Smita Sabharwal: తెలంగాణ ఐఏఎస్ అధికారి స్మితా సభర్వాల్ మరో వివాదంలో చిక్కుకున్నారు. స్మితా వాహనానికి వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి చెల్లింపులు జరపడంపై ఆడిట్ అధికారులు అభ్యంతరం తెలపడంతో ఆమె నుంచి వాహనం అద్దె రికవరీకి చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారు. 90 నెలల్లో రూ.61 లక్షల్ని అద్దె కారు కోసం చెల్లించడంపై స్మితా సభర్వాల్‌కు నోటీసులు ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ వర్సిటీ భావిస్తోంది.
బీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ ముఖ్యమంత్రి కార్యాలయంలో అదనపు ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. ఆ సమయంలో ఆమె వాహనానికి అద్దె కోసం రూ.61 లక్షలను తెలంగాణ వ్యవసాయ వర్సిటీ నిధుల నుంచి చెల్లించారు. ఈ చెల్లింపులను ఆడిట్ తనిఖీల్లో తప్పు పట్టడంతో ఆమెకు నోటీసులు జారీ చేయాలని వర్శిటీ పాలకమండలి నిర్ణ యించింది. త్వరలో స్మితా సభర్వాల్‌కు నోటీసులు జారీ చేయాలని యోచిస్తున్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యా లయం నుంచి 90 నెలల పాటు సభర్వాల్ వినియోగించిన వాహణానికి అద్దె చెల్లించారు. ఇన్నోవా కారుకు నెలకు రూ.63000 చొప్పున చెల్లించారు.
2016 అక్టోబరు నుంచి 2024 మార్చి వరకు స్మితా సభర్వాల్ కారుకు అద్దె రూపంలో ఈ మొత్తాన్ని చెల్లించారు. వర్సిటీ ద్వారా జరిగిన చెల్లింపుల్లో ఇన్నోవా కారు TS 08 EA 6345 వాహనానికి అద్దె చెల్లించారు. ఈ కారుకు ట్యాక్సీ ప్లేట్ లేదు. వ్యక్తిగత వాహనాలను అద్దెకు తీసుకోవడం ద్వారా ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్టు గుర్తించారు. పవన్ కుమార్ అనే వ్యక్తి పేరు మీద ఉన్న కారును స్మితా సర్వీసులో ఉండగా వినియోగించారు. స్మితా సభర్వాల్ కార్యాలయం నుంచి ప్రతి నెలా వాహనం అద్దె రశీదులు రావడంతో వర్సిటీ యాజమాన్యం వాటికి డబ్బు చెల్లించింది.
స్మితా సభర్వాల్ సిఎంఓలో పనిచేస్తుండగా వర్శిటీ ఎందుకు అద్దె చెల్లించాల్సి వచ్చిందని ఆడిట్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో సీఎంవో అదనపు కార్యదర్శి హోదాలో ఉన్న స్మితాకు వ్యవసాయ వర్సిటీ నుంచి వాహన అద్దె ఎందుకు చెల్లించారనే అంశంతోపాటు ఆర్థిక, విధానపరమైన మరో 12 అంశాలపై కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆడిట్ జనరల్ అధికారుల బృందం ప్రశ్నించినట్లు తెలుస్తోంది.
2024 ఆగస్టు నుంచి డిసెంబరు వరకు వ్యవసాయ వర్సిటీలో నిర్వహించిన ఆడిట్‌లో ఈ అంశాలు వెలుగు చూశాయి. ఆడిట్ గుర్తించిన 12 అభ్యంతరాల్లో ప్రస్తుత పర్యాటక శాఖ కార్యదర్శి స్మితా సభర్వాల్ అద్దె కారు చెల్లింపులు కూడా ఉన్నాయని వీసీ జానయ్య తెలిపారు.
మరోవైపు కారు అద్దె చెల్లింపు విషయంలో నిబంధనల మేరకు చెల్లింపులు జరిగినట్టు స్మితా సభర్వాల్ మీడియాకు వివరించారు. 2023 నవంబరు వరకే సీఎం కార్యాలయంలో ఉన్నానని, 2024 మార్చి వరకు వాహనం అద్దె తీసుకున్నాననేది సరికాదని వివరణ ఇచ్చారు.
సంబంధిత కథనం