Indiramma Housing Scheme : ఇందిరమ్మ ఇండ్ల పథకంపై కేంద్ర బడ్జెట్ ప్రభావం.. 10 ముఖ్యమైన అంశాలు
Indiramma Housing Scheme : తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. కేంద్రం నుంచి వచ్చే ఆర్థిక సాయం పెరుగుతుందని ఆశించింది. కానీ ఈసారి కేంద్ర బడ్జెట్‌లో ఇళ్లకు కేటాయింపులు తగ్గాయి. ఈ ప్రభావం తెలంగాణ ఇందిరమ్మ ఇండ్ల పథకంపై పడనుంది.
తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికలకు ముందు ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని అమలు చేయాలని, లబ్ధిదారుల తుది జాబితాను ప్రకటించాలని ప్రభుత్వం భావించింది. ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కేంద్రం భారీగా నిధులు కేటాయిస్తుందని ఆశించింది. కానీ.. ఆశించిన స్థాయిలో కేంద్ర బడ్జెట్‌లో నిధులు కేటాయించలేదు. పైగా తగ్గించారు. దీని ప్రభావం ఇందిరమ్మ ఇండ్ల పథకంపై పడనుంది. దీనికి సంబంధించిన 10 ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

10 ముఖ్యమైన అంశాలు..
1.కేంద్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద.. పట్టణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లకు కేటాయింపులు తగ్గాయి. దీని ప్రభావం తెలంగాణలోని ఇందిరమ్మ ఇండ్ల పథకంపై పడనుంది.
2.తెలంగాణకు రావాల్సిన కేంద్ర వాటా నిధులు తగ్గనున్నాయి. పీఎంఏవైలో ఒక్కో ఇంటికి పట్టణాల్లో అయితే.. రూ.1.50 లక్షలు, గ్రామాల్లో అయితే రూ.72 వేల చొప్పున కేంద్రం ఇస్తోంది.
3.2024-25లో ఈ పథకం కింద తెలంగాణకు 25 వేల ఇళ్లను మంజూరు చేసింది. 2025-26లో 2 లక్షల ఇళ్లనైనా కేటాయించాలని ప్రభుత్వం కోరింది.
4.పట్టణాల్లో నిర్మించే ఇళ్లకు కేంద్రం నుంచి అధికంగా నిధులు వచ్చే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.
5.ఇటీవలే 19 ప్రాంతాలను అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీల పరిధిలోకి తీసుకొచ్చింది. 2024-25 బడ్జెట్‌లో పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి రూ.30,171 కోట్లను కేటాయించారు.
6.ఈసారి బడ్జెట్‌లో రూ.19,794 కోట్లను మాత్రమే కేటాయించారు. కేటాయింపులు తగ్గిన నేపథ్యంలో.. కేంద్రం తెలంగాణ పట్టణాలకు ఎన్ని ఇళ్లను మంజూరు చేస్తుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
7.గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించే ఇళ్లకు ఈ బడ్జెట్‌లో ఎక్కువ నిధులను కేటాయించారు. 2025-26లో రూ.54,832 కోట్లు ప్రతిపాదించగా.. 2024-25లో రూ.32,426 కోట్లుగా కేటాయింపులు జరిగాయి.
8.2024-25 సంవత్సరంలో తెలంగాణకు ఈ పథకం కింద ఇళ్లను మంజూరు చేయలేదు. కానీ వచ్చే సంవత్సరం లక్ష వరకు గ్రామీణ ఇళ్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
9.ప్రధాన మంత్రి ఆవాస్ యోజన 2.0లో భాగంగా.. పేద, మధ్య తరగతి ప్రజలు ఇళ్ల నిర్మాణ రుణాల ద్వారా కట్టుకునే వాటికి వడ్డీ మాఫీ కోసం బడ్జెట్‌లో నిధులను పెంచారు.
10.ఈసారి కేంద్ర బడ్జెట్‌లో రూ.3,500 కోట్లను మాఫీ కోసం కేటాయించారు. దీని ద్వారా తెలంగాణలో 2 లక్షల మందికి దీని లబ్ధిపొందే అవకాశాలు ఉన్నాయి.