HYDRAA : చెరువుల్లో మ‌ట్టి పోస్తే ఈ నంబర్‌కు సమాచారమివ్వండి - 'హైడ్రా' నుంచి మరో ప్రకటన-hydraa has issued an announcement to inform if mud is poured into the ponds ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hydraa : చెరువుల్లో మ‌ట్టి పోస్తే ఈ నంబర్‌కు సమాచారమివ్వండి - 'హైడ్రా' నుంచి మరో ప్రకటన

HYDRAA : చెరువుల్లో మ‌ట్టి పోస్తే ఈ నంబర్‌కు సమాచారమివ్వండి - 'హైడ్రా' నుంచి మరో ప్రకటన

Maheshwaram Mahendra Chary HT Telugu
Published Feb 12, 2025 10:27 AM IST

చెరువుల్లో మ‌ట్టి పోస్తే కేసులు నమోదు చేస్తామని హైడ్రా హెచ్చరించింది. ఈ మేరకు ప్రత్యేక ఫోన్ నెంబర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. చెరువుల్లో మట్టి పోస్తే ఈ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని ఓ ప్రకటనలో కోరింది.

హైడ్రా కీలక ప్రకటన
హైడ్రా కీలక ప్రకటన

చెరువుల‌లో మ‌ట్టి పోస్తున్న‌వారి స‌మాచారాన్ని తెలియ‌జేయాల‌ని హైడ్రా కోరింది. ఇందుకోసం ప్ర‌త్యేకంగా 9000113667 ఫోను నంబ‌ర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.అలాగే చెరువులో మ‌ట్టి పోస్తున్న లారీలు, టిప్ప‌ర్లు, ట్రాక్ట‌ర్లు, మ‌ట్టిని స‌ర్దుతున్న జేసీబీల‌ వీడియోల‌ను కూడా పంపించాల‌ని సూచించింది.

ఈ విషయంలో కాల‌నీ సంక్షేమ సంఘాల ప్ర‌తినిధుల‌తో పాటు.. క‌ళాశాల‌ల విద్యార్థులు, స్వ‌చ్చంద సంస్థ‌లు అంద‌రూ చేతులు క‌ల‌పాల‌ని హైడ్రా పిలుపునిచ్చింది. చెరువులను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని తెలిపింది.

పలువురిపై కేసులు నమోదు….

రాత్రీప‌గ‌లూ నిఘా ఉంచి నెల రోజుల్లో 31 లారీలను ప‌ట్టుకుని సంబంధిత వ్య‌క్తుల‌పై కేసులు నమోదు చేసినట్లు హైడ్రా ప్రకటించింది. ఇందులో లారీ ఓన‌ర్ల‌తో పాటు.. నిర్మాణ సంస్థ‌ల‌కు చెందిన వారు కూడా ఉన్నారని తెలిపింది. ఈ నిఘాను మరింత తీవ్ర‌త‌రం చేస్తామని పేర్కొంది.

చెరువుల్లో మ‌ట్టి నింపుతున్న వాహ‌న‌దారుల‌తో పాటు.. మ‌ట్టి త‌ర‌లించే కాంట్రాక్ట‌ర్లు, నిర్మాణ సంస్థ‌ల‌పైనా క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామని హైడ్రా స్పష్టం చేసింది. చెరువుల్లో మట్టి పోయవద్దని కోరింది.

ఆ కూల్చివేతలు హైడ్రా చేయలేదు:

జవహర్ నగర్లో కూల్చివేతలపై హైడ్రా ప్రకటన విడుదల చేసింది. ఆ కూల్చివేతలను స్థానిక రెవెన్యూ అధికారులు చేపట్టారని స్పష్టం చేసింది. కానీ హైడ్రా కూల్చినట్టు కొంత‌మంది తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. ఎక్కడ కూల్చివేతలు జరిగినా.. వాటిని మొత్తం హైడ్రాకు ఆపాదించవద్దని సూచించింది.

తప్పుడు ప్రచారాలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు హైడ్రా పేర్కొంది. ప్రజలను తప్పుదోవ పట్టించవద్దని కోరింది. స్పష్టమైన వివరాలను తెలుసుకోవాలని సూచించింది. తప్పుడు వార్తలను ప్రసారం చేయవద్దని ఓ ప్రకటన ద్వారా పేర్కొంది.

ప్రతి సోమవారం 'హైడ్రా ప్ర‌జావాణి':

హైదరాబాద్ నగర పరిధిలోని చెరువులు, నాలాల రక్షణే ప్రధాన ధ్యేయంగా హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ ఎస్సెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ(హైడ్రా)ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిదే. ఈ హైడ్రాకు ప్రభుత్వం విస్తృతాధికారాలను కల్పించింది. 

అక్రమ నిర్మాణాల విషయంలో దూకుడుగా ముందుకెళ్తున్న హైడ్రా… ప్రతి సోమవారం ప్ర‌జావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.  ఫిర్యాదుదారుల‌ నుంచి నేరుగా దరఖాస్తులను స్వీకరింస్తోంది.   కేవలం ఫిర్యాదులు మాత్రమే కాకుండా స‌ల‌హాల‌ను కూడా స్వీక‌రిస్తారు.

ప్రతి సోమవారం ఉద‌యం 11 గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 2.00 గంట‌ల వ‌ర‌కు ఈ కార్యక్రమం ఉంటుంది.  తిరిగి 3.00 గంట‌ల నుంచి 5.30 గంట‌ల వ‌ర‌కూ రాణిగంజ్‌లోని బుద్ధ‌భ‌వ‌న్‌లో ఫిర్యాదులను స్వీకరిస్తారు. 

ఫిర్యాదుకు సంబంధించిన అన్ని ఆధార ప‌త్రాల‌తో పాటు పూర్తి వివ‌రాలు అందించాల్సి ఉంటుంది. ఏమైనా సందేహాలుంటే 040 - 29565758, 29560596 నంబ‌ర్ల‌లో హైడ్రా కార్యాలయాన్ని సంప్ర‌దించవచ్చు. హైడ్రా ప్రజావాణికి ప్రజల నుంచి మంచి స్పందన కూడా వస్తోంది. ఇప్పటికే చాలా మంది నుంచి ఫిర్యాదులు అందాయి. వీటి ఆధారంగా క్షేత్రస్థాయిలో కూడా హైడ్రా అధికారులు పర్యటిస్తున్నారు. 

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.
Whats_app_banner

సంబంధిత కథనం