అమీన్‌పూర్ పెద్ద చెరువులో ఎఫ్‌టీఎల్ సరిహద్దుల నిర్ధారణ పేరిట జరుగుతున్న దందాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘అమీన్‌పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల - జేఏసీ’ పేరుతో పలువురు దందాలకు పాల్పడుతున్నట్టు వచ్చిన ఫిర్యాదులను కమిషనర్ తీవ్రంగా పరిగణించారు. జేఏసీ తరఫున కొంతమంది డబ్బులు వసూలు చేస్తున్నట్టు రసీదులు, వాట్సాప్ సందేశాలను పరిశీలించారు.
అమీన్‌పూర్ చెరువు ఎఫ్‌టీఎల్ నిర్ధారణపై హైడ్రా చేస్తున్న కసరత్తును ఆసరాగా తీసుకుని ఎవరైనా దందాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయని కమిషనర్ హెచ్చరించారు. దందాలకు పాల్పడినవారిపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదులు చేయాలని బాధితులకు సూచించారు. హైడ్రా నుంచి కూడా కేసులు పెట్టాలని అధికారులను ఆదేశించారు.
అమీన్‌పూర్ చెరువులో నీట మునిగిన ప్లాట్ల యజమానులు ఎవరినీ ఆశ్రయించాల్సిన పని లేదని ఈ సందర్భంగా కమిషనర్ స్పష్టం చేశారు. దాదాపు 95 ఎకరాలుండే చెరువు 450 ఎకరాలకు ఎలా విస్తరించిందనే విషయమై హైడ్రా లోతైన విశ్లేషణ చేస్తోందని... ఈ విషయం ప్రభుత్వం దృష్టిలో కూడా ఉందన్నారు. గ్రామ రికార్డులు, సర్వే ఆఫ్ ఇండియా, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఇమేజీలతో సరిపోల్చడమే కాకుండా సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించి ఎఫ్‌టీఎల్ నిర్ధారణ పూర్తి చేస్తామని కమిషనర్ చెప్పారు.
జేఎన్‌టీయూ, ఐఐటీ కళాశాలలకు చెందిన వారి భాగస్వామ్యంతో ఒక కమిటీని వేసి ఎఫ్‌టీఎల్ నిర్ధారణ జరుగుతుందన్నారు. రెండు, మూడు నెలల్లోనే ఈ ప్రక్రియ పూర్తి అవుతుందన్నారు. నిష్పక్షపాతంగా... ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా అమీన్‌పూర్ చెరువు ఎఫ్‌టీఎల్( ఫుల్ ట్యాంక్ లెవెల్) నిర్ధారణ జరుగుతుందని.. అప్పటి వరకూ ఓపిక పట్టాలని సూచించారు.
నీట మునిగిన లే ఔట్ల ప్లాట్లను కాపాడేందుకు ఖర్చు అవుతుందని ఎవరైనా దందాలు చేస్తే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. అమీన్‌పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల - జేఏసీలో సభ్యులు కావాలంటే రూ. వేయి చెల్లించాలని.. తర్వాత గజానికి రూ. 500లు చొప్పున చెల్లిస్తే ప్రభుత్వ శాఖలలో సర్దుబాట్లు చేయాల్సి ఉంటుందని చెబుతూ వసూళ్లకు పాల్పడుతున్నారని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. అమీన్‌పూర్ పెద్ద చెరువు ముంపు బాధితుల - జేఏసీ ఛైర్మెన్ గా పరిచయం చేసుకుంటూ.. ఏకంగా ఒక రసీదు పుస్తకాన్ని ప్రచురించి.. చిరునామా(నండూరి) సత్యనారాయణ ఈ దందాలకు పాల్పడుతున్నారని బాధితులు వాపోయారు.
సంబంధిత కథనం