Komatireddy Party Change: రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పుపై ఆగని ప్రచారం
Komatireddy Party Change: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి... ఈ పేరు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఇపుడు హాట్ టాపిక్. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ (బీజేపీ)లోనే ఉన్నా... అధికార పక్షం భారత రాష్ట్ర సమితితో పాటు, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్.. ఇలా మూడు పార్టీల్లో చర్చంతా రాజగోపాల్ రెడ్డి చుట్టూ తిరుగుతోంది.
Komatireddy Party Change: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంతకూ బీజేపీలోనే కొనసాగుతారా..? కాంగ్రెస్ గూటికి చేరుతారా..? రానున్న తెలంగాణ శాసన సభ ఎన్నికల్లో పోటీకి దిగుతారా..? అయితే ఏ పార్టీ నుంచి..? ప్రస్తుతం ఈ ప్రశ్నలపై చర్చజరగడమే కాకుండా.. రాజగోపాల్ రెడ్డి పార్టీ మార్పు అంశం నిత్య ప్రచారంలో ఉంటోంది.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 2009 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి భువనగిరి ఎంపీగా విజయం సాధించారు. అప్పటి ఉమ్మడి రాష్ట్ర సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి దుర్మరణం తర్వాత ఉవ్వెత్తున లేచిన తెలంగాణ ఉద్యమంలో.. ప్రధానంగా అపుడు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కారుపై ఒత్తిడి తేవడంలో క్రియాశీలకంగా వ్యవహరించారు.
రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 2014 లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో ఆయన భువనగిరి లోక్ సభా స్థానం నుంచి కాంగ్రెస్ పక్షాన పోటీకి దిగి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత కొన్నాళ్లకే నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల శాసన మండలి నియోజకవర్గానికి పోటీ చేసి ఎమ్మెల్సీగా విజయం సాధించారు.
లోకల్ బాడీ ఎమ్మెల్సీగా పదికాలం మిగిలి ఉండగానే 2018 శాసన సభ ఎన్నికల్లో మునుగోడు నియోజకవర్గం నుంచి పోటీచేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దీంతో తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. ఫలితంగా ఎమ్మెల్సీ ఎన్నిక అనివార్యం కావడంతో తాను రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పదవి కోసం తన భార్య లక్ష్మీని పోటికి దింపినా ఆమె ఓటమి పాలై, బీఆర్ఎస్ కు చెందిన తేరా చిన్నపురెడ్డి విజయం సాధించారు.
మునుగోడు ఎమ్మెల్యేగా ఆయన పెద్దగా కుదురుకోలేక పోయారు. గతేడాది తన ఎమ్మెల్యే పదివికి.. కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ తర్వాత బీజేపీలో చేరి మునుగోడు ఉప ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. పదిహేనేళ్ల పొలిటికల్ కేరీర్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎంపీగా, ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా పదవులు నిర్వహించినా, ప్రస్తతం మాజీగా మిగిలిపోయారు.
బీజేపీతో అంటీ ముట్టనట్టుగా...
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఉన్నది బీజేపీలోనైనా , ఆయన అక్కడ పెద్దగా కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. బీజేపీని వీడి తిరిగి తన సొంతగూటికి చేరుతారాన్న ప్రచారం కొన్నాళ్లుగా జోరుగా సాగుతోంది. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చే కనీస అవకాశాల్లేకపోవడం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేయకపోవడం, లోపాయికారిగా బీజేపీ, బీఆర్ఎస్ రాజీపడిపోయాయన్న ప్రచారం జరుగుతుండడం, వంటి కారణాలతో బీజేపీని వీడాలన్న ఆలోచనకు వచ్చారని అంటున్నారు.
ఇటీవల బీజేపీ నాయకురాలు, సినీ నటి విజయశాంతి ఇంట్లో ఆ పార్టీ ముఖ్య నాయకులు వివేక్ వెంకటస్వామి, కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కలిసి రాజగోపాల్ రెడ్డి భేటీ కావడం చర్చ నీయాంశం అయ్యింది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, వివేక్ వెంకటస్వామి తాము పార్టీ మారడం లేదని, కాంగ్రెస్ లేదా మరే ఇతర పార్టీలో చేరడం లేదని స్పష్టత ఇచ్చినా కోమటిరెడ్డి నుంచి అలాంటి ప్రకటనేది వెలువడలేదు.
మూడు రోజుల కిందట మునుగోడు నియోజకవర్గంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజగోపాల్ రెడ్డి తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలపై నోరు విప్పారు. ఈ విషయంలో వారం రోజుల్లో స్పష్టత ఇస్తానని ప్రకటించారు. దీంతో ఆయన బీజేపీని వీడి కాంగ్రెస్ గూటికి చేరుతారన్న ప్రచారం మరింతగా ఊపందుకుంది.
ఏఐసీసీ నాయకత్వం టచ్ లోకి వచ్చిందా..?
కాంగ్రెస్ పార్టీలో ఉన్న తన సహచరులు, అభిమానులు తిరిగి పార్టీకి వచ్చేయమని సలహా ఇస్తున్నారంటూ రాజగోపాల్ రెడ్డి ఒకటికి రెండు సార్లు పేర్కొన్నారు. అయితే, రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి వామపక్షాలతో కాంగ్రెస్ పొత్తు విషయం తేలాల్సి ఉంది. పొత్తు కుదిరితే సీపీఐ కోరే స్థానాల్లో మునుగోడు ఒకటి. పొత్తు ఖరారు కంటే ముందే పార్టీలో చేరితే.. టీపీసీసీ లోని తనకు వ్యతిరేకంగా పనిచేసిన ఒక వర్గం దెబ్బకొట్టే ముప్పు ఉందన్న ముందు చూపుతో వేచి చూసే ధోరణలో ఉన్నట్లు చెబుతున్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలో పలువురు ముఖ్య నాయకులు, మాజీ మంత్రులు కాంగ్రెస్ కు వరస కట్టారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే.. బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ కు తీసుకువచ్చేందుకు ఏఐసీసీ నాయకత్వం నడుంకట్టిందని అంటున్నారు. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఈ మేరకు రాజగోపాల్ రెడ్డితో ఇప్పటికే రెండు పర్యాయాలు చర్చలు జరిపారని, కొన్ని హామీలు కూడా ఇచ్చారని తెలుస్తోంది. ఇక, రాజగోపాల్ రెడ్డి తన నిర్ణయం ప్రకటించడమే మిగిలిందని కాంగ్రెస్ వర్గాలు.. రాజగోపాల్ రెడ్డి దగ్గరి అనుచరులు చెబుతున్నారు.
( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, నల్లగొండ )