Charlapalli Railway Station : చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభానికి ముహుర్తం ఖరారు - ఏ రోజంటే...!-inauguration of charlapally railway terminal is likely to be on 6th january 2024 ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Charlapalli Railway Station : చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభానికి ముహుర్తం ఖరారు - ఏ రోజంటే...!

Charlapalli Railway Station : చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభానికి ముహుర్తం ఖరారు - ఏ రోజంటే...!

అధునాతన హంగులతో సిద్దమైన చర్లపల్లి రైల్ టెర్మినల్ ప్రారంభోత్సవానికి ముహుర్తం ఫిక్స్ అయింది. జనవరి 6వ తేదీన ప్రారంభించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడగా.. ఈసారి పక్కాగా ఏర్పాట్లు జరగనున్నాయి. సుమారు 430 కోట్ల రూపాయలతో ఈ టెర్నినల్ నిర్మాణం చేశారు.

చర్లపల్లి రైల్వే టెర్మినల్

చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభోత్సవానికి మరో ముహుర్తం ఖారారైంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడగా.. ఈసారి మాత్రం పక్కాగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. నిజానికి డిసెంబర్ 28వ తేదీనే ఈ టెర్మినల్ ప్రారంభోత్సవానికి ఏర్పాటు చేసినప్పటికీ.. చివరి నిమిషంలో వాయిదా వేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిచెందడంతో కార్యక్రమం వాయిదా పడింది.

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతితో కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు కూడా  తెలిపారు. అయితే ఈ జనవరి 6వ తేదీన కొత్త టెర్మినల్ ను ప్రారంభించాలని రైల్వేశాఖ నిర్ణయించింది. కేంద్ర మంత్రులు అశ్వినీ వైష్ణవ్, కిషన్ రెడ్డి నేరుగా పాల్గొంటారు. అయితే ప్రధానమంత్రి మోదీ మాత్రం వర్చువల్‌గా హాజరై… రైల్వే టెర్మినల్‌ను ప్రారంభిస్తారని తెలిసింది. 

ఈ టెర్మినల్ అందుబాటులోకి వస్తే… రైల్వే ప్రయాణికులకు మరిన్ని మెరుగైన సేవలు అందనున్నాయి. సుమారు 430 కోట్ల రూపాయలతో ఈ టెర్నినల్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. చర్లపల్లి టెర్మినల్‌ ప్రారంభమైన తర్వాత 50 రైళ్లు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించే అవకాశం ఉంటుంది.

ఎన్నో ప్రత్యేకతలు....

  • దాదాపు రూ.430 కోట్ల వ్యయంతో చర్లపల్లి టెర్మినల్‌ను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అభివృద్ధి చేశారు. ఇక్కడ ప్రయాణికులకు ఉచిత వైఫై సదుపాయం కల్పించనున్నారు.
  • ఇక్కడ ఫుడ్‌ కోర్టులు, రెస్టారెంట్లు, ప్రయాణికుల కోసం వెయిటింగ్ ఏసీ, నాన్‌ ఏసీ హాల్స్, రిజర్వేషన్‌ కౌంటర్లు, టికెట్‌ కౌంటర్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం రెండు ఎంఎంటీఎస్‌ ప్లాట్‌ఫాంలతో కలిపి 9 ప్లాట్‌ఫాంలు, 2 ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జిలు, 6 ఎస్కలేటర్లు నిర్మించారు.
  • చర్లపల్లి టెర్మినల్‌ ప్రారంభమైన తర్వాత 50 రైళ్లు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించనున్నాయి. ప్రతిరోజూ దాదాపు 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
  • అధిక ప్రయాణికుల రాక పోకలకు అనుగుణంగా కొత్తగా నిర్మితమైన ఈ స్టేషన్ భవనం అత్యంత ఆధునికంగా మరియు సౌందర్య వంతమైన ముఖ్య ద్వారంతో నిర్మించడం జరిగింది.
  • ఈ స్టేషన్ భవనం లో గ్రౌండ్ ఫ్లోర్లో ఆరు టికెట్ బుకింగ్ కౌంటర్లు, లేడీస్ వెయిటింగ్ హాల్, పురుషుల వెయిటింగ్ హాల్, ఎగువ తరగతి వెయిటింగ్ హాల్, ఎగ్జిక్యూటివ్ లాంజ్ మరియు మొదటి అంతస్తులో కేఫ్టేరియా, రెస్టారెంట్, స్త్రీలకు మరియు పురుషులకు కోసం విశ్రాంతి గదులు ఉంటాయి. స్టేషన్ ముఖద్వారానికి అత్యాధునిక లైటింగ్వ్యవస్థ ఏర్పాటు చేయబడింది
  • ప్రస్తుతం చర్లపల్లి 26 రైళ్లు ఆగుతున్నాయి. వాటిల్లో ముఖ్యంగా కృష్ణా ఎక్స్‌ప్రెస్, గుంటూరు ఇంటర్‌సిటీ, కాగజ్‌నగర్‌ ఇంటర్‌సిటీ, మిర్యాలగూడ ఎక్స్‌ప్రెస్, పుష్‌-పుల్‌, శబరి ఎక్స్‌ప్రెస్, శాతవాహన, కాకతీయ ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి, రేపల్లె ప్యాసింజర్‌, ఘట్‌కేసర్‌ ఎంఎంటీఎస్ రైళ్లు ఉన్నాయి.
  • చర్లపల్లి నుంచి రైళ్ల రాకపోకలతో హైదరాబాద్, సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్లపై భారం తగ్గనుంది. 
  • చర్లపల్లి టెర్మినల్‌ ప్రారంభం అయిన తర్వాత స్టేషన్‌కు చేరుకునే మార్గంలో.. రోడ్ల విస్తరణ చేపట్టి ప్రజారవాణాను మెరుగుపరచాలనే డిమాండ్ ఉంది. దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపితే.. ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది.
  • హైదరాబాద్‌కు తూర్పున చర్లపల్లి టెర్మినల్‌ను నిర్మించారు. దీనికి దగ్గర్లోనే ఘట్‌కేసర్‌ వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్ ఉంది. దీంతో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు భావిస్తున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్లపల్లి టెర్మినల్‌కు చేరుకునే అవకాశం ఉందని.. అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్, ప్రజా రవాణా వాహనాలు సులువుగా చేరుకునే అవకాశం ఉంటుంది.