TS Assembly Elections 2023 : ఓ వైపు పార్టీలు... మరోవైపు నేతల సొంత సర్వేలు
Telangana Assembly Elections 2023: ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ చాలా మంది నేతలు సర్వేలు చేయించుకుంటున్నారట! పార్టీల పరంగానే కాకుండా… సొంతంగా కూడా చేయించుకుంటూ తమ బలబలాను అంచనా వేసుకునే పనిలో ఉన్నారు.
Telangana Assembly Elections 2023: తెలంగాణ రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్న ఆయా పార్టీల నాయకులు సొంత సర్వేలపై ఆధారపడుతున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అధికార బీఆర్ఎస్ తమ పన్నెండు మంది అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి, అదే మాదిరిగా బీజేపీ నుంచి టికెట్లు ఆశించే వారంతా తమ తమ అధిష్టానాలకు దరఖాస్తులు కూడా చేసుకున్నారు. ఈ రెండు పార్టీల్లో దరఖాస్తుల వడబోత, సరైన అభ్యర్థుల వెతుకులాటలో నాయకత్వాలు ఉన్నాయి. ఏ అభ్యర్థి అయితే గెలుపు అవకాశాలు ఉంటాయన్న వివరాల సేకరణ కోసం పార్టీ హైకమాండ్లు సర్వేలపై ఆధారపడుతున్నాయి. ఈ లోగా అసలు తమ తమ నియోజకవర్గాల్లో తమ పరిస్థితి ఎలా ఉంది. ఎదుటు పార్టీ వారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునేందుకు.. టికెట్ తనకే వస్తుందన్న ఆత్మ విశ్వాసం ఉన్న వారంతా సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు.
ట్రెండింగ్ వార్తలు
బీఆర్ఎస్ .. నిత్య సర్వేలు
అధికార బీఆర్ఎస్ అగ్ర నాయకత్వం పూర్తిగా సర్వేలపైనే ఆధారపడుతోంది. ప్రభుత్వ నిఘా విభాగాల ద్వారా ఓ వైపు సమాచారం సేకరిస్తూనే.. మరో వైపు ప్రైవేటు సర్వే సంస్థల ద్వారా వివరాలు సేకరిస్తోంది. వాస్తవానికి సర్వేల ఆధారంగా మాత్రమే అభ్యర్థులను ఎంపిక చేస్తారని, ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ పూర్తిగా సర్వేలపై నమ్మకముంచే తమ గెలుపు గుర్రాలను ప్రకటిస్తారని ముందు నుంచీ ఓ అభిప్రాయం ఉంది. కానీ, ఈ సారి సర్వే ఫలితాలెలా ఉన్నాయో కానీ, ఏక కాలంలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ టికెట్లు ఇచ్చారు. చిరవరలో కొన్ని మార్పులు కూడా ఉంటాయని ఆయన చేసిన ప్రకటనతో టికెట్ ఆశావహులు కొంత స్థిమిత పడ్డారు. టికెట్ల ప్రకటన తర్వాత కూడా బీఆర్ఎస్ గ్యాప్ ఇవ్వకుండా తమ అభ్యర్థులు, పార్టీ, నియోజకవర్గాల్లో పరిస్థితి, ఎదుటి పక్షం బలా బలాలు తెలుసుకునేందుకు సర్వేలను ఆశ్రయిస్తోంది. మరో వైపు అభ్యర్థులు సైతం తమ పరిస్థితిపై అంచనాకు సర్వేలను ఆశ్రయిస్తున్నారు. వీటన్నింటికి తోడు ఇంటలిజెన్స్ సర్వేలు సరేసరి.
కాంగ్రెస్ లోనూ... అదే తీరు
ఈ సారి అధికారంలో వస్తామని ఎంతో విశ్వాసం ప్రకటిస్తున్న కాంగ్రెస్ సైతం సర్వేలనే నమ్ముకుంటోంది. ఇప్పటికి అన్ని నియోజకవర్గాల వారీగా ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించి, కొన్ని నియోజకవర్గాల్లో ఇద్దరు మరికొన్ని చోట్ల ముగ్గురి పేర్ల చొప్పున జాబితా సిద్ధం చేసుకుని వీరిపై సర్వే చేయిస్తోందని సమాచారం. సర్వేల ఉప్పు అందుకున్న సీరియస్ ఆశావహులు తమ పరిస్థితిపై అంచనాకు సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. ఇప్పటికే కొత్తగా పార్టీలోకి వచ్చి చేరుతున్న వారిని ఎలాంటి షరతుల్లేకుండా చేర్చుకుంటూనే.. సర్వే ఫలితాలను బట్టి టికెట్ అవకాశం ఉంటుందని వారికి నచ్చచెబుతున్నట్లు తెలిసింది. పార్టీ సర్వే ఫలితాలు ఎలా ఉన్నా.. తామూ సొంతంగా సర్వే చేయించుకుని ఆ ఫలితాల ద్వారా ఒక అంచనాకు వచ్చి టికెట్ కోసం గట్టిగా కొట్లాడవచ్చన్న ఆలోచనలతో సర్వేలు చేయించకుంటున్నారని చెబుతున్నారు.
బీజేపీ... సర్వే జపం
తెలంగాణలో పాగా వేసేది తామేనని చెబుతున్న బీజేపీ సైతం నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, అభ్యర్థుల విజయావకాశాలను ప్రభావితం చేసే అంశాలపై సమాచారం సేకరిస్తోంది. పార్టీ నాయకత్వం ప్రధానంగా సెంట్రల్ ఇంటలిజెన్స్ విభాగం సేవలు పొందుతోందని తెలుస్తోంది. ఈ విభాగం ద్వారా ఇప్పటికే నివేదికలు తెప్పించుకుందని అంటున్నారు. టికెట్లు ఇవ్వడం కోసం ఇప్పటికే ఆయా నియోజకవర్గాల నుంచి దరఖాస్తులు స్వీకరించింది. ప్రతీ నియోజకవర్గం పదుల సంఖ్యలో దరఖాస్తులు అందుకుంది. ఇపుడు వీటి నుంచి ఇద్దరు లేదా ముగ్గురి చొప్పున ముందుగా ఎంపిక చేసుకుని ఫైనల్ అభ్యర్థిని జాతీయ నాయకత్వ ఇష్టానికి వదిలే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, సెంట్రల్ ఇంటలిజెన్స్ విభాగం ఏం రిపోర్టు ఇచ్చిందో... తమకు అవకాశం ఎలా ఉంటుందో అంతుబట్టని నేతలు జిల్లాల్లో నియోజకవర్గంలో తమ పరిస్థితిపై సర్వే చేయించుకుని ఆ ఫలితాలను ముందు పెట్టి టికెట్ లాబీయింగ్ చేసేందుకే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారని తెలిసింది. మొత్తంగా ఆయా పార్టీల అధినాయకత్వాలు చేయిస్తున్న సర్వేలకు తోడు.. టికెట్ ఆశావహులు సైతం తమ స్థితిని తెలుసుకునేందుకు అవే సర్వేలను సొంతంగా డబ్బు ఖర్చుపెట్టి చేయించుకోవడం విశేషం.
రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్లగొండ
సంబంధిత కథనం