HYDRAA Demolitions : అక్రమ నిర్మాణాలపై 'హైడ్రా' దూకుడు - కోమటికుంటలో కూల్చివేతలు
HYDRA Demolitions in Medchal: అక్రమ నిర్మాణలపై 'హైడ్రా' దూకుడుగా ముందుకెళ్తోంది. తాజాగా మేడ్చల్ జిల్లాలోని కోమటికుంటలో అక్రమ నిర్మాణాలను తొలగించింది. ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్ నిర్మాణాలను కూల్చివేసింది. చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలు ఉండటంతో హైడ్రా చర్యలు తీసుకుంది.

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. గురువారం మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా తూముకుంట మున్సిపాలిటీ పరిధిలో కూల్చివేతలను చేపట్టింది. కోమటికుంటలోని అక్రమ నిర్మాణాల తొలగించింది. ఈ మేరకు హైడ్రా వివరాలను ప్రకటించింది.
హైడ్రా ప్రకటించిన వివరాల ప్రకారం…. తూముకుంట మున్సిపాలిటీ, దేవరయాంజల్ గ్రామంలోని కోమటి కుంటలో గురువారం అక్రమ కట్టడాలను కూల్చివేశారు. ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలపై స్థానికుల నుంచి ఫిర్యాదులు రాగా హైడ్రా చర్యలు చేపట్టింది.
ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలు….
ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులతో పూర్తి స్థాయి విచారణ చేపట్టిన హైడ్రా రంగంలోకి దిగింది. కోమటి కుంట చెరువు పరిధిలో నిర్మించిన ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్వెన్షన్ కు ఎలాంటి నిర్మాణ అనుమతులు లేవని తేలింది. అలాగే చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఈ నిర్మాణాలు జరిగినట్టు వెల్లడి కావడంతో కూల్చివేతలకు హైడ్రా ఆదేశాలు ఇచ్చింది.
హైడ్రా నోటీసులపై ప్రకృతి రిసార్ట్స్, ప్రకృతి కన్మెన్షన్ ప్రతినిధులు హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిపింది. ఇరిగేషన్, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు ఇచ్చిన నివేదికల ఆధారంగా చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మించిన వాటిని కూల్చివేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చినట్లు హైడ్రా పేర్కొంది.
చెరువుల్లో మట్టి పోయవద్దు - హైడ్రా
చెరువులలో మట్టి పోస్తున్నవారి సమాచారాన్ని తెలియజేయాలని హైడ్రా కోరింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఇందుకోసం ప్రత్యేకంగా 9000113667 ఫోను నంబర్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. చెరువులో మట్టి పోస్తున్న లారీలు, టిప్పర్లు, ట్రాక్టర్లు, మట్టిని సర్దుతున్న జేసీబీల వీడియోలను కూడా పంపించాలని సూచించింది.
చెరువుల్లో మట్టి నింపుతున్న వాహనదారులతో పాటు.. మట్టి తరలించే కాంట్రాక్టర్లు, నిర్మాణ సంస్థలపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హైడ్రా స్పష్టం చేసింది. చెరువుల్లో మట్టి పోయవద్దని కోరింది.
అక్రమ నిర్మాణాల విషయంలో దూకుడుగా ముందుకెళ్తున్న హైడ్రా… ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఫిర్యాదుదారుల నుంచి నేరుగా దరఖాస్తులను స్వీకరింస్తోంది. కేవలం ఫిర్యాదులు మాత్రమే కాకుండా సలహాలను కూడా తీసుకుంటుంది.
ప్రతి సోమవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2.00 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. తిరిగి 3.00 గంటల నుంచి 5.30 గంటల వరకూ రాణిగంజ్‌లోని బుద్ధభవన్‌లో ఫిర్యాదులను స్వీకరిస్తారు. వచ్చే ఫిర్యాదులపై విచారణ జరిపి… క్షేత్రస్థాయిలోని పరిస్థితులను కూడా పరిశీలిస్తోంది. విచారణ అనంతరమే చర్యలు చేపడుతున్నట్లు హైడ్రా అధికారులు చెబుతున్నారు.
సంబంధిత కథనం