Hyd Bike Blast: హైదరాబాద్‌లో ఘోరం, బైక్‌లో మంటలు ఆర్పుతుండగా భారీ పేలుడు, పలువురికి తీవ్ర గాయాలు
Hyd Bike Blast: హైదరాబాద్‌లో ఒళ్లు గగుర్పొడిచే ఘటన జరిగింది. మంటల్లో చిక్కుకున్న బైక్‌పై నీళ్లు చల్లుతుండగా ఒక్కసారిగా పేలిపోయింది. ఈ ఘటనలో పదిమందికి గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
Hyd Bike Blast: హైదరాబాద్‌లో బైక్ పేలిన ఘటనలో పదిమంది గాయపడ్డారు. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్ పాతబస్తీ భవానీనగర్ పిఎస్ పరిధిలో ఈ ఘటన జరిగింది. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
మొఘల్‌పురా అస్లా ఫంక్షన్ హాల్ సమీపంలో రోడ్డుపై వెళుతున్న బైక్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దానిపై ప్రయాణిస్తున్న వ్యక్తి వెంటనే వాహనాన్ని ఆపేశాడు. మంటల్ని ఆర్పేందుకు స్థానికులు ప్రయత్నించారు. బైక్‌పై వాటర్ పైప్‌తోనీళ్లు పోసి మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పెట్రోల్ ట్యాంక్ ఒక్కసారిగా పేలిపోయింది. బైక్ చుట్టూ గుమిగూడి ఉన్న వారు ఈ ఘటనలో గాయపడ్డారు. మంటల్లో గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ఓ ప్రయివేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ద్విచక్ర వాహనం పెట్రోల్ ట్యాంకు పేలిన ఘటన తలాబ్ కట్ట ప్రాంతంలో విధ్వంసాన్ని సృష్టించింది. పాత బస్తీ భవానీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనలో పది మంది గాయపడగా వారిలో ముగ్గురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారని పోలీసులు తెలిపారు.
ఆదివారం తలాబ్‌కట్టకు చెందిన అబ్దుల్ రెహానా ఖాన్ తన భార్య నేహతో కలిసి మొగల్‌పుర వెళ్తున్నారు. తలాబ్‌కట్ట అస్లాం ఫంక్షన్‌హాల్ సమీపంలోకి రాగానే వాహనం ఇంజిన్ సమీపంలో మంటలు రేగాయి. దీంతో రెహాన్ వాహనాన్ని నిలిపివేయడంతో మంటలు పెరిగాయి. మంటల్ని అదుపు చేసేందుకు రెహాన్ ప్రయత్నించాడు.
మంటల్ని అదుపు చేయడానికి ప్రయత్నించిన రెహాన్‌కు చెరకు బండి యజమాని ఎండీ నదీమ్, స్థానికంగా నివసిస్తున్న షౌకత్ అలీ, గౌస్ రెహ్మాన్ అజీజ్, ఖాదర్, హుస్సేన్ ఖురేషీ, సలే సూద్, ఖాజా పాషా, షేక్ అజీజ్‌తో పాటు ఎన్నికల విధుల్లో ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ సందీప్ తదితరులు నీళ్లు, మట్టి చల్లి మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నించారు. మంటలు అదుపులోకి రాకపోవడంతో నదీమ్ వాహ నంలో పెట్రోలు ఉందో లేదో చూసేందుకు ట్యాంకు మూత తెరిచారు. దీంతో ఒక్కసారిగా భారీ పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో నదీమ్ (32), షౌకత్అలీ(42), రెహాన్ ఖాన్(28)లకు మంటలు చుట్టుముట్టాయి.
పేలుడు ధాటికి సమీపంలో ఉన్న మరికొందరికి కూడా గాయాలయ్యాయి. వాహనం చుట్టూ జనం గుమిగూడి ఉండటంతో ఈ ఘటనలో గాయపడిన వారి సంఖ్య పెరిగింది. తొలుత భారీ పేలుడు శబ్ధం వినిపించిందని, భయంతో జనం పరుగులు తీసినట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఘటనాస్థలికి చేరుకున్న భవానీనగర్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. పేలుడుకు గల కారణాలపై విచారణ ప్రారంభించామని, వివరాలు సేకరిస్తున్నామని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.