గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఫిర్యాదులు అందితే చాలు… క్షేత్రస్థాయి విచారణకు అధికారులు వెంటనే రంగంలోకి దిగిపోతున్నారు. అక్రమణకు గురైనట్లు తేలితే…. నోటీసులు ఇచ్చి నేలమట్టం చేస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ పరిధిలోనూ ఆక్రమణలను గుర్తించిన హైడ్రా…. తొలగించింది.
హైడ్రా ప్రకటించిన వివరాల ప్రకారం…. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 41 పెద్దమ్మ గుడికి దగ్గరలోని ఆక్రమణలపై ఫిర్యాదులు అందాయి. ఓ కిరాయిదారుడు నాలాతో పాటు పార్కు రహదారిని ఆక్రమించి అక్రమ కట్టడాలను నిర్మించాడు. ఓనర్ కు తెలియకుండానే ఇదంతా చేశాడు. రోడ్డు, నాలాను ఆక్రమించి హోటళ్లు, హాస్టల్ నడుపుతూ…. నెలకు రూ. 10 లక్షలు అద్దెలు వసూలు చేస్తున్నాడు.
ఈ కిరాయిదారుడి వ్యవహారంపై హైడ్రాకు ఫిర్యాదులు చేరాయి. దీనిపై విచారించిన హైడ్రా… గతంలోనే నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ సదరు కిరాయిదారుడు… కోర్టును ఆశ్రయించాడు. అయితే సదరు వ్యక్తికి కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కిరాయిదారుడుకి ఆ నిర్మాణాలపై ఎలాంటి హక్కు ఉండదని తేల్చి చెప్పింది. రోడ్డు, నాలాను ఆక్రమించి ఎలా కడతారని న్యాయస్థానం ప్రశ్నించింది.
కోర్టు ఉత్తర్వుతలతో హైడ్రా రంగంలోకి దిగింది. నాలాతో పాటు రోడ్డు ను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలను శుక్రవారం తొలగించింది. దీంతో దాదాపు 2 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న పార్క్ దారికి లైన్ క్లియర్ అయిందని హైడ్రా వివరించింది.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం, ఫిర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలోని గురువారం హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. కంచ పర్వతాపూర్ గ్రామం శ్మశాన వాటికలో వెలిసిన అక్రమ లే ఔట్‌ను, కట్టడాలను తొలగించింది.
ప్రభుత్వ భూమిలో 40 ఏళ్లకు పైగా సాగుతున్న శ్మశాన వాటికను కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి విక్రయాలు జరుపుతున్నారనే ఫిర్యాదుల మేరకు హైడ్రా ఈ చర్యలు తీసుకుంది. 3 షాపులతో పాటు.. 15 ప్లాట్లకు వేసిన పునాదులు, రెండు మీటర్ల ఎత్తులో నిర్మించిన ప్రహరీలను, అందులో వేసిన షెడ్డులను హైడ్రా తొలగించింది.
ఇక్కడ మూడు షాపులలో సామాన్లను తరలించడానికి కొంత సమయం కావాలని అడగగా.. వారికి హైడ్రా సహకరించింది. సామాన్లు మొత్తం తరలించిడంలోనూ హైడ్రా సిబ్బంది సహాయం చేశారు. మొత్తం సామాన్లు వాహనాలోకి ఎక్కించిన తర్వాత ఆ షాపులను కూడా హైడ్రా తొలగించింది.
సంబంధిత కథనం