DTO Arrest: అక్రమాస్తుల కేసు, మహబూబా బాద్ డీటీవో అరెస్టు.., రూ.కోట్లు కూడబెట్టినట్టు నిర్ధారణ-illegal assets case arrest of mahbooba bad dto confirmed to have accumulated rs ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Dto Arrest: అక్రమాస్తుల కేసు, మహబూబా బాద్ డీటీవో అరెస్టు.., రూ.కోట్లు కూడబెట్టినట్టు నిర్ధారణ

DTO Arrest: అక్రమాస్తుల కేసు, మహబూబా బాద్ డీటీవో అరెస్టు.., రూ.కోట్లు కూడబెట్టినట్టు నిర్ధారణ

HT Telugu Desk HT Telugu
Aug 13, 2024 05:56 AM IST

DTO Arrest: ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో మహబూబాబాద్ డీటీవో గౌస్ పాషాకు ఏసీబీ అధికారులు షాక్ ఇచ్చారు. ఆదివారం ఆయనతో పాటు మరికొందరిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. దీంతో ఆర్టీఏ వర్గాల్లో అలజడి చెలరేగింది. ఏసీబీ దర్యాప్తులో గౌస్ పాషా కోట్లాది రుపాయలు కూడబెట్టినట్టు గుర్తించారు.

మహబూబాబాద్‌లో కలకలం సృష్టించిన ఏసీబీ దాడులు
మహబూబాబాద్‌లో కలకలం సృష్టించిన ఏసీబీ దాడులు

DTO Arrest: మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని రవాణా శాఖ కార్యాలయంలో ఈ ఏడాది మే నెల 28వ తేదీన అవినీతి నిరోధక శాఖ అధికారులు అకస్మాత్తుగా సోదాలు నిర్వహించారు. తనిఖీల సమయంలో ఏజెంట్ల నుంచి పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నారు. డీటీవో గౌస్ పాషా డ్రైవర్ సుబ్బారావు నుంచి కూడా లెక్కలో లేని డబ్బులు ఉండటంతో ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

రూ. 2.97 కోట్ల లావాదేవీలు

డీటీవో గౌస్ పాషా డ్రైవర్ సుబ్బారావుని అదుపులోకి తీసుకున్న తరవాత అధికారులు విచారించారు. లోతుగా విచారణ చేపట్టిన అధికారులకు విస్తు పోయే నిజాలు బయటపడ్డాయి.

డ్రైవింగ్ లైసెన్స్, లర్నింగ్ లైసెన్సులు, వివిధ రకాల సర్టిఫికెట్లు ఇలా ఎన్నో రకాల అవసరాలకు ఆఫీసులకు వచ్చే వారి నుంచి అడ్డగోలుగా డబ్బులు వసూలు చేశారు. ప్రతి రోజు వచ్చిన లంచాల అమౌంట్ ను క్లియర్ గా రాసి సుబ్బారావు డీటీవో గౌస్ పాషా కు ఫొటోలు తీసి పంపించేవాడు.

ఇలా ఏసీబీ అధికారులకు లభించినవే కోటిన్నరకు పైగా ఉన్నాయి. వాటితో పాటు డీటీవో గౌస్ పాషా కు సంబంధించిన ఇద్దరు దగ్గరి బంధువులకు కూడా సుబ్బారావు డబ్బులు పంపేవాడనీ తేల్చారు. అందులో గౌస్ పాషా కొడుకు ఆరీఫ్, మరొకరు మునీర్ అనే వ్యక్తి ఉన్నాడు. ఇవేగాక గౌస్ పాషా కరీంనగర్ లో పని చేసిన సమయంలో నడిపిన లావాదేవీలు కూడా బయటకు వస్తుండటం గమనార్హం. అవి కూడా మరో రెండున్నర కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా కేసుతో సంబంధం ఉన్న డీటీవో గౌస్ పాషాతో పాటు డ్రైవర్ సుబ్బారావు, మరో ప్రైవేటు వ్యక్తి రామ్ గోపాల్ ను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి కోర్టుకు తరలించారు.

ఏసీబీ కి చిక్కిన పంచాయితీ స్పెషల్ ఆఫీసర్

గ్రామ పంచాయతీలో చేసిన పనులకు బిల్లులు చెల్లించేందుకు సంతకం చేయాల్సిన ఓ స్పెషల్ ఆఫీసర్ లంచం ఆశించాడు. 15 వేలు లంచం డిమాండ్ చేసి చివరకు 6 వేలు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య, బాధితులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో ఇరిగేషన్ ఏఈగా పని చేస్తున్న గుగులోతు గోపాల్ ఇదే మండలములోని గుడికుంట తండాకు స్పెషల్ ఆఫీసర్ గా గత ఫిబ్రవరిలో నియామకం అయ్యాడు. ఇంతవరకు బాగానే ఉండగా.. గుడికుంట తండా పంచాయతీకి చెందిన బానోతు యాకుబ్ రెండు పర్యాయాలు సర్పంచిగా, ఒకసారి ఎంపీటీసీ గా గా పని చేశాడు.

చివరిసారిగా తన భార్య సర్పంచ్ పదవి చేపట్టగా.. తమ పదవీకాలంలో బానోత్ యాకుబ్ పంచాయతీకి చెందిన ట్రాక్టర్ డీజిల్, ఇతర అవసరాల కోసం రూ. లక్షకు పైగా పనులు చేపట్టాడు. వాటికి సంబంధించిన బిల్లులు రావల్సి ఉండగా.. దానిపై పంచాయతీ స్పెషల్ ఆఫీసర్ గా విధులు నిర్వర్తిస్తున్న ఇరిగేషన్ ఏఈ గుగులోత్ గోపాల్ సంతకం చేయాల్సి ఉంది. దీంతో తనకు రావల్సిన బిల్లు కోసం యాకుబ్ పలుమార్లు గోపాల్ ను సంప్రదించాడు.

కాగా తాను సంతకం పెట్టాలంటే తనకు రూ.15 వేలు ఇవ్వాలని ఏఈ గోపాల్ డిమాండ్ చేశాడు. ఇరువర్గాల చర్చల అనంతరం రూ.6 వేలు ఇచ్చేందుకు యాకుబ్ ఒప్పుకున్నాడు. ఆ తరువాత లంచం ఇచ్చేందుకు సుముఖంగా లేని యాకుబ్ వరంగల్ ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఆ తరువాత ఏసీబీ అధికారుల పథకం మేరకు ఏఈ గోపాల్ అడిగిన రూ.6 వేలను ఇచ్చేందుకు యాకుబ్ సోమవారం హనుమకొండకు వచ్చాడు. నక్కలగుట్ట ఎస్బీఐ వద్ద యాకుబ్ నుంచి లంచం తీసుకున్న అనంతరం ఏసీబీ అధికారులు ఎంట్రీ ఇచ్చి ఏఈ గోపాల్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

( రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)