Weather Updates Telugu States: గత రెండు రోజులుగా ఏపీ, తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ద్రోణి ప్రభావంతో మరో రెండు మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ ప్రకటన విడుదల చేసింది. ఉత్తర తమిళనాడు నుంచి కర్ణాటక మీదుగా కొంకన్ తీరం వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని హెచ్చరిచింది.,ఇక పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం, శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిస్తాయని హెచ్చరించింది. ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భధ్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతోకూడిన వర్షం కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించింది. ఇక పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయని వెల్లడించింది. 30 -40కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది.,హైదరాబాద్‌లో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. గడిచిన రెండు రోజుల్లో భద్రాచలంలో అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక శుక్రవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలుచోట్ల భారీ వర్షం కురిసింది. భారీ వర్షాల నేపథ్యంలో… ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. వర్షం పడే సమయంలో చెట్ల కింద ఉండవద్దని సూచిస్తున్నారు. ఇక పంటల విషయంలో రైతులు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. వడగండ్లు కురుస్తున్న నేపథ్యంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రైతులను అప్రమత్తం చేసింది. ఈ మేరకు పలు సూచనలు కూడా చేసింది.,భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నందున అధిక వర్షపు నీరు బయటకు పోయేందుకు ఆరుతడి, కూరగాయలు పండించే పొలంలో మురుగు కాలువలు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది. కోసిన పంటలను ముందు జాగ్రత్తగా సురక్షిత ప్రాంతానికి తరలించాలి. మార్కెట్‌కు తరలించిన ధాన్యం తడవకుండా టార్పాలిన్‌తో కప్పి ఉంచాలి. కోతకు సిద్ధంగా ఉన్న కూరగాయ పంటలను వెంటనే కోసుకోవాలని పేర్కొంది.,ఇక ఏపీలోని పలు ప్రాంతాల్లో కూడా వర్షాలు పడుతున్నాయి. రాయలసీమ ప్రాంతంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఇక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, మన్యం, అనకాపల్లి, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది.,