Telangana Rains : ఐఎండీ జారీ చేసే ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్స్ అర్థమేంటి?-imd updates what are red orange yellow alerts how is it decided know in details ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Imd Updates What Are Red, Orange, Yellow Alerts How Is It Decided Know In Details

Telangana Rains : ఐఎండీ జారీ చేసే ఎల్లో, ఆరెంజ్, రెడ్ అలర్ట్స్ అర్థమేంటి?

Anand Sai HT Telugu
Jul 07, 2022 03:02 PM IST

తెలంగాణలో కొన్నిరోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటోంది. ఎల్లో, ఆరెంజ్, గ్రీన్, రెడ్ అలర్టులు ఇస్తోంది. ఇంతకీ ఐఎండీ విడుదల చేసే హెచ్చరికలకు అర్థమేంటి?

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

కొన్ని రోజులుగా రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ అనేక ప్రాంతాలలో గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, కొన్నిసార్లు రెండ్ అలర్ట్ ఇస్తోంది. ఈ హెచ్చరికలు ఎందుకు జారీ చేస్తారు. ఈ రంగులకు సంకేతాలు ఏమిటి? అవి ఎందుకు ఉపయోగపడతాయి? అవి దేనిని సూచిస్తాయి?

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ట్రెండింగ్ వార్తలు

IMD వాతావరణ హెచ్చరికలలో కలర్ కోడ్‌లను జారీ చేస్తుంది. ఇది ప్రమాదకరమైన వాతావరణం కంటే ముందుగా ప్రజలను అప్రమత్తం చేస్తుంది. వాతావరణ పరిస్థితుల రంగును నిర్ణయించేందుకు ఒక ప్రత్యేక మ్యాట్రిక్స్ ను అనుసరిస్తారు.

IMD నాలుగు రంగు కోడ్‌లను ఉపయోగిస్తుంది:

ఆకుపచ్చ - ఎటువంటి చర్య అవసరం లేదు

పసుపు - అప్‌డేట్‌గా ఉండండి

ఆరెంజ్ - సిద్ధంగా ఉండండి

ఎరుపు - చర్య తీసుకోండి

ఈ రంగుల వివరణ వర్షపాతం, ఉరుములు, మెరుపులు మొదలైన నిర్దిష్ట వాతావరణ సంఘటనల గురించి చెబుతుంది. ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ అలర్ట్స్ సూచిస్తాయి. అధికారులు సైతం వీటినే ఫాలో.. అయి అప్రమత్తమవుతారు. ఈ అంచనాల ఆధారంగానే ఐఎండీ ప్రాంతీయ కార్యాలయాలు హెచ్చరికలు ఇస్తాయి. ఈ హెచ్చరికలు ప్రధానంగా నాలుగు రకాలు (గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్).

రెడ్ వార్నింగ్ అంటే వచ్చే 24 గంటల్లో కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసి వెల్లడిస్తారు. అంటే ఆ హెచ్చరిక జారీ చేసిన ప్రాంతంలో 200 మి.మీ.కుపైనే వర్షపాతం కురిసే ఛాన్స్ ఉందని అర్థం. ఐఎండీ రెడ్ వార్నింగ్ జారీచేస్తే పోలీసులు, మున్సిపల్ అధికారులు, ఎన్‌డీఆర్ఎఫ్ అధికారులు చర్యలు మొదలుపెట్టాలి. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం నివారించేందుకు చర్యలు తీసుకోవాలి. అంటే అధికారులకు చర్యలు తీసుకోవడంతోపాటుగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించేందే రెడ్ వార్నింగ్‌.

ఒక మోస్తరు వర్షపాతం అంటే: 15.6 మిల్లీ మీటర్ల నుంచి 64.4 మి.మీ.

భారీ వర్షం అంటే : 64.5 మి.మీ. నుంచి 115.5 మి.మీ.

అతి భారీ వర్షం అంటే : 115.6 మి.మీ. నుంచి 204.5 మి.మీ.

కుంభవృష్టి అంటే : 204.5 మీ.మీ కంటే ఎక్కువ

భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంటే ఆరెంజ్ అలర్టు ఇస్తారు. ఈ హెచ్చరిక ప్రకారం.. అధికారులు సిద్ధంగా ఉండాలి. అంతేకాదు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. పరిస్థితులను జాగ్రత్తగా గమనించాలని చెప్పేందుకు ఎల్లో అలర్టును జారీచేస్తారు. ఎందుకంటే.. ఎలాంటి విపత్త వచ్చేది తెలియదు జాగ్రత్తగా గమనిస్తూ ఉంటే.. ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంటే ఈ అలర్టును జారీచేస్తారు.

గ్రీన్ అలర్టును నో వార్నింగ్ గా అంటుంటారు. అంటే తేలికపాటి జల్లుల నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్న సమయంలో ఈ అలర్ట్ ను ఉపయోగిస్తారు. ఈ పరిస్థితుల్లో అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ అలర్టులనే అధికారులు ఫాలో అవుతారు. వాటి ఆధారంగా ఆయా ప్రాంతాల్లో చర్యలు తీసుకుంటారు. ప్రజలు కూడా వీటిని ఫాలో అయితే.. తాము నివసించే ప్రాంతంలో ఎలాంటి పరిస్థితి ఉందో ముందుగానే అర్థం చేసుకుని.. అప్రమత్తం కావొచ్చు. అంచనాల అనంతరం ఎంత వర్షపాతం కురిసిందో ఐఎండీ చెబుతుంది. ప్రధానంగా రెయిన్ గేజ్ సాయంతో ఈ వర్షపాతం కొలుస్తుంటారు.

అయితే ఈ హెచ్చరికలు కుండపోత వర్షాల ఫలితంగా నదిలో పెరుగుతున్న నీటి పరిమాణాన్ని బట్టి వరదల సమయంలో కూడా జారీ చేస్తారు. ఉదాహరణకు, నదిలో నీరు సాధారణ స్థాయి కంటే ఎక్కువ ఉంటే ఎల్లో అలర్ట్ జారీ చేస్తారు. హెచ్చరిక, ప్రమాద స్థాయిల సమయంలో చెబుతారు.

IPL_Entry_Point