TS Rains Update: తెలంగాణలో వానలే వానలు, మూడ్రోజుల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి అలర్ట్-imd alert that heavy to very heavy rains will occur in telangana for three days ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Rains Update: తెలంగాణలో వానలే వానలు, మూడ్రోజుల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి అలర్ట్

TS Rains Update: తెలంగాణలో వానలే వానలు, మూడ్రోజుల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి అలర్ట్

Sarath chandra.B HT Telugu

TS Rains Update: తెలంగాణలో రాగల మూడ్రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

తెలంగాణలో రాగల మూడ్రోజుల్లో భారీ వర్షాలు (Hindustan Times)

TS Rains Update: తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కొనసాగుతున్నాయి. గత మూడు నాలుగు రోజులుగా పలు ప్రాంతాల్లో ముసురు వాతావరణం కొనసాగుతోంది. బుధవారం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేస్తోంది. గురువారం నుంచి మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఐఎండి అంచనాలతో పలు జిల్లాలకు ఆరెంజ్‌ రంగు హెచ్చరికలు జారీ చేసింది.

రాష్ట్రంలోని తూర్పు, ఉత్తర తెలంగాణ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండి సూచించింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో గరిష్టంగా 11.5 నుంచి 20 సెం.మీ. వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని ఐఎండి అంచనా వేస్తోంది. అల్పపీడన ప్రభావంతో ఈదురు గాలులకు చెట్లు, విద్యుత్‌ స్తంభాలు విరిగి పడటం, విద్యుత్‌ సరఫరా స్తంభించడం, లోతట్టు ప్రాంతాల్లో వరద ముంపు ఏర్పడటం వంటివి జరుగుతాయని ఐఎండి పేర్కొంది.

వచ్చే మూడ్రోజుల్లో…

రానున్న మూడ్రోజుల్లో పలు ప్రాంతాల్లో వర్షాలు కురువనున్నాయి. గురువారం కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవొచ్చని ఐఎండి పేర్కొంది.

ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సూర్యాపేట, వరంగల్, నల్గొండ, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయి.

శుక్రవారం ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు నమోదవుతాయని ఐఎండి పేర్కొంది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో వర్షాలు భారీగా కురుస్తాయి.

శనివారం రాష్ట్రంలోని ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండి పేర్కొంది. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల్లో భారీగా వానలు పడనున్నాయి.

జోరు వానలో తడిచి ముద్దవుతున్నారు…

మంగళవారం తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు నమోదు అయ్యాయి. కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లా దహెగాం మండలంలోని కుంచవెల్లిలో 13.2 సెంటీ మీటర్ల వర్షం నమోదైంది. ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ మండలం సోనాలలో 7.8 సెం.మీ, మంచిర్యాల జిల్లా కన్నెపల్లిలో 7.6సెం.మీ, ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో 5.5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. వికారాబాద్, మెదక్, ములుగు, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లో సాధారణ నుంచి ఓ మోస్తరు వర్షాలు నమోదయ్యాయి.