Flight Ticket Fraud: ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ పేరుతో కన్సల్టెన్సీలకు టోకరా, నిందితుడి అరెస్ట్‌-in the name of booking flight tickets consultancies were raided the accused was arrested ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Flight Ticket Fraud: ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ పేరుతో కన్సల్టెన్సీలకు టోకరా, నిందితుడి అరెస్ట్‌

Flight Ticket Fraud: ఫ్లైట్ టికెట్స్ బుకింగ్ పేరుతో కన్సల్టెన్సీలకు టోకరా, నిందితుడి అరెస్ట్‌

HT Telugu Desk HT Telugu
Jul 11, 2024 06:22 AM IST

Flight Ticket Fraud: తక్కువ ధరకు ఫ్లైట్ టికెట్స్ ఇప్పిస్తానంటూ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివిన ఓ యువకుడు మోసాలకు తెర లేపాడు. రాయితీ టిక్కెట్లో ట్రావెల్ ఏజెన్సీలను మోసం చేసి చివరకు కటకటాల పాలయ్యాడు.

ఫ్లైట్ టిక్కెట్స్ బుకింగ్‌‌లో మోసాలకు పాల్పడిన యువకుడి అరెస్ట్
ఫ్లైట్ టిక్కెట్స్ బుకింగ్‌‌లో మోసాలకు పాల్పడిన యువకుడి అరెస్ట్

Flight Ticket Fraud: ఎయిర్ పోర్టులో పని చేస్తున్న తనకు విమాన టికెట్లలో రాయితీ ఉంటుందని కన్సల్టెన్సీలతో ఒప్పందం కుదుర్చుకుని, టికెట్లు బుక్ చేయడంతో పాటు వారికి తెలియకుండా టికెట్ క్యాన్సిల్ చేసి డబ్బులు రీఫండ్ చేయించుకోవడం మొదలుపెట్టాడో కేటుగాడు.

ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కన్సల్టెన్సీలను బురిడీ కొట్టిస్తుండగా, చివరకు వరంగల్ కమిషనరేట్ పోలీసులు అతడి ఆటకట్టించారు. బుధవారం అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి పంపించారు. నిందితుడి అరెస్టుకు సంబంధించిన వివరాలను హనుమకొండ సీఐ సతీశ్ వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన మాడు సాయితేజ అనే 30 ఏండ్ల యువకుడు బీటెక్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ లో చేరాడు. ఆ చదువును వివిధ కారణాలతో మధ్యలోనే ఆపేసి, చెన్నైలోని ఎయిర్ పోర్టు క్యాబిన్ క్రూలో పని చేశాడు. అక్కడ పని చేస్తున్న క్రమంలోనే అందులో పని చేసే వారందరితో పరిచయాలు పెంచుకున్నాడు. కలివిడిగా ఉంటూ అందరితో మాట కలపడం మొదలుపెట్టాడు.

రాయితీ మిస్ యూజ్ చేసి ఫ్రాడ్

సాధారణంగా ఎయిర్ పోర్టులో పని చేసే వారికి ఫ్లయిట్ టికెట్స్ లో 20 శాతం వరకు రాయితీ ఉంటుంది. ఈ విషయం తెలుసుకున్న మాడు సాయితేజ జస్ట్ డయల్ వెబ్ సైట్ తో లింక్ అయి ఉన్న కొన్ని కన్సల్టెన్సీల వివరాలు సేకరించాడు. అనంతరం ఆయా కన్సల్టెన్సీల ఫోన్ నెంబర్లు తీసుకుని నేరుగా నిర్వాహకుల టచ్ లోకి వెళ్లాడు. ఆ తరువాత వారికి ఫోన్ చేసి, బయటి రేటు కంటే తక్కువ ధరకు ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి ఇస్తానని, అసలు తన ప్లాన్ మొత్తం చెప్పాడు. ఇలా తక్కువ ధరకు టికెట్ ఇస్తూ అందులో కొంత పర్సంటేజీ కమీషన్ పేరున తీసుకునేందుకు ప్లాన్ వేశాడు.

టికెట్స్ బుక్ చేసి, ఆ తరువాత క్యాన్సిల్

కన్సల్టెన్సీల ఒప్పందం ప్రకారం సాయితేజ వివిధ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు విమాన టికెట్లు బుక్ చేసేవాడు. అందులో 20 శాతం రాయితీ వస్తుండటంతో టికెట్ బుక్ చేసి, వారి నుంచి కమీషన్ తీసుకునేవాడు. ఇంతవరకు బాగానే ఉన్నా ప్రయాణికులకు టికెట్ బుక్ చేస్తున్న సాయితేజ.. తన ప్లాన్ ప్రకారం కన్సల్టెన్సీలకు తెలియకుండా మళ్లీ టికెట్స్ క్యాన్సిల్ చేసేవాడు. దీంతో టికెట్ రద్దు అనంతరం డబ్బులు రీఫండ్ అయ్యేవి. కాగా ఆ రీఫండ్ అమౌంట్ ను తన ఖాతాలోకి కాకుండా ఇతరుల అకౌంట్ లోకి పంపేవాడు.

అలా వచ్చిన డబ్బుతో సాయితేజ జల్సాలు చేయడం మొదలు పెట్టాడు. ఇదిలా ఉంటే కన్సల్టెన్సీల ద్వారా సాయితేజ ఫ్లైట్ టికెట్స్ ఆర్డర్ తీసుకున్న వాటిలో తరచూ క్యాన్సిల్ అవుతుండటం, చివరి నిమిషంలో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తుతుండటంతో కన్సల్టెన్సీలకు కూడా అనుమానాలు తలెత్తాయి. ఈ క్రమంలోనే హనుమకొండ నుంచి ఫిర్యాదులు అందగా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు.

దర్యాప్తు చేపట్టి నిందితుడిని గుర్తించారు. దర్యాప్తులో భాగంగా సుబేదారితో పాటు సూర్యాపేట, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలలో నిందితుడిపై కేసులు నమోదు అయినట్లు గుర్తించారు. ఈ మేరకు బుధవారం సాయితేజను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు హనుమకొండ ఇన్స్పెక్టర్ సతీష్ వివరించారు. కాగా నిందితుడిని అరెస్టు చేయడంలో ప్రతిభ కనబరిచిన హనుమకొండ పోలీసులను వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝా అభినందించారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

WhatsApp channel