Inavolu Mallanna Jatara 2025 : మరో మూడు రోజుల్లో ఐలోని మల్లన్న జాతర - ట్రస్ట్ బోర్డు ఉన్నట్టా..?లేనట్టా..?-inavolu mallanna fair to start in three days but yet no announcement has been made on the trust board ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Inavolu Mallanna Jatara 2025 : మరో మూడు రోజుల్లో ఐలోని మల్లన్న జాతర - ట్రస్ట్ బోర్డు ఉన్నట్టా..?లేనట్టా..?

Inavolu Mallanna Jatara 2025 : మరో మూడు రోజుల్లో ఐలోని మల్లన్న జాతర - ట్రస్ట్ బోర్డు ఉన్నట్టా..?లేనట్టా..?

HT Telugu Desk HT Telugu
Jan 09, 2025 02:24 PM IST

Inavolu Mallanna Jatara 2025 Updates : ఐనవోలు మల్లన్న జాతరకు సమయం దగ్గరపడింది. జనవరి 13 నుంచి జాతర ప్రారంభం కానుంది. అయితే అతి పెద్ద వేడుకకు సమయం దగ్గరపడినప్పటికీ… ట్రస్ట్ బోర్డుపై ఇంకా క్లారిటీ రాలేదు. అసలు ట్రస్ట్ బోర్డు ఉన్నట్టా.. లేనట్టా..? అన్నది చర్చనీయాంశంగా మారింది.

ఐనవోలు
ఐనవోలు

రాష్ట్రంలో ప్రముఖ శైవ క్షేత్రమైన ఐనవోలు మల్లికార్జునస్వామి మహా జాతరకు సమయం ఆసన్నమైంది. ఇంకో మూడు రోజుల్లోనే స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఏటా సంక్రాంతి నుంచి ప్రారంభమయ్యే ఈ జాతరకు భోగి నుంచి కనుమ రోజుల్లోనే దాదాపు 10 లక్షల మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉంటుంది.

yearly horoscope entry point

రద్దీ తగ్గట్టుగా ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యతను ఆలయ పాలకవర్గం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ గత మూడేళ్ల నుంచి ఐనవోలు ఆలయ ట్రస్ట్ బోర్డు వ్యవహారంలో కోర్టు కేసులో చిక్కుకోవడంతో ఇప్పటి వరకు పాలకవర్గ ఏర్పాటుపై ఎలాంటి క్లారిటీ రాలేదు. ఇదిలాఉంటే కొంతమది నాయకులు తామే పాలకవర్గ సభ్యులమంటూ చెప్పుకుంటుండగా.. అధికారులు మాత్రం అధికారికంగా కమిటీ మాత్రం ప్రకటించలేదు. దీంతో ట్రస్ట్ బోర్డు ఉన్నట్టా.. లేనట్టా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ట్రస్ట్ బోర్డుపై వివాదం

2023 జాతర సమయంలో జనవరి 10 తేదీన దేవాదాయశాఖ ప్రకటించిన ట్రస్ట్ బోర్డు కారణంగా ఆలయంలో వివాదం చెలరేగింది. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా.. అప్పటి ఎమ్మెల్యే అరూరి రమేష్ తనకు సన్నిహితుడిగా ఉండే మజ్జిగ జయపాల్కు ఆలయ చైర్మన్ ఇస్తానని గతంలో హామీ ఇచ్చారు. ఈ మేరకు 14 మంది సభ్యులను ఎంపిక చేసి ట్రస్ట్ బోర్డు ఏర్పాటుకు ప్రపోజల్స్ పంపించారు. ఆ తరువాత జనవరి 10న దేవాదాయ శాఖ ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

