని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి గట్టి నిఘా పెడతామన్నారు. బందోబస్తుకు సంబంధించిన పలు అంశాలను, ఇంకా తీసుకోవాల్సిన చర్యలను వివరించారు.
అనంతరం రోడ్లు బాగాలేని చోట్ల వెంటనే బాగు చేయించాలని ఆర్ అండ్ బీ ఎస్ఈ నాగేందర్ కు మంత్రి సూచించారు. రహదారులకు ఇరువైపులా ముళ్ల కంపలు ఉంటే వాటిని తొలగించాలన్నారు. రహదారుల వెంట రేడియంతో కూడిన సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణకు స్టాపర్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ రాధిక గుప్తా, డీసీపీ రవీందర్, వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు పాల్గొన్నారు.
(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)