Hyena Attack: సిద్దిపేటలో గొర్రెల మందపై హైనాల దాడి, 70గొర్రెలు మృతి, లక్షల్లో నష్టం
Hyena Attack: సిద్ధిపేటలో హైనాల గుంపు దాడిలో 70 గొర్రెలు మృతి చెందగా,మరో 30 గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి.
Hyena Attack: సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మాచాపూర్ గ్రామంలో గొర్రెల మందపై హైనాలు దాడిచేసిన ఘటన గురువారం చోటుచేసుకుంది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం మాచాపూర్ గ్రామానికి చెందిన రైతు పున్నం మల్లయ్య తన వ్యవసాయ పొలం వద్ద గొర్రెలు,మేకల కోసం ఇనుప జాలితో షెడ్ ఏర్పాటు చేశాడు.
మల్లయ్య రోజులాగానే బుధవారం సాయంత్రం వరకు గొర్రెల మందను మేపి అనంతరం వాటిని షెడ్లో ఉంచి ఇంటికి వెళ్లాడు. రాత్రి ఒంటి గంట సమయంలో వర్షం పడటంతో వడ్లు తడుస్తాయని బావి దగ్గరికి వెళ్లి వడ్లపై కవర్ కప్పి వచ్చాడు. అప్పుడు అక్కడ ఏ సంఘటన జరగలేదు.
గురువారం తెల్లవారుజామున షెడ్ వద్దకు వెళ్లేసరికి 70 గొర్రెలు మృతి చెందగా,మరో 30 గొర్రెలు తీవ్రంగా గాయపడి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో జీవనాధారమైన గొర్రెలు మృతి చెందడంతో రైతు మల్లయ్య కుటుంబసభ్యులు భోరున విలపిస్తున్నారు.
మృతి చెందిన జీవాల విలువ సుమారు రూ.6 లక్షలు …
గ్రామస్తుల ద్వారా సమాచారం అందుకున్న ఫారెస్ట్ రేంజ్ అధికారి ఇక్రమోద్దీన్,సెక్షన్ ఆఫీసర్ బుచ్చయ్య,బీట్ ఆఫీసర్ శ్రీకాంత్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. గొర్రెలపై దాడి చేసిన అడవి జంతువుల పాద ముద్రలను సేకరించారు.
జంతువుల పాద ముద్రల ఆధారంగా హైనాలు గొర్రెలపై దాడి చేసి ఉండొచ్చని తెలిపారు.గురువారం రాత్రి ఘటన జరిగిన పరిసర ప్రాంతాలలో బోను,కెమెరాలను ఏర్పాటు చేస్తామని ఫారెస్ట్ అధికారులు తెలిపారు. ఈక్రమంలో చుట్టుపక్కల గ్రామాల రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తీవ్ర గాయాలైన జీవాలకు పశువైద్యాధికారి మంజుల సిబ్బందితో కలిసి చికిత్స అందించారు. మృతి చెందిన జీవాల విలువ సుమారు రూ.6 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. విషయం తెలుసుకున్న ఎంపిపి ఘటన స్థలానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని ఓదార్చి,మనోడైర్యం చెప్పారు. ప్రభుత్వం నుండి ఆర్ధిక సహాయం అందేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు.
ఎద్దు దాడిలో రైతు మృతి…
ఎద్దు దాడిలో రైతు మృతి చెందిన సంఘటన మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం ఖాజాపూర్ తండాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే ఖాజాపూర్ తండాకు చెందిన దారావత్ ఛత్రియ(45) బుధవారం ఎడ్లను మేపడానికి పొలం వద్దకు వెళ్ళాడు.
ఈ క్రమంలో ఛత్రియ ఎడ్లను మేపుతుండగా అందులో ఒక ఎద్దు కొమ్ములతో అతనిని తీవ్రంగా గాయపరిచింది. అతనిని వెంటనే కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఛత్రియ గురువారం మృతి చెందాడు. మృతుడి భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
(రిపోర్టింగ్ ఉమ్మడి మెదక్ జిల్లా ప్రతినిధి)