Hyundai Mega Test Center : తెలంగాణలో హ్యుందాయ్ కార్ల మెగా టెస్ట్ సెంటర్, సీఎం రేవంత్ రెడ్డి బృందంతో చర్చలు
Hyundai Mega Test Center : పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ కొరియాలో పర్యటిస్తున్నారు. సోమవారం హ్యుందాయ్ మోటార్ కంపెనీ ప్రతినిధులతో సీఎం రేవంత్ రెడ్డి బృందం చర్చలు జరిపింది. ఈ సంస్థ తెలంగాణలో కార్ల మెగా టెస్ట్ సెంటర్ ఏర్పాటుకు అంగీకారం తెలిపింది.
Hyundai Mega Test Center : దక్షిణ కొరియా ఆటోమోటివ్ దిగ్గజం హ్యుందాయ్ మోటార్ కంపెనీ దాని భారతీయ విభాగమైన హ్యుందాయ్ మోటార్ ఇండియా ఇంజినీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ (HMIE) ద్వారా తెలంగాణలో కార్ల మెగా టెస్ట్ సెంటర్‌ను స్థాపించాలని యోచిస్తోంది. మెగా టెస్ట్ సెంటర్‌లో ఆటోమేటివ్ టెస్ట్ ట్రాక్ సదుపాయంతో పాటు అత్యాధునిక టెస్ట్ కార్ల తయారీ సౌకర్యం (EVలతో సహా) ఉంటుంది. అలాగే హైదరాబాద్‌లో ఉన్న ఇంజినీరింగ్ కేంద్రం పునరుద్ధరణ, ఆధునీకరణ, విస్తరణ ద్వారా హెచ్ఎంఐఈ భారతదేశం సహా ఆసియా పసిఫిక్ ప్రాంతంలో మరింత ఉపాధిని కల్పించనుంది.
తెలంగాణకు పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం దక్షిణ కొరియాలో పర్యటిస్తోంది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సియోల్‌లో హ్యుందాయ్ మోటార్ కంపెనీ అధికారులతో సోమవారం సమావేశమయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి బృందం చర్చల అనంతరం హెచ్ఎంఐఈ ప్రతినిధులు మాట్లాడుతూ భారతదేశం తమకు చాలా ముఖ్యమైన మార్కెట్ అని, భారతీయ వినియోగదారుల కోసం బెంచ్‌మార్క్ సెట్టింగ్ ఉత్పత్తులు, సాంకేతికత అభివృద్ధికి తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు. అత్యాధునిక పరీక్షా సౌకర్యాల అభివృద్ధి చేసేందుకు తమకు అవకాశం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు హెచ్ఎంఐఈ ప్రతినిధులు తెలిపారు.
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ దిగ్గజ కంపెనీల నుంచి పెట్టుబడులను తెలంగాణలో పెట్టించేందుకు తమ ప్రభుత్వం దృష్టి సారించిందన్నారు. హ్యుందాయ్ మోటార్ కంపెనీ తన అనుబంధ సంస్థ HMIE ద్వారా తెలంగాణలో కార్ టెస్టింగ్ సదుపాయం నెలకొల్పేందుకు పెట్టుబడులు పెట్టాలని ప్రణాళిక రచిస్తోందన్నారు. రాష్ట్రం అనుసరిస్తున్న పారిశ్రామిక స్నేహపూర్వక విధానాలు, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాల ఏర్పాటు, ఆటంకాలు లేని అనుమతుల వ్యవస్థతో ప్రగతిశీల, భవిష్యత్ ను దృష్టిలో ఉంచుకొని తెలంగాణలో వ్యాపారం చేసేందుకు HMIE వంటి అత్యుత్తమ-తరగతి కంపెనీలు ముందుకు వస్తున్నాయని తెలిపారు. హెచ్ఎంఐఈ మెగా టెస్ట్ సెంటర్ సమీపంలోని సౌకర్యాలు ఇతర అనుబంధ సంస్థలు, సరఫరాదారులను ఆకర్షించే అవకాశం ఉంది. ఇది ప్రత్యక్షంగా, పరోక్షంగానూ భారీగా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు దోహదపడుతుందన్నారు.