ఇందులో మజ్జిగ జయపాల్ కు చైర్మన్ పదవి హామీ ఉండగా.. ఆయనే చైర్మన్ గా ఎన్నుకునేందుకు అంతా రంగం సిద్ధం చేశారు. కానీ ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం ఆలయంలో వాటాదారుగా ఉన్న వ్యక్తులకు ట్రస్ట్ బోర్డు సభ్యులుగా అవకాశం ఇవ్వకూడదు. కానీ రూల్ ను పట్టించుకోకుండా ఆలయంలో వాటాదారుగా ఉన్న జయపాల్ కు చైర్మన్ పదవి ఇచ్చేందుకు కసరత్తు చేయడంతో హనుమకొండకు చెందిన పైళ్ల శ్రీనివాస్ అనే వ్యక్తి రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. దీంతో దేవాదాయశాఖ ప్రకటించిన ట్రస్ట్ బోర్డు చెల్లదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికీ దానిపై విచారణ జరుగుతుండగానే గత ఆగస్టు 30న దేవాదాయ శాఖ నూతన ధర్మకర్త మండలి ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానించింది.

దీంతో కోర్టులో కేసు కొనసాగుతుండగా.. నూతన పాలకవర్గం ఎంపికకు దరఖాస్తులు ఆహ్వానించడం సరికాదని, అలా కాదని ఎంపిక చేపడితే తాము కోర్టు నుంచి సవాల్ చేస్తామంటూ అప్పట్లో వివాదంలో చిక్కుకున్న కమిటీ సభ్యులు దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కోర్టు తీర్పు వెలువడే వరకు ట్రస్ట్ బోర్డు ఎంపిక వాయిదా వేయాలని అటు ప్రభుత్వ పెద్దలతో పాటు ఆఫీసర్లు కూడా నిర్ణయానికి వచ్చారు. కాగా 2023 జాతర నుంచి ట్రస్ట్ బోర్డుపై వివాదం నడుస్తుండగా.. ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.

టెంపరరీ కమిటీ ఏర్పాటు..!

ఐనవోలు మల్లికార్జునస్వామి జాతర సంక్రాంతి నుంచి ప్రారంభమై ఉగాది వరకు కొనసాగుతుంది. భోగి పండుగ నుంచి ఉత్సవాలు ప్రారంభం కానుండగా.. భోగి, సంక్రాంతి, కనుమ రోజుల్లో రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. కేవలం ఈ మూడు రోజుల్లోనే దాదాపు 10 లక్షల మందికిపైగా భక్తులు తరలి వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇంత పెద్ద ఎత్తున భక్తుల తరలివచ్చే జాతరలో భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాటు చేయడంలో పాలకవర్గానిదే కీలకపాత్ర. కానీ ట్రస్ట్ బోర్డు విషయం కోర్టు పరిధిలో ఉండటంతో టెంపరరీగా జాతర కమిటీ వేసేందుకు కసరత్తు చేస్తున్నారు. ఈ మేరకు వర్ధన్నపేటకు చెందిన వ్యక్తిని జాతర కమిటీ చైర్మన్ గా ప్రకటించేందుకు ఎమ్మెల్యే వర్గం పావులు కదుపుతున్నట్లు తెలిసింది. కాగా అదే కమిటీ ట్రస్ట్ బోర్డుగా ఉంటుందని స్థానికంగా ప్రచారం కూడా జరుగుతోంది.

ఇబ్బందులు తప్పేనా..?

ప్రతిసారి జాతర సమయంలో మరుగుదొడ్లు, మూత్రశాలలు, తాగునీరు తదితర వసతులు సరిగా లేక భక్తులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. జాతర సమయంలో టెంపరరీ టాయిలెట్స్ ఏర్పాటు చేస్తున్నా అవి కూడా జనాలకు సరిపోవడం లేదు. దాంతో జాతరలో శానిటేషన్ కూడా ప్రధాన సమస్యగా మారింది.

ప్రతిసారి పంచాయతీలు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ శానిటేషన్ సిబ్బంది దాదాపు 500 మందితో పనులు చేయిస్తున్నా.. అక్కడ సేవలందలేని పరిస్థితి నెలకొంటోంది. దీంతో ఈసారి కూడా జాతర సమయంలో భక్తులు ఇబ్బందులు తప్పవనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఓ వైపు పాలకవర్గం లేకపోవడం, ఆఫీసర్లపైనే భారమంతా పడుతుండటం ఇబ్బందిగా మారగా.. అదనపు సిబ్బందిని కేటాయించి భక్తులకు సమస్యలు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి).

Whats_app_banner

సంబంధిత కథనం