ముఖ్యమంత్రిని ప్రసన్నం చేసుకోడానికి మూడు నెలల్లో పదవీ విరమణ చేయబోతున్న ఐఏఎస్ అధికారి పాదాభివందనం చేయడం తెలంగాణ దుమారం రేపింది. నగర కర్నూల్ జిల్లా అచ్చంపేటలో జరిగిన ఇందిర సౌర గిరి జలవికాసం కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ అధికారి శరత్ సీఎం రేవంత్ రెడ్డి కాళ్లకు మొక్కేందుకు ప్రయత్నించడం వివాదాస్పదం అయ్యింది.
సీఎం కాళ్లకు మొక్కేందుకు ఐఏఎస్ అధికారి ప్రయత్నించిన వ్యవహారంపై తెలంగాణ సీఎస్ రామకృష్ణరావు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆలిండియా సర్వీస్ అధికారుల ప్రవర్తన హుందాగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉత్తర్వులు జారీ చేశారు.
కొందరు ఏఐఎస్ అధికారులు తమ స్థాయికి తగ్గట్టుగా వ్యవహరించక పోవడం ప్రభుత్వం దృష్టికి వచ్చిందని, బహిరంగ సమావేశాల్లో అనుచిత ప్రవర్తన తగదని సీఎస్ హెచ్చరించారు.
ప్రజలను కలిసే సమయాల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు అత్యున్నత స్థాయిలో వృత్తిపరమైన పనితీరును ప్రదర్శించాలని, విధి నిర్వహణలో నిజాయితీతో ఉండాలని పేర్కొన్నారు. ప్రజల్లో గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి అధికారుల తీరు మారాలని, సభలు, సమావే శాల్లో ఏఐఎస్ అధికారులు హుందాగా ప్రవర్తించక పోతే.. ప్రజల్లో వారిపై విశ్వాసం సన్నగిల్లుతుందని సూచించారు.
1968 నాటి ఆలిండియా సర్వీసెస్ ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తే.. క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని అనుచిత ప్రవర్తనపై కఠిన చర్యలు తప్పవని సీఎస్ హెచ్చరించారు. సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట సభలో ఐఏఎస్ అధికారి శరత్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాదాభివందనం చేసేందుకు ప్రయత్నించారు.
ఈ ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో ఆలిండియా సర్వీస్ అధికారులకు చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. గతంలో కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారిణి స్మితా సభర్వాల్ సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్ట్ వివాదం కావడంతో ప్రభుత్వం ఆమె వివరణ కోరింది.
గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి శరత్ మరో మూడు నెలల్లో పదవీ విరమణ చేయనున్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టర్‌గా పనిచేసే సమయంలో అప్పటి సీఎం కేసీఆర్ కాళ్లను మొక్కడం వివాదాస్పదం అయ్యింది. వయసులో పెద్ద వ్యక్తి కావడంతో ముఖ్యమంత్రి కాళ్ళను మొక్కినట్టు అప్పట్లో ఆయన వివరణ ఇచ్చారు. తాజాగా సీఎం రేవంత్ కాళ్లకు మొక్కడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేయడంతో సీఎస్ మెమో జారీ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.
సంబంధిత కథనం