హైడ్రా 'మాన్సున్ ఎమర్జెన్సీ టీమ్స్' వచ్చేస్తున్నాయ్ - జులై 1 నుంచే విధులు-hydraa monsoon emergency teams ready in hyderabad limits ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  హైడ్రా 'మాన్సున్ ఎమర్జెన్సీ టీమ్స్' వచ్చేస్తున్నాయ్ - జులై 1 నుంచే విధులు

హైడ్రా 'మాన్సున్ ఎమర్జెన్సీ టీమ్స్' వచ్చేస్తున్నాయ్ - జులై 1 నుంచే విధులు

హైడ్రా మాన్సూన్ ఎమ‌ర్జ‌న్సీ టీమ్‌లు సిద్ధమయ్యాయి. మొత్తం 30 స‌ర్కిళ్ల‌లో 150 టీమ్‌లు జులై 1వ తేదీ నుంచి ప‌ని చేయ‌నున్నాయి. వ‌ర్షం ఎప్పుడు ప‌డినా అప్ర‌మ‌త్తంగా ఉండాలని కమిషనర్ ఏవీ రంగనాథ్ సూచించారు. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా చూడాల్సిన బాధ్య‌త ఉంద‌న్నారు.

మాన్సూన్ ఎమ‌ర్జ‌న్సీ టీమ్‌లు సిద్ధం - కమిషనర్ రంగనాథ్

వ‌ర్షాకాలం వ‌ర‌ద ముప్పు నుంచి న‌గ‌రాన్ని కాపాడేందుకు ఉద్దేశించిన మాన్సూన్ ఎమ‌ర్జ‌న్సీ టీమ్‌(ఎంఈటీ)లు సిద్ధ‌మ‌య్యాయి. టెండ‌ర్ల ప్ర‌క్రియ‌ను పూర్తి చేసిన త‌ర్వాత ఎంపిక చేసిన ఎంఈటీల‌కు స‌ర్కిళ్ల‌వారీ విధుల‌ను శ‌నివారం హైడ్రా అప్ప‌గించింది.

జూలై 1 నుంచి విధులు…

మొత్తం 30 స‌ర్కిళ్ల‌లో 150 టీమ్‌లు జులై 1వ తేదీ నుంచి ప‌ని చేయ‌నున్నాయి. విధి నిర్వ‌హ‌ణ‌లో ఎక్క‌డా ఎలాంటి అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శించ‌వ‌ద్ద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ గారు ఈ బృందాల‌కు సూచించారు. వ‌ర్షం ఎప్పుడు ప‌డినా అప్ర‌మ‌త్తంగా ఉండి.. ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బంది క‌ల‌గ‌కుండా చూడాల్సిన బాధ్య‌త ఉంద‌న్నారు.

వ‌ర్షానికి ముందే ర‌హ‌దారుల్లో నీరు వెళ్లేందుకు ఆటంకాలు లేకుండా చూడాల‌న్నారు. నాలాల‌ను, క‌ల్వ‌ర్టుల‌ను ప‌రిశీలించి.. వ‌ర‌ద నీటి ప్ర‌వాహం సాఫీగా సాగేలా జాగ్ర‌త్త‌ప‌డాల‌న్నారు. ఎక్క‌డ నీరు నిలుస్తుందో ముందుగానే ఒక అంచ‌నాకు వ‌చ్చి.. స‌మ‌స్య ప‌రిష్కారానికి చ‌ర్య‌లు తీసుకోవాలి. చెట్లు ప‌డిపోతే వెంట‌నే వాటిని తొల‌గించాలి.

150 ఎంఈటీ బృందాల‌కు హైడ్రా డీఆర్ ఎఫ్ బృందాలు కూడా స‌హ‌క‌రిస్తాయ‌ని.. స‌మ‌న్వ‌యంతో ప‌ని చేయాల్సిన‌వ‌స‌రం ఉంద‌ని చెప్పారు. వ‌ర‌ద నివార‌ణ చ‌ర్య‌ల‌కు అవ‌స‌ర‌మైన ప‌నిముట్ల‌ను అంద‌జేస్తుంద‌ని.. అలాగే సిబ్బందికి హైడ్రా శిక్ష‌ణ కూడా ఇస్తుంద‌ని అన్నారు.

ఎక్క‌డ ఏ స‌మ‌స్య ఉన్నా ఆయా ప్రాంతాల హైడ్రా ఎస్‌ఫ్‌వోల‌కు తెల‌యిజేయ‌డ‌మే కాకుండా.. ఆ స‌మాచారాన్ని హైడ్రా ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. ఈ వ‌ర్షాకాలం న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప‌ని చేసి.. మంచి గుర్తింపు పొందాల‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ దిశానిర్దేశం చేశారు.

మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.