Telgangana BC CM : ఈ ఐదేళ్లు రేవంత్ రెడ్డే సీఎం, భవిష్యత్తులో బీసీ సీఎం- టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
Telangana BC CM : రానున్న రోజుల్లో తెలంగాణలో రాజకీయాలన్నీ బీసీ అజెండగా జరుగుతాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో బీసీ సీఎం అవుతారన్నారు. కాంగ్రెస్ తోనే బీసీ సీఎం సాధ్యమవుతుందన్నారు.

Telangana BC CM : తెలంగాణలో కులగణన, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు రిజర్వేషన్లపై గత కొన్ని రోజులుగా తీవ్ర చర్చ జరుగుతోంది. తాజాగా ఈ విషయాలపై టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. ఈ 5 సంవత్సరాలు సీఎంగా రేవంత్ రెడ్డే ఉంటారని స్పష్టం చేశారు. వచ్చే రోజుల్లో రాజకీయాలు అన్నీ బీసీ అజెండాగా జరుగుతాయన్నారు. బీసీ సీఎం కేవలం కాంగ్రెస్ తోనే సాధ్యం అవుతుందన్నారు. భవిష్యత్తులో తెలంగాణలో బీసీ వ్యక్తి సీఎం అవుతారన్నారు.
9వ షెడ్యూల్ చేర్చేలా కేంద్రాన్ని ఒప్పించాలి
"వచ్చే కేబినెట్ లో బీసీలకు ప్రాధాన్యత ఉంటుంది. తెలంగాణలో కులగణన చేయడంతోనే మా నిబద్ధతను నిరూపించుకున్నాం. దేశంలో బీజేపీ ప్రభుత్వం చాలా రాష్ట్రాల్లో ఉంది. వాళ్లు ఎక్కడా బీసీ కులగణన చేయలేదు. కులగణన చేయకుండా బీసీల గురించి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీకి నిబద్దత ఉంది కాబట్టి తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కులగణన చేసింది. ఎన్నికల హామీ మేరకు బీసీలకు 42శాతం రిజర్వేషన్లు చట్టబద్ధత కల్పిస్తాం.
పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కులగణన చేయలేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి అవకాశం ఉంది. కానీ చేయడంలేదు. కులగణన సర్వేకు చట్టబద్ధత తీసుకొచ్చి కేంద్రానికి పంపిస్తాం. దానిని 9వ షెడ్యూల్ లో చేర్చి బీజేపీకి బీసీలపై ఉన్న చిత్తశుద్ధిని చాటుకోవాలి. బీసీ బిడ్డ బండి సంజయ్ కేంద్ర మంత్రిగా ఉన్నారు. ఆయన ప్రధాని మోదీతో మాట్లాడి బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్ చేర్చేలా ఒప్పించాలి"-టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు
"బీజేపీ ఎంపీలందరూ ప్రధాని మోదీ వద్దకు వెళ్లి పట్టుబట్టి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు 9వ షెడ్యూల్ లో చేర్చండి. అప్పుడు బీజేపీ చిత్తశుద్ధి ప్రజలకు అర్థం అవుతుంది. తెలంగాణలో బీసీ వ్యక్తి సీఎం అవుతారు. అది కాంగ్రెస్ పార్టీ వల్లే సాధ్యం అవుతుంది. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో చక్కని కార్యక్రమాలు చేస్తున్నారు. భవిష్యత్తులో బీసీ వ్యక్తి ముఖ్యమంత్రి అవుతారంటే అది కాంగ్రెస్ వల్లే సాధ్యం అవుతుంది. బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలని రాహుల్ గాంధీ నిర్ణయించారు. వచ్చే ఎన్నికలు కూడా బీసీ అజెండానే ఉంటాయి. ఈ 5 ఏళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారు. రానున్న రోజుల్లో బీసీ వ్యక్తి సీఎం అవుతారు"- మహేష్ కుమార్ గౌడ్
సంబంధిత కథనం
టాపిక్