రూ.31 వేల కోట్ల పెట్టుబడులు
సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడులను ఆకర్షించేందుకు చేపట్టిన విదేశాల టూర్ సత్ఫలితాలను ఇస్తోంది. ఇప్పటికే అమెరికా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి రూ.31,532 కోట్ల విలువైన పెట్టుబడులతో 19 కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న అనంతరం దక్షిణ కొరియాకు చేరుకోగా.. అక్కడా సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. కాగా దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సోమవారం వివిధ కొరియన్ కంపెనీల ప్రతినిధులతో సమావేశం అయ్యారు. గ్లోబల్ కంపెనీల అధినేతలు, బిజినెస్ గ్రూపులతో సమావేశాలు, చర్చలు జరిపారు. రేవంత్ రెడ్డి పిలుపు మేరకు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు కొరియా టెక్స్ టైల్ ఫెడరేషన్ సానుకూలంగా స్పందించింది. ఇందులో భాగంగా వరంగల్ లోకి కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు కొరియన్ కంపెనీలు సానుకూలంగా స్పందించాయి. ఈ మేరకు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయి.
కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో జరిగిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. టెక్స్‌టైల్ రంగం విస్తృత్తికి తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న కార్యాచరణ స్థానిక కంపెనీలతోపాటు ప్రపంచ స్థాయి కంపెనీలకు కూడా అనుకూలంగా ఉందని సీఎం తెలిపారు. వరంగల్ మెగా టెక్స్‌టైల్ పార్కులో పెట్టుబడులకు సంబంధించిన అవకాశాలను ముఖ్యమంత్రి వివరించారు. యంగాన్ కార్పొరేషన్ చైర్మన్ కియాక్ సంగ్ కొరియా ఫెడరేషన్ ఆఫ్ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ సొయంగ్ జూ సహా 25 అగ్రశ్రేణి టెక్స్‌టైల్ కంపెనీల అధినేతలు ఈ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వెంట పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, ఉన్నతాధికారులు కూడా సమావేశంలో పాల్గొన్నారు.
ప్రస్తుతం మూడు కంపెనీలు
వరంగల్ జిల్లా సంగెం, శాయంపేట మండలాల మధ్యలో ఉన్న చింతలపల్లి వద్ద కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ ఏర్పాటుకు గత ప్రభుత్వం అడుగులు వేసింది. ఇందులో భాగంగా చుట్టుపక్కల వివిధ గ్రామాలకు చెందిన రైతుల నుంచి 2016 నుంచి దశలవారీగా 1,357 ఎకరాలు సేకరించింది. 2017 అక్టోబర్ 22న అప్పటి సీఎం కేసీఆర్ పార్క్ కు శంకుస్థాపన చేయగా.. ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి మొదట్లో కొన్ని కంపెనీలు ఆసక్తి చూపాయి. కాగా ఆయా కంపెనీల ద్వారా ప్రత్యక్షంగా 33 నుంచి 34 వేల మందికి, పరోక్షంగా మరో 30 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని గత పాలకులు చెప్పుకుంటూ వచ్చారు. ఇదిలా ఉంటే ఆ తరువాత యంగాన్, కైటెక్స్, గణేశా ఎకో టెక్ కంపెనీ ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి.
కాగా ఇందులో యంగాన్ కంపెనీ ద్వారా 21 వేల మందికి, కైటెక్స్ తో 12 వేలు, గణేశా ఎకో కంపెనీ ద్వారా వెయ్యి వరకు ఉద్యోగాలు లభిస్తాయని చెప్పుకొచ్చారు. గణేశా ఎకో టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఒక్కటే రెండు సంవత్సరాల కిందట పనులు ప్రారంభించింది. మిగతా కంపెనీల అడుగుల మాత్రం ముందుకు పడలేదు. ఇదిలా ఉంటే యంగాన్, కైటెక్స్ తో పాటు మరికొన్ని కంపెనీలు తొందర్లోనే పనులు ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి టూర్ లో భాగంగా పెట్టుబడులు పెట్టేందుకు మరిన్ని కంపెనీలు ముందుకు వస్తే ఓరుగల్లు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
సంబంధిత కథనం