ఇల్లు కొనేందుకు రుణాలిచ్చే ముందు అన్ని విధాలా సరి చూసుకోవాలని బ్యాంకర్లకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. IOV హైదరాబాద్ బ్రాంచ్ ఆధ్వర్యంలో “ట్రాన్స్ఫార్మేటివ్ ఎరాలో వాల్యుయేషన్” అనే అంశంపై జరిగిన జాతీయ సదస్సులో ముఖ్య అతిథిగా రంగనాథ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు.
గతేడాది జులై 19న హైడ్రా ఏర్పడిందని రంగనాథ్ గుర్తు చేశారు. అంతకు ముందు వెలసిన నివాస ప్రాంతాలతో పాటు.. అనుమతులు పొంది నిర్మాణ దశలో ఉన్న వాటి జోలికి వెళ్లమని స్పష్టం చేశారు. హైడ్రా ఏర్పాటు అయిన తర్వాత అక్రమ కట్టడాలు వస్తే వాటిని తొలగిస్తామన్నారు. హైడ్రా అంటే కూల్చవేతలు కాదన్నారు. పర్యావరణ హితమైన నగరాభివృద్ధికి దోహదం చేసే సంస్థగా అందరూ గుర్తిస్తున్నారన్నారు. సుస్థిర వ్యాపారానికి హైడ్రా దోహదం చేస్తోందని అందరూ గ్రహిస్తున్నారు.
ఎలాంటి మోసాలకు ఆస్కారం లేకుండా సొంతింటి కలను సాకారం చేయడంలో రియల్ ఎస్టేట్ సంస్థలతో పాటు.. రుణాలు ఇచ్చే అర్థిక సంస్థలు కూడా బాధ్యతగా ఉండాలని రంగనాథ్ సూచించారు. సర్వే నంబరు ఒకటి చూపించి.. వేరే చోట ఇళ్ల నిర్మాణం చేపడుతున్నవారి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. సంబంధిత పేపర్లను పరిశీలించాం అనుకుంటే సరిపోదనీ... క్షేత్ర స్థాయిలో పరిశీలించాల్సిన బాధ్యత రుణాలు ఇచ్చిన సంస్థలపైనే ఉందని చెప్పారు. స్థిరాస్తుల విలువ నిర్ధారించడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత ఉపయోగంగా ఉన్నా.. క్షేత్రస్థాయి పరిశీలన కూడా అంతే ముఖ్యమన్నారు.
గొలుసుకట్టు చెరువులను పునరుద్ధరించి.. వరద ముప్పు లేని నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాలనేది హైడ్రా లక్ష్యమని రంగనాథ్ స్పష్టం చేశారు. ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను కాపాడేందుకు హైడ్రా ప్రాధాన్యతనిస్తోందన్నారు. ఓఆర్ ఆర్ పరిధిలో వెయ్యికి పైగా ఉన్న చెరువుల పునరుద్ధరణ జరిగి.. పార్కులన్నీ పచ్చగా ఉన్నప్పుడు పర్యావరణ సమతుల్యత సాధించగలమన్నారు. ఆ దిశగా హైడ్రా పని చేస్తోందని.. హైడ్రా వచ్చిన తర్వాత తీసుకున్న చర్యలతో ప్రతి ఒక్కరికీ చెరువు, నాలా హద్దులు తెలిశాయని చెప్పారు.