తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ పట్టాలెక్కింది. రాష్ట్రంలో మండలానికి ఒక్క గ్రామం చొప్పున మొత్తం 562 పంచాయతీల్లో 71,482 మంది లబ్ధిదారులు మొదటి విడతలో ఎంపికయ్యారు. వీరందరికీ ప్రోసిడింగ్స్ కాపీలు అందిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం అన్ని నియోజకవర్గాల్లోనూ లబ్ధిదారుల గుర్తింపు కోసం కసరత్తు జరుగుతోంది.
ఇందిరమ్మ ఇళ్ల కోసం వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం మూడు కేటగిరిలుగా విభజించింది. సొంత జాగా ఉండి ఇళ్లు లేనివాళ్లను ఎల్ 1 కేటగిరిలో ఉంచగా… ఇక సొంత స్థలం లేనివారని ఎల్-2, సొంత ఇల్లు ఉండీ ఇందిరమ్మ ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్న వారిని ఎల్-3లో చేర్చారు. అయితే ఈ వివరాలను తెలుసుకునేందుకు వీలుగా ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్లు ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ వెబ్ సైట్ లోకి వెళ్లి వారి అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. అంతేకాకుండా…. వారి దరఖాస్తు ఏ కేటగిరి కింద ఉందో కూడా తెలుసుకునే వీలు ఉంది. ఆ జాబితాలో ఉండటానికి గల కారణాలను కూడా ఇందులో చేర్చారు. వీటిపై అభ్యంతరాలు ఉంటే… ఆన్ లైన్ లోనే ఫిర్యాదు చేసేలా గ్రీవెన్స్ ఆప్షన్ ను తీసుకొచ్చారు.
ఇందిరమ్మ ఇళ్ల స్కీమ్ కు సంబంధించిన ఫిర్యాదులు, సమస్యలు రిజిస్ట్రర్ చేసుకునేందుకు ప్రభుత్వం టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా తీసుకువచ్చింది. సందేహాలు నివృత్తి చేయడం, ఫిర్యాదుల స్వీకరణ కోసం 040-29390057 టోల్ ఫ్రీ నెంబర్ ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ నెంబర్ కు కాల్ చేసి వివరాలు తెలుపొచ్చు. ప్రభుత్వం తీసుకువచ్చిన టోల్ ఫ్రీ నెంబర్ అన్ని పని దినాల్లో పని చేస్తుంది. ఇదే కాకుండా కొన్ని జిల్లాల కలెక్టరేట్లలో కూడా ప్రత్యేక నెంబర్లను అందుబాటులోకి తీసుకువచ్చారు.
ఇక మొదటి దశలో సొంత జాగ ఉండి ఇళ్లు లేని వాళ్లకు ప్రాధాన్యం ఇస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. రెండో దశలో స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి సాయం చేస్తామని పేర్కొంది. ఇందుకు అనుగుణంగానే… ఎల్ 1 జాబితాలో ఉన్నవారికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్ల చొప్పున మంజూరు చేయనున్నారు. త్వరలోనే అన్ని గ్రాామాల్లోనూ లబ్ధిదారులను గుర్తించనున్నారు.
సంబంధిత కథనం