TS Weather : ఇవాళ, రేపు అత్యంత భారీ వర్షాలు! - ఈ జిల్లాలకు 'రెడ్ అలర్ట్'
Telangana Rains Updates: తెలంగాణకు మరోసారి రెయిన్ అలర్ట్ ఇచ్చింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. గురువారం అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ అయింది.
Telangana Rains: తెలంగాణపై వరుణుడు పంజా విసురుతున్నాడు. గడిచిన పది రోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఇప్పటికే చాలా జిల్లాల్లోని వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి. ప్రాజెక్టులు నిండిపోవటంతో... గేట్లు ఎత్తి దిగువనకు నీటిని విడుదల చేస్తున్నాయి. పలు పట్టణాల్లోని చాలా కాలనీలు జలదిగ్భందంలోనే ఉన్నాయి. ఇదిలా ఉండగానే... మరోసారి వాతావరణశాఖ తెలంగాణకు బిగ్ అలర్ట్ ఇచ్చింది. గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. శుక్రవారం ఉదయం ఈ పరిస్థితి ఉంటుందని తెలిపింది. అసాధారణమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది.

రెడ్ అలర్ట్ ఇచ్చిన జిల్లాలు:
నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి,
ఆరెంజ్ అలర్ట్:
ఆదిలాబాద్, కుమురంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి,
ఎల్లో అలర్ట్:
హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల,
గురువారం నుంచి శుక్రవారం ఉదయం వరకు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అతిభారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్‌గిరి, జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శుక్రవారం నుంచి శనివారం వరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, భువనగిరి, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది.
ఆపరేషన్ సక్సెస్…
జయశంకర్ భూపాలపల్లి జిల్లా మోరంచపల్లి గ్రామస్తులు అందరూ సురక్షితంగా బయపడ్డారు. హెలికాప్టర్లు, బోట్ల ద్వారా గ్రామస్తులను రక్షించారు అధికారులు. సహాయక చర్యల్లో 2 హెలికాప్టర్లు పాల్గొన్నాయి. గ్రామం మొత్తాన్ని అధికారులు ఖాళీ చేయించారు. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో నీటమునిగిన 108 గ్రామాల నుండి మొత్తం 10,696 మంది ప్రజలను బోట్లు, హెలికాప్టర్ల ద్వారా సురక్షితంగా రక్షించి పునరావాస కేంద్రాలకు తరలించారు.
మరోవైపు రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. శుక్రవారం అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. శనివారం మొహర్రం సెలవు కావడంతో ప్రభుత్వ విద్యాసంస్థలు అన్నీ సోమవారం తెరుచుకోనున్నాయి